Kim Jong Un | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఇకపై యువత ఎలా పిలవాలంటే

Kim Jong Un | విధాత: ఉత్తర కొరియా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) పై రకరకాల వార్తలు వస్తుంటాయి. తన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌, తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ మాదిరిగానే తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఈ 38 ఏళ్ల యువ నాయకుడు తాపత్రయపడుతుంటాడనే విమర్శలు ఉన్నాయి. తండ్రి, తాతలు పాలించిన కాలంలో వారిని దేశ యువత.. ‘గౌరవ తండ్రిగారూ’ అని సంబోధించాలనే రూల్‌ ఉండేది. […]

  • By: Somu    latest    May 16, 2023 11:59 AM IST
Kim Jong Un | ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ఇకపై యువత ఎలా పిలవాలంటే

Kim Jong Un |

విధాత: ఉత్తర కొరియా అధ్యక్షుడు, కమ్యూనిస్టు పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) పై రకరకాల వార్తలు వస్తుంటాయి. తన తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌, తన తాత కిమ్‌ ఇల్‌ సంగ్‌ మాదిరిగానే తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఈ 38 ఏళ్ల యువ నాయకుడు తాపత్రయపడుతుంటాడనే విమర్శలు ఉన్నాయి.

తండ్రి, తాతలు పాలించిన కాలంలో వారిని దేశ యువత.. ‘గౌరవ తండ్రిగారూ’ అని సంబోధించాలనే రూల్‌ ఉండేది. అది వారు చేసిన త్యాగాలు, పోరాటాల వల్ల ప్రజలు గౌరవంగా అలా సంబోధించుకునేవారేమో! ఇప్పడు కిమ్‌ను సైతం అలానే పిలవాలని ఆదేశాలు జారీ చేశారట! అయితే.. ఆయనకు అంత అర్హత లేదని అక్కడి యువత అనుకుంటున్నారనేది రేడియో ఫ్రీ ఆసియా సంస్థ కథనం.

‘ఈ నెల జరిగిన ఒక విద్యా సదస్సు సందర్భంగా 14 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు, యువకులు ఇకపై ప్రధాన కార్యదర్శిని (ఉత్తర కొరియాలో అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దేశాధ్యక్షుడిగా కూడా ఉంటారు.) తండ్రీ అని పిలవాలని ఆదేశించారు.

నిజానికి ఆయన (కిమ్‌) వయసు 38 ఏళ్లు అంటే కూడా నమ్మశక్యం కాదు’ అని ఒకరు తెలిపారు. 38 ఏళ్ల వయసున్న వ్యక్తిని ‘తండ్రీ’ అని పిలవడమేంటి? అనే చర్చ ప్రజల్లో ఉన్నదని ఆ సంస్థ తెలిపింది. కిమ్‌ చాలా చిన్నవాడని, తాత, తండ్రులంత అనుభవం ఆయనకు లేదని అంటున్న ప్రజలు.. అలా పిలిపించుకోవడం తగదని హితవు పలుకుతున్నారట!

ఉత్తరకొరియా వ్యవస్థాపక అధ్యక్షుడు, కిమ్‌ తాత అయిన కిమ్‌ ఇల్‌ సంగ్‌ 1976లో తన 55 ఏళ్ల వయసులో ‘తండ్రీ’ అనే గౌరవం పొందారు. అయితే.. ఉత్తర కొరియా యువత మాత్రం ఆయనను తాత అని సంబోధించేది. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ కూడా తనకు 53 ఏళ్లు నిండిన తర్వాత 2011లో తన మరణం వరకు తండ్రి అని బిరుదు పొందారు.