CWC పదవిపై కోమటిరెడ్డి ధీమా! ఇస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తా
విధాత: పార్టీలో సీనియర్‌గా ఉన్న తనకు సీడబ్ల్యూసీ సభ్యుడిగా అవకాశం దక్కుతుందని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాయపూర్ కాంగ్రెస్ 85వ ప్లీనరీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగినప్పటికీ ఈసారి సీడబ్ల్యుసీలో స్థానం దక్కడం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సీడబ్ల్యుసీ ఎంపిక తర్వాత తెలంగాణలో నా పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తానన్నారు. CWC పదవి ఇస్తే మరింత ఉత్సాహంగా పని […]

విధాత: పార్టీలో సీనియర్‌గా ఉన్న తనకు సీడబ్ల్యూసీ సభ్యుడిగా అవకాశం దక్కుతుందని మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాయపూర్ కాంగ్రెస్ 85వ ప్లీనరీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో అన్యాయం జరిగినప్పటికీ ఈసారి సీడబ్ల్యుసీలో స్థానం దక్కడం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సీడబ్ల్యుసీ ఎంపిక తర్వాత తెలంగాణలో నా పాదయాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తానన్నారు. CWC పదవి ఇస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తానన్నారు. టీ.కాంగ్రెస్ నుండి సీడబ్ల్యూసీ పదవి రేసులో తనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు పరీశీలనలో ఉన్నాయన్నారు. ఈ దఫా సీడబ్ల్యుసీకి ఎన్నికల ప్రక్రియ లేనందున, సభ్యుల ఎంపిక అధికారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఇచ్చారన్నారు.
తెలంగాణలో పొత్తుల అవసరం లేదన్న కోమటిరెడ్డి, గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పార్టీకి నష్టం చేసిందని, మిత్ర పక్షాలతో సీట్ల సర్దుబాటు నామినేషన్ల రోజు వరకు కొనసాగి గందరగోళంకు దారితీసి పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయన్నారు. అందుకే రానున్న ఎన్నికలకు సంబంధించి 50 శాతం మంది అభ్యర్థుల వరకైనా ముందస్తుగా టికెట్లు ప్రకటించాలన్నారు.
సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. క్లియర్ గా ఉన్న అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ముందుగా అభ్యర్థులను ప్రకటించి, మిగతా వాటిలో కూడా ఏప్రిల్ మే నెలలో అభ్యర్థులను ఖరారు చేస్తే మంచిదన్నారు.
ఇదే విషయమై తాను ప్రియాంకతో భేటీ సందర్భంగా ఆమెతో చర్చిస్తానన్నారు. వచ్చే వారం ప్రియాంకతో భేటీ ఉండవచ్చన్నారు. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని ఖర్గే చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.