Khammam Sabha
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత సమస్యలకు, విపక్షాల విమర్శలకు ఒకే దెబ్బతో సమాధానం చెప్పాలని భావించిన ఆ పార్టీ వ్యూహం ఇప్పుడు వారికే ఎదురు తిరిగింది. పార్టీకి బలం లేని ఖమ్మంలో భారీ సభ నిర్వహించి, అందరికీ సవాల్ విసరడం వల్ల పార్టీకి ఉత్ప్రేరకంగా పనిచేసి, నూతన ఉత్తేజాన్ని నింపేందుకు దోహదం చేస్తుందని నాయకత్వం భావించింది.
ఈ నెల 15న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆహ్వానించడం ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల్లో పూర్తిస్థాయిలో ఉత్సాహం నింపాలని బీజేపీ భావించింది. భారీ సభతో తమ రాజకీయ ఆధిపత్యాన్ని పెంపొందించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఆఖరి దశలో విఫలమయ్యాయి.
తుఫాన్ కారణంగా అమిత్ షా పర్యటన రద్దైందని ప్రకటించారు. అమిత్ షా పర్యటన రద్దుకు తుఫాను అసలు కారణమా? లేక సభ అనుకున్న స్థాయిలో సక్సెస్ చేసుకోలేమనే స్థితిలో రద్దు చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సభ నిర్వహించి పార్టీలో అంతర్గతంగా జరిగే చర్చలకు, బయట నుంచి వస్తున్న విమర్శలకు ఒకే వేదికపై నుంచి సమాధానం చెప్పాలని రచించిన బృహత్తర ప్రణాళికకు అమిత్ షా రూపంలోనే అడ్డంకి ఎదురుకావడం ఆ పార్టీ ఊహించని పరిణామం.
ఇదిలాఉండగా తీరా సభ నిర్వహించి సక్సెస్ కాకుంటే పరిణామాలు విభిన్నంగా ఉంటాయని భావించి, ఆఖరి నిమిషంలో జాగ్రత్త పడ్డారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సెంట్రల్ ఇంటెలిజెన్సీ రిపోర్టు మేరకే అమిత్ షా రాకపోవడాన్ని సాకుగా చూపెట్టి సభ రద్దు చేసుకున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. షా రాకపోవడానికి తుఫాన్ పరిస్థితులు ఒక సాకుగా మారాయని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా రాక ఆ పార్టీకి అత్యవసరమైనప్పటికీ సభను కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకోవడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జన సమీకరణ ఆ పార్టీకి ఇబ్బందిగా మారినట్లు భావిస్తున్నారు. ఖమ్మంలో సభ పెట్టడం అనేది విఫల ప్రయోగమని ప్రత్యర్థి పార్టీలు అంటున్నాయి.
రేపు సభ ఉందనగా ఆకస్మికంగా అమిత్ షా పర్యటన రద్దు అయ్యిందని గుర్తుచేస్తున్నారు. తుపాను పరిస్థితులను దగ్గరుండి సమీక్షించాల్సి ఉన్నందున ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
షా పర్యటన రద్దు కావడం అవసరం రీత్యా కావచ్చు కానీ, తమ నాయకుడు సభకు హాజరు కావడం లేదనే కారణంతో కొద్ది గంటల ఖమ్మం సభ ఏర్పాట్లను బీజేపీ శ్రేణులు నిలిపివేసి సభను రద్దు చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేయగా, సొంత పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది.
సభకు రావాల్సిన ముఖ్య నాయకుడు రాకపోయినప్పుడు ఏర్పాట్లు అన్ని పూర్తయిన దశలో ఆయన స్థానంలో మరొక నాయకుడు హాజరయ్యే విధంగా ప్రయత్నిస్తారు కానీ సభనే రద్దు చేసుకోవడం సందేహాలకు తావిస్తోంది. ఎవరైనా సభ నిర్వహించడం వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకే ఖమ్మంలో సభ నిర్వహించడం ఇక్కడ సవాల్గా మారిందని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం, వరంగల్ తో పాటు నల్లగొండ జిల్లాలో నుంచి బీఆర్ఎస్ శ్రేణులను తరలించారని, ఇక ఖమ్మంలో కనీస పట్టులేని బిజెపికి ఎలా సాధ్యమవుతుందని, అందుకే ముందు జాగ్రత్తగా సభ రద్దు చేసుకున్నారని అంటున్నారు.
