విధాత : గత ఎన్నికల వేళ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ప్రస్తుత ఎన్నికల వేళ నిధుల కొరత రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారుతున్నది. దీంతో బీఆరెస్ ప్రభుత్వం పథకాల అమలులో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా వ్యవహరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు తోడు ఇటీవల ప్రకటించిన కొత్త పథకాలకు నిధుల కొరత ప్రభుత్వానికి గుదిబండగా మారిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కొర్రీలు, సాకులతో ఎన్నికల షెడ్యూల్ నాటికి పథకాల అమలును సాగదీస్తూ.. గత 2018 ఎన్నికలకు ముందు రైతుబంధు నిధుల జమ వివాదం తరహాలో ‘కోడ్’ సాకుతో ఎన్నికల ఏరు దాటాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తగా ఎస్‌డీఎఫ్ నిధులు 10వేల కోట్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నా.. వాటికి సంబంధించిన పనులు చేసేందుకు మాత్రం కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రెండో విడత గొర్రెల పంపిణీ మళ్లీ ఆగిపోగా 3.60 లక్షల మంది లబ్ధిదారులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దళిత బంధు నామమాత్రంగా మారింది. కొత్తగా ప్రకటించిన గృహలక్ష్మి, బీసీ బంధు, మైనార్టీ బంధు చెక్కుల పంపిణీలో వీలైనంత జాప్యం జరుగుతున్నది.
దీనికి తోడుగా 19వేల కోట్ల వ్యవసాయ రుణమాఫీ అమలుకు నిధులను భూముల అమ్మకంతో వచ్చిన దాదాపు 10వేల కోట్లతో సర్దుబాటు చేశారు. కొత్తగా మద్యం దుకాణాల లైసెన్స్‌ల వేలం, ఓఆర్‌ఆర్ టెండర్ తో వచ్చిన ఆదాయాన్ని ఆయా పథకాలకు మళ్లించారని సమాచారం చివరాఖరుకు కార్మిక సంక్షేమ నిధులను కూడా మళ్లీంచేశారని చెబుతున్నారు. కొత్తగా ఆర్టీసీ విలీనంతో, జేపీఎస్‌లు, వీఆర్‌ఏల రెగ్యులైజ్‌తో ఖజానాపై అదనపు భారం పడనుంది.
కొత్త పథకాలతో మరింత భారం
గత ఏడాది ఆగస్టులో కొత్తగా 10లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 46 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, 57 ఏళ్లు నిండిన వారి దరఖాస్తుల నుంచి వడపోత చేసి మరో 7 లక్షల ఆసరా పింఛన్‌దారులను ఎంపిక చేశారు. పింఛన్‌దారు చనిపోయిన వారి కుటుంబాల్లో జీవిత భాగస్వామికి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా పెంచిన మేరకు 4016 రూపాయల పింఛన్‌ను 5లక్షల 11వేల దివ్యాంగులకు అందించాల్సివుంది. 4.20 లక్షల మందికి బీసీ బంధు, 3.57 లక్షల మందికి గృహలక్ష్మి, 32 వేల మందికి చేనేత మిత్ర పథకం అందాల్సివుంది. వాటికి తోడు డీడీలు కట్టి ఎదురుచూపులు పడుతున్న వారికి రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత బంధు పథకాల లబ్ధి అందించాల్సి వుంది.
విద్యార్ధి.. యువతలో అసహనం
ప్రభుత్వం తొలి నుంచీ ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతం, ఖాళీల పట్ల నిర్లక్ష్యం, ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌ల బకాయిల చెల్లింపు పట్ల అశ్రద్ధ వహిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. దీంతో 25లక్షల మంది వరకు విద్యార్థులకు ఇప్పటికే 4వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సివుంది. వాటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళితే వారి ఓట్లతో పాటు వారి కుటుంబాల ఓట్లు దక్కడం కష్టతరమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం తన ఎన్నికల హామీ నిరుద్యోగ భృతిని అటకెక్కించింది. అన్నింటికీ మించి గ్రూప్ 1పరీక్ష పేపర్ల లీకేజీ, పరీక్షల రద్దు వంటి అంశాలు విద్యార్థులు, నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిలిస్తున్నాయి. తాజాగా డీఎస్సీ వేసినా.. వాస్తవ ఖాళీలకు గండి కొట్టి 5వేల పైచిలుకు పోస్టుల భర్తీకే పరిమితమైంది.
పీఆర్సీపై ఉద్యోగ, పింఛనర్ల ఆశలు
ఉద్యోగుల డీఏ, కొత్త పింఛన్లపై కూడా ప్రభుత్వం సాగదీత వైఖరినే ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. బహుశా గురువారం జరిగే క్యాబినెట్ సమావేశంలో దసరా కానుక పేరుతో దీనిపై ప్రకటన వెలువడే అవకాశముందని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏతో పాటు పీఆర్సీ కూడా ఇస్తామని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సైతం సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే గత డీఏ ఎరియర్స్ బకాయిలు 3వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారనే అంశంతో పాటు.. కొత్త పీఆర్సీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నదానిపైనా స్పష్టత లేదు.
మొత్తం 7లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ, పీఆర్సీల కోసం ఎదురు చూస్తున్నారు. సీపీఎస్ స్కీమ్ బదులు పాత పింఛన్ పద్ధతినే అమలు చేయాలని 1 లక్ష 10వేల మంది ఉద్యోగులు కోరుతుండటం ప్రభుత్వానికి మరో సమస్యగానే ఉంది. సంక్షేమ పథకాల అమలు.. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు, ఉద్యోగ, పెన్షనర్లకు ఇస్తామన్న డీఏ, పీఆర్సీలన్నింటిపై కూడా తక్షణ పద్ధతిలో కాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చాకే అమలు చేసే కోణంలోనే ప్రభుత్వం సాగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి ఆయా పథకాల లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.