MP కోమ‌టిరెడ్డి అర్జునుడా? శల్యుడా? గ‌డ్క‌రీని క‌లిసిన త‌ర్వాత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

komatireddy venkat reddy వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో గంద‌ర‌గోళం ఒక వైపు రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర కీలక సమయంలో వివాదం రేపిన పొత్తు వ్యాఖ్యలు పీసీసీ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నమా? కోమటిరెడ్డిపై మండిపడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నేతలు విధాత‌: మ‌హాభార‌తంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడికి ర‌థ సార‌థిగా ఉన్న శ‌ల్యుడు నిత్యం యుద్ధంలో ‘మీరు ఓడిపోతారు’ అంటూ కర్ణుడిని నిరుత్సాహప‌రిచేవాడు.. స‌రిగ్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అనుస‌రిస్తున్న తీరు కూడా […]

  • Publish Date - February 14, 2023 / 10:37 AM IST

komatireddy venkat reddy

  • వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో గంద‌ర‌గోళం
  • ఒక వైపు రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర
  • కీలక సమయంలో వివాదం రేపిన పొత్తు వ్యాఖ్యలు
  • పీసీసీ పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నమా?
  • కోమటిరెడ్డిపై మండిపడుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నేతలు

విధాత‌: మ‌హాభార‌తంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడికి ర‌థ సార‌థిగా ఉన్న శ‌ల్యుడు నిత్యం యుద్ధంలో ‘మీరు ఓడిపోతారు’ అంటూ కర్ణుడిని నిరుత్సాహప‌రిచేవాడు.. స‌రిగ్గా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి అనుస‌రిస్తున్న తీరు కూడా శ‌ల్యుడి పాత్ర‌ను గుర్తుకు తెస్తున్నదని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. కోమ‌టిరెడ్డి యుద్ధంలో పోరాటానికి నాయ‌క‌త్వం వ‌హించే అర్జునుడా…? లేక క‌ర్ణుడి ర‌థసార‌థిగా ఉండి నిత్యం నిరుత్సాహానికి గురిచేసిన శ‌ల్యుడికి వార‌సుడా? అన్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతోంది.

కోమటిరెడ్డి హంగ్ వ్యాఖ్యలపై టీ. కాంగ్రెస్‌లో దుమారం..! BJP, కాంగ్రెస్‌ నేతల స్పందన ఇదే

రాహుల్ గాంధీ భారత్‌ జోడో యాత్ర ముగిసిన త‌రువాత అన్ని రాష్ట్రాల‌లో హాత్ సే హాత్ జోడో యాత్రలు చేపట్టాలని ఏఐసీసీ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే ఆధ్వ‌ర్యంలో యాత్ర షెడ్యూల్ ఖ‌రారైంది. ఎన్ని విభేదాలున్నా… నేత‌లంతా వాటిని ప‌క్క‌కు పెట్టి ముందు యాత్రను విజ‌య‌వంతం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వారం రోజులుగా క్షేత్ర స్థాయిలో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌జ‌ల నుంచి మంచి స్పందన వ‌స్తున్న‌ది. తిరిగి తాము అధికారంలోకి వ‌స్తామ‌న్న విశ్వాసం కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, క్యాడ‌ర్‌లో ఏర్ప‌డుతున్న‌ది. అలాగే సీఎల్పీ నేత కూడా త‌న జిల్లాలో పాద‌యాత్ర చేస్తానని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ పార్టీ కురు వృద్ధుడు వీ హ‌న్మంత‌రావు కూడా రేవంత్ పాద‌యాత్ర‌లో పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించారు.

అంతా ఒక్కటవుతున్న వేళ..

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలంతా విభేదాలు వీడి ఒక్క‌ట‌వుతున్న సంద‌ర్భంలో పార్టీలో నిత్యం అసంతృప్తవాదిగా ముద్ర పడ్డ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మంగ‌ళవారం ఢిల్లీలో చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో గంద‌ర‌గోళం సృష్టించాయి. ఇప్పుడిప్పుడే పార్టీ కాస్త కూడదీసుకుంటున్నదని అంతా సంతోషిస్తున్న సమయంలో అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలవదని, హంగ్‌ తప్పదని చెప్పిన కోమటిరెడ్డి.. పైగా బీజేపీని ఎదుర్కొనాలంటే బీఆర్‌ఎస్‌తో కలవక తప్పదని తెగేసి చెప్పారు.

కాంగ్రెస్‌తో BRS క‌ల‌వ‌క త‌ప్ప‌దు.. కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నిజానికి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ పోరాటం చేస్తోంది. బీఆర్ఎస్ తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి వ‌ల్ల యావ‌త్ రైతాంగం తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నదని, రైతులను ఆగం చేసిన ధరణి పోర్టల్‌ను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్‌లో రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోద‌ని స్ప‌ష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని సాక్షాత్తూ రాహుల్ గాంధీ ప్ర‌క‌టించిన త‌రువాత‌… రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో పాద‌యాత్ర చేస్తున్న ఈ స‌మ‌యంలో పొత్తులపై కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌లు చేయ‌డం అచ్చంగా కురుక్షేత్ర యుద్ధంలో శ‌ల్యుడు నిర్వ‌హించిన పాత్ర‌ను గుర్తుకు తెస్తున్నదని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.

మ‌రో వైపు రేవంత్ రెడ్డి పాద‌యాత్ర‌ను ఏ మాత్రం గుర్తించ‌డానికి ఇష్టం లేని కోమ‌టిరెడ్డి తాను మార్చి 1 నుంచి మోటర్ సైకిల్ యాత్ర చేస్తాన‌ని ఒకసారి, రేవంత్ రెడ్డి ఒక్క‌డే పోరాడితే కాంగ్రెస్ అధికారంలోకి రాదని మరోసారి.. ఇలా వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్య‌ల‌న్ని ప‌రోక్షంగా ఇంకొక పార్టీకి ఉప‌యోగ ప‌డేవేనని అంటున్నారు.

హంగ్ వస్తుందని నేను అనలేదు.. రాహుల్ గాంధీ చెప్పిందే.. నేను చెప్పా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

కోమ‌టి రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌ల ఆగ్రహం

కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మండి ప‌డుతున్నారు. కోమ‌టిరెడ్ది వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వీ హ‌న్మంత రావు తీవ్రంగా ఖండించారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌ల‌ను తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగిందన్నారు.

రాష్ట్రంలో హంగ్ రాదని, మూడింట రెండు వంతుల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని కూడా చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌తోనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీ ఉందని, ఇక్కడ కేసీఆర్ లాంటి నియంతను, ప్రజా కంటకుడిని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆయన ప్ర‌క‌టించారు.

బీఆర్ఎస్‌తో పొత్తు విషయం ఎవరు మాట్లాడినా అది వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింద‌ని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఓడించగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేన‌న్నారు.

పొత్తులపై కోమటిరెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఖండించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన వెంకట్‌రెడ్డి ఇలా మాట్లాడడం సబబు కాదని హిత‌వు ప‌లికారు. కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసే చర్యలు మంచిది కాద‌న్నారు.

కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకోదు: మాణిక్ రావు ఠాక్రే

నితిన్ గ‌డ్క‌రీని క‌లిసిన త‌ర్వాత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి బీజేపీ నేత‌ల‌ను క‌లిసిన త‌ర్వాత వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి, సీనియ‌ర్ బీజేపీ నేత నితిన్ గ‌డ్క‌రీని క‌లిసిన‌ట్లుగా ఫోటోలు మంగ‌ళ‌వారం ఉద‌యం 11.26 నిమిషాల‌కు మీడియాకు రిలీజ్ అయ్యాయి. గ‌డ్క‌రీని క‌లిసి జాతీయ ర‌హ‌దారులు, రీజిన‌ల్ రింగ్ రోడ్‌కు సంబంధించి విన‌తి ప‌త్రం ఇచ్చినట్టు కోమటిరెడ్డి మీడియాకు చెప్పారు.

గ‌డ్క‌రీని క‌లిసిన‌ ఫొటోలు విడుద‌లైన 10 నిమిషాల త‌ర్వాత కోమ‌టిరెడ్ది మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాద‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. పైగా బీఆర్ఎస్‌, కాంగ్రెస్ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాయ‌ని ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే బీజేపీ నేత‌లు త‌రుణ్ చుగ్‌, బండి సంజ‌య్‌ బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ బీ టీమ్ అంటూ వ్యాఖ్యానించ‌డం విశేషం.

బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకేనా?

కోమ‌టిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బీజేపీకి ల‌బ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయన్న అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల‌లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. మునుగోడు ఉప ఎన్నిక‌లో కోమటిరెడ్డి పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూరేలా వ్య‌వ‌హ‌రించా ర‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. గ‌త కొద్ది కాలంగా ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. నియోజ‌క‌ వ‌ర్గానికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే అధిష్ఠానం ఆదేశాల మేర‌కు పీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌ను క‌లిసిన త‌ర్వాత వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశమయ్యాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి స్పందించాల్సిన అవసరం లేదు: మంత్రి జగదీష్ రెడ్డి