వాస్తవానికి బీజేపీ ఖమ్మంలో సభ ఏర్పాటు చేసినప్పటికీ, ఈ సభకు చుట్టుపక్కల జిల్లాలుగా ఉన్న నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి బిజెపి శ్రేణులను తరలించాలని అంతర్గత పథక రచన ఆ పార్టీ నాయకత్వం రూపొందించింది. ఈ మేరకు వరంగల్ జిల్లాలోని మానుకోట, డోర్నకల్, పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్, నర్సంపేట నియోజకవర్గం నుంచి శ్రేణులను తరలించేందుకు ఆ పార్టీ నాయకులు శ్రమించారు.
అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని భావించారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో సభ నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి ఏర్పడినందున అమిత్ షా పర్యటన రద్దు సాకుతో సభ రద్దు చేసినట్లు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సభ రద్దు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. పార్టీ నాయకత్వంలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది.
రాష్ట్రంలో ఇంతకాలం అనుకున్నది, అనుకున్నట్లు సాగిన బిజెపికి అనూహ్య అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరుస దెబ్బలతో పార్టీ నాయకులు, కేడర్లో ఆత్మవిశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది. ఇంతకాలం ఆ పార్టీ మేకపోతు గాంబిర్యాన్ని ప్రకటించిందా? లేదా తమని తాము ఎక్కువగా అంచనా వేసుకున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. పైకి నాయకులు గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోపల మాత్రం విశ్వాసం తగ్గిపోయి మదన పడుతున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం తెలంగాణపై ముఖ్యంగా బీజేపీపై తనదైన మార్కును చూపెట్టింది. ఆ పార్టీ నేతల్లో నైతిక బలాన్ని దెబ్బతీసింది. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ లో నూతనోత్తేజాన్ని నింపడం బిజెపి వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. దీనికి తోడు రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు గ్రూపు తగదాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. నాయకులు గ్రూపుల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. పాత, కొత్తల మధ్య పొసగడం లేదనేది తేలిపోయింది.
బండి వర్సెస్ ఈటెల మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల బిజెపి అనుసరిస్తున్న విధానం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధానంగా కవితను అరెస్టు చేయకుండా బిజెపి కేంద్ర నాయకత్వం అడ్డుపడుతుందని, ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు జీర్ణించుకోలేకపోయారు. బీఆర్ఎస్ బిజెపి ఒకటేనని సంకేతాలు ఆ పార్టీ గ్రాఫ్ ను తీవ్రంగా నష్టపరిచాయి.
రాష్ట్రంలో ఇటీవలి ఈ పరిణామాలు, పార్టీ కమిటీల్లో మార్పులపై జరిగిన ప్రచారంతో కూడా తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో.. అమిత్ షా పర్యటన క్యాడర్‌లో నూతనోత్తేజాన్ని నింపే అవకాశం ఉందని ఊహించారు. అందుకే ఖమ్మం కేంద్రాన్ని ఎంచుకొని శక్తి యుక్తులను కూడగట్టి సభను సక్సెస్ చేయాలని భావించినప్పటికీ అసలు లక్ష్యమేమో కానీ ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చిందని అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు ఇప్పుడు బిజెపి పరిస్థితి ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
అమిత్ షా పర్యటన రద్దవ్వడంతో కాషాయ శ్రేణులు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక.. ఆయన రావడం లేదని తెలిసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకానొక దశలో అమిత్ షా రాకున్నా మరో ముఖ్య నాయకున్ని ఖమ్మం సభమేరకైనా తీసుకొస్తే బాగుండేదన్న అభిప్రాయం పార్టీ నాయకులు, శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.