KTR | ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందన తెలుసుకోండి: మంత్రి కేటీఆర్‌

KTR విధాత‌: మంత్రి కేటీఆర్‌ నిన్న ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై సాధికారికంగా సమాధానాలు ఇచ్చారు. గతంలో కంటే భిన్నంగానే ఆయన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అయితే దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు సాధించని అభివృద్ధి సాధించామని, ఉద్యోగ ఉపాధి కల్పనలో అగ్రభాగాన ఉన్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని, దానికి కేంద్ర […]

  • Publish Date - June 30, 2023 / 12:00 AM IST

KTR

విధాత‌: మంత్రి కేటీఆర్‌ నిన్న ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై సాధికారికంగా సమాధానాలు ఇచ్చారు. గతంలో కంటే భిన్నంగానే ఆయన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. అయితే దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు సాధించని అభివృద్ధి సాధించామని, ఉద్యోగ ఉపాధి కల్పనలో అగ్రభాగాన ఉన్నామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రగతికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని, దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులే నిదర్శనమని అన్నారు.

తొమ్మిదేళ్ల కాలంలోనే అంతా చేసేశామని మంత్రి గొప్పగా చెప్పుకున్నారు. అయితే తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి అంకెలతో సహా చెప్పిన ఆయన వైఫల్యాల గురించి అలాగే స్పందిస్తే బాగుండేది. పొరపాట్లు ఉంటే సవరించుకుంటామని వినమ్రంగా చెబితే బాగుండేది. కానీ మేము ఏది చేసినా బాగుంటుందని, ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లంతా రాజకీయ నిరుద్యోగులు అని హేళనగా మాట్లాడటం అధికారపార్టీ నేతలకు పరిపాటిగా మారింది.

అయితే ఒక చాలా వాస్తవాలను తెలంగాణ ప్రభుత్వ విస్మరిస్తున్నది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్‌ ఏర్పడిందనే బహిరంగ రహస్యమే. గతంలో సెక్రటేరియట్‌కు సామాన్యులు కూడా వెళ్లే వెసులుబాటు ఉండేది. ఆంక్షలు ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం అమలుచేస్తున్న కఠినంగా మాత్రం ఉండకపోయేవి.

ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టిన సచివాలయానికి ఇవాళ విపక్ష ప్రజాప్రతినిధులు వెళ్లాలంటే అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదు. జవాబుదారీతనం, పారదర్శకత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఇటీవల మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామూహికంగా ప్రజలను కలవనక్కర లేదని, ప్రజా యంత్రాంగం పనిచేయకపోతేనే సీఎంను కలవాలని వ్యాఖ్యానించారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. విజ్ఞప్తులకు, ఉత్తరాలకు కూడా జవాబులు ఇవ్వకుండా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇప్పటికే ఆలస్యమైందని, సీఎం ఇప్పటికైనా తన పద్ధతిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరు ఎలా ఉన్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చంటున్నారు.

ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేసినా ప్రజలకు, ప్రతిపక్ష నేతలకు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులకు అందుబాటులో ఉండాలి. సీఎం మొదలు మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటనలకు వెళ్తున్న సయమంలో విపక్ష నేతలను, ప్రజాసంఘాల, విద్యార్థిసంఘాల నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం, బైండోవర్లు చేయడం తొమ్మిదేళ్ల కాలంలోఅందరి అనుభవంలోనే ఉన్నది.

తెలంగాణవాదులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఒకటి ఉన్నది. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఇండియా కోసమా ఇటలీ కోసమా అని వ్యంగ్యంగా స్పందించడం ఆయనలోని అక్కసుకు నిదర్శనం.

తెలంగాణ ఏర్పాటు అన్నది రాజకీయ నిర్ణయం. ఉద్యమంలో అందరి భాగస్వామ్యం ఉన్నది. కానీ సోనియా గాంధీ సంకల్పం లేకపోతే సాధ్యమయ్యేదికాదని మంత్రి గారి తండ్రి సీఎం కేసీఆరే అసెంబ్లీ వేదికగా అనేకసార్లు చెప్పారు. బహుశా ఇది ఆయనకు గుర్తుండి ఉండదు. మేము ప్రశంసలు మాత్రమే స్వీకరిస్తామని, విమర్శలను పట్టించుకోమనట్టు కొన్ని ప్రశ్నలకు మంత్రి సమాధానాలు చూస్తే అర్థమౌతుంది.

ఈ వ్యవహారమే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాన్ని పెంచింది. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా గెలిచే పరిస్థితి ఉండదు అనే స్థితికి తీసుకొచ్చిందని తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు అంటున్నారు.

Latest News