KCR | పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు

- కృష్ణా జలాలు ఐదు జిల్లాల జీవన్మరణ సమస్య
- అసెంబ్లీలో తీర్మానంతో అయిపోలేదు
- ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి
- కృష్ణా జలాల్లో వాటా వచ్చేదాక కొట్లాడాలి
- మమ్మల్ని బద్నాం చేసేందుకే మేడిగడ్డ వద్ద
- గోదావరి జిలాలను ఎత్తిపోయటం లేదు
- కాఫర్ డ్యాం ద్వారా కూడా నీళ్లు ఎత్తిపోయొచ్చు
- నా కట్టె కాలే దాక రాష్ట్రానికి అన్యాయం జరుగనీయ
- ప్రతిపక్షంలో ఉన్నా కదా.. రెస్టు తీసుకుందామనుకున్నా
- కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నది
- నల్లగొండ సభలో బీఆరెస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
KCR | విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారని బీఆరెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలు ఒక్క నల్లగొండ సమస్య కాదని, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్.. ఈ ఐదు జిల్లాల జీవన్మరణ సమస్యని చెప్పారు. ఇది రాజకీయ సభ కాదని, పోరాట సభని అన్నారు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదని స్పష్టం చేశారు. నీళ్లు పంచాలనుకుంటున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు, మన నీళ్లు ఎత్తుక పోవాలనుకుంటున్న శక్తులకు ఈ నల్లగొండ సభ ఒక హెచ్చరిక కావాలన్నారు.
కృష్ణా జలాల పరిరక్షణ ఉద్యమం పేరిట మంగళవారం నల్లగొండలో బీఆరెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేయగానే అయిపోలేదని, అన్ని పార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లి నీళ్ల వాటా వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు. ‘మీకు ఏమైందో.. పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు. ఏమైతుందో మూడు నెలల నుంచి చూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. మూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం కెఆర్‌ఎంబికి కృష్ణాజలాలను అప్పజెప్పిందని విమర్శించారు.
మమ్మల్ని బద్నాం చేసేందుకే నీటిని ఎత్తిపోయడం లేదు
మేడిగడ్డ కూలిపోతుందని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఎత్తిపోయడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ విషయంలో బీఆరెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు ఇవ్వాలనుకుంటే కాఫర్ డ్యాం ద్వారా కూడా నీళ్లు ఇవ్వొచ్చని కేసీఆర్ అన్నారు. ‘మేము కూడా మేడిగడ్డ పోతాం. నిజాలు నిగ్గుతేల్చుతం.. దమ్ముంటే నీళ్లు ఎత్తిపోసి రైతులు నీళ్లు ఇవ్వు’ అని రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదని చెప్పారు. ‘గతంలో నాగార్జునసాగర్, మూసి ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు ఇబ్బంది రాలేదా? ఇబ్బందులు వస్తే సరి చేయాలి’ అని చెప్పారు. కొత్త ప్రభుత్వం వస్తే.. పాత సర్కారు కన్నా మంచిగా పనులు చేయాలని కానీ.. కేసీఆర్ తిట్టడమే అభివృద్ధిగా కాంగ్రెస్ నాయకులు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దద్దమ్మల రాజ్యం ఇలానే ఉంటది
కేసీఆర్ గవర్నమెంట్ పోంగనే కరెంట్ కట్కా వేసినట్లే పోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దద్దమ్మల రాజ్యం ఉంటే అలానే ఉంటుందని అన్నారు. మిగులు కరెంట్ ఉన్నా తెలంగాణ రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు? ఏం రోగం పుట్టింది? అని సర్కారును నిలదీశారు. తెలంగాణ ప్రజలకు కరెంట్, నీళ్ళు ఇవ్వకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడిపే చేతకాక మందిమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు.
ఎన్ని మీకు?
రైతు బంధును అడిగితే చెప్పుతో కొడుతం అంటరా? ఎన్ని గుండెలు మీకు? అని కేసీఆర్ మండిపడ్డారు. ‘పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి.. రైతుల చెప్పులు గట్టిగా ఉంటాయి. ఒక్క చెప్పుతో కొడితే మాడు పండ్లు రాలుతాయ్. నల్లగొండలో మీటింగ్ పెడితే కేసీఆర్‌ను తిరగనివ్వం అంటారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను తిరగనివ్వరా? సంపుతారా? ఏం చేస్తారు? కేసీఆర్ తో పెట్టుకునే దమ్ము ఉన్నదా? కేసీఆర్‌ను చంపి మీరు ఉంటారా?’ అని నిప్పులు చెరిగారు.
కృష్ణా ట్రిబ్యునల్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొట్లాడాలన్న కేసీఆర్.. ఇదే మాట చెప్పేందుకు ఇంత దూరం నల్లగొండకు వచ్చానన్నారు. ‘ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. తెలంగాణ ప్రజల హక్కులు శాశ్వతం. తెలంగాణ ప్రజల వాటాలు శాశ్వతం. తెలంగాణ బతుకులు శాశ్వతం’ అని చెప్పారు. మళ్లీ తాము రెండు మూడింతల బలంతో అధికారంలోకి వస్తామని ప్రకటించారు.
అవగాహన లేని కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వానికి నదుల నీళ్లపై అవగాహన లేదని కేసీఆర్ అన్నారు. ‘నన్ను అడిగితే నేను చెప్పనా?’ అని ప్రశ్నించారు. కృష్ణా నదిలో న్యాయమైన వాటా తేలేవరకు ఎప్పటికప్పుడు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ప్రభుత్వాలు మంచిగా ఉంటాయని చెప్పారు. ‘ప్రతిపక్షంలోకి వచ్చాను కదా.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ రాష్ట్రాన్నిఈ ప్రభుత్వం ఆగం చేస్తున్నది’ అని మండిపడ్డారు. కృష్ణా జలాల హక్కుల సాధనకు పోరాటానికి సిద్ధంగా ఉండాలని, అవసరమైతే సద్దులు కట్టుకుని రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే మన హక్కులను సాధించుకోగలుగుతామని చెప్పారు. మీరంతా పులుల్లా కొట్టాడాలని ఉద్బోధించారు.
కృష్ణా జలాల హక్కులు సాధించేందుకే తాను తన కాలు విరిగినా.. కుంటి నడకతో కట్టె పట్టుకుని ఇంత ఆయాసంతో రావాల్సి వచ్చిందని తెలిపారు. కొందరికి ఇది రాజకీయమైతే.. మనం పెట్టింది పోరాట సభని చెప్పారు. ‘కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు.. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఇదే నల్లగొండలో 1,50,000 మంది మునుగోడు బిడ్డల నడుము వంగిపోయినయ్. ప్రధానమంత్రి టేబుల్ మీద పడుకోబెట్టి అయ్యా మా గోస తీర్చమని గోడు వెళ్లబోసుకున్నాం’ అని గుర్తు చేశారు. ఆనాడు పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నల్లగొండలో తమ బాధలు పోయినాయని జనం చెప్పుకొంటున్నారని పేర్కొన్నారు.
‘ఉద్యమంలాగా ఎగిసిపడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవడు కూడా మన రక్షణకు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడూ రాలే. ఓట్ల కోసం వస్తారు. నంగనాచి కబుర్లు చెప్పి తర్వాత ఎవరూ రాలే. ఇది జరిగిన చరిత్ర జరుగుతున్న చరిత్ర ఇది’ అన్నారు. ఈ సభ తెలంగాణ నీళ్లను తెలంగాణ నీళ్లెను దొబ్బిపోయే వారికి హెచ్చరిక అని చెప్పారు. ‘తెలంగాణలో నిమిషం పాటు కూడా కరెంట్ పోకుండా చేసిన. ప్రతి ఇంటికి నీళ్లు తెచ్చిన. చేయాలన్న దమ్ము, నా వాళ్ళు అనే తపన ఉంటే ఏదైనా సాధ్యం’ అని కేసీఆర్ అన్నారు. పాలమూరు ఎత్తిపోతల కోసం దేవరకొండ, నల్లగొండ ప్రజలు నోర్లు తెరుచుకొని ఉన్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు కోర్టులకు పోయిన, కేంద్రం నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకున్నామని తెలిపారు.
‘నీళ్ల వాటా కోసం సుప్రీం కోర్టుకు పోయిన ఇవ్వలే. ట్రిబ్యునల్‌కు పోయినా, వందల ఉత్తరాలు రాసిన ఫలితం లేకుండా పోయిందని, ఆ సమయంలో వారం రోజులు లోక్‌సభలో లొల్లి చేసి సాధించినం’ అని కేసీఆర్ గుర్తు చేశారు. ‘మీకు ఏం ఐనదో.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. తన కట్టె కాలే వరకూ తెలంగాణకు అన్యాయం జరుగనివ్వబోనని స్పష్టం చేశారు. ఒక వేళ జరిగితే ప్రాణం పోయేదాకా కొట్లాడుతానని ప్రకటించారు. ‘శాసన సభలో తెలివి తక్కువ తీర్మానం పెట్టి చేతులు దులుపుకొన్నారు. కానీ రైతులకు పంట నష్టం చేశారు’ అని ఆరోపించారు.