అప్పులు సరే.. ఆస్తులు.. అభివృద్ధి చెప్పరేందుకు?: కేటీఆర్
గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, దివాళ రాష్ట్రంగా మార్చిందని తప్పుడు ప్రచారం చేస్తుందని ఎమ్మెల్యే కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, దివాళ రాష్ట్రంగా మార్చిందని తప్పుడు ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి బీఆరెస్ ఎమ్మెల్యే కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులపై శ్వేత పత్రం విడుదల చేస్తామంటు చెబుతున్నారని, తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో శాఖల వారిగా మేం నివేదికలు వెల్లడించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు అప్పులంటూ దుష్ప్రచారం చేస్తుందన్నారు.
అప్పుల లెక్కల గూర్చి చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పెంచిన ఆస్తులు, చేసిన అభివృద్ధి లెక్కలను ఎందుకు విస్మరిస్తుందంటూ ప్రశ్నించారు. శాఖల వారిగా 2014నాటికి ఉన్న అప్పులు..ఆస్తులను కేటీఆర్ తన ప్రసంగంలో వివరిస్తూ విద్యుత్, పౌరసరఫరాల శాఖల అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తుందని లెక్కలతో సహా పేర్కోన్నారు.
2014-15 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుగా ఉంటే తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లుగా ఉన్నాయన్నారు. 2022-23 నాటికి తెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ. 81 వేల కోట్లుగా ఉంటే తెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.1,37,571 కోట్లుగా ఉన్నాయన్నారు. పౌరసరఫరాల శాఖలో 51వేల కోట్ల అప్పులున్నాయని ప్రచారాన్ని సైతం కేసీఆర్ ఖండిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులను లెక్క వేయకుండా ప్రజలనలు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
అంతకుముందు కేటీఆర్ తన ప్రసంగంలో ఉమ్మడి రాష్ట్రంలో 50ఏళ్ల కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే అంతా కలిసి తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ పదