15న ఆస్ట్రేలియాకు కోమ‌టిరెడ్డి.. ప్రచారానికి దూరం!

విధాత: మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల‌కు స‌వాలుగా మారింది. త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకు నేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం వ‌ర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని పార్టీ నుంచి త‌ప్పించాల‌ని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ్ముడికి అనుకూలంగా ప్ర‌చారం చేస్తున్నాడ‌నే అప‌వాదు ఆయ‌న‌పై ప‌డింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి […]

15న ఆస్ట్రేలియాకు కోమ‌టిరెడ్డి.. ప్రచారానికి దూరం!

విధాత: మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల‌కు స‌వాలుగా మారింది. త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకు నేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం వ‌ర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిని పార్టీ నుంచి త‌ప్పించాల‌ని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ్ముడికి అనుకూలంగా ప్ర‌చారం చేస్తున్నాడ‌నే అప‌వాదు ఆయ‌న‌పై ప‌డింది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స్టార్ క్యాంపెయిన‌ర్ కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారానికి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలిసింది. ఈ నెల 15వ తేదీన కుటుంబ స‌మేతంగా వెంక‌ట‌రెడ్డి ఆస్ట్రేలియా వెళ్ల‌నున్న‌ట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన త‌ర్వాతే వెంక‌ట‌రెడ్డి తిరిగి హైద‌రాబాద్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు బ‌లంగా ఉంది. ఈ పార్టీ త‌ర‌పున పాల్వాయి స్ర‌వంతి పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ త‌ర‌పున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ త‌ర‌పున కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కావాల‌నే వెంక‌టరెడ్డి ఉప ఎన్నిక‌కు దూరంగా ఉంటున్నార‌ని, త‌మ్ముడిని గెలిపించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మునుగోడు బ‌రిలో గెలిచేదేవ‌రో వేచి చూద్దాం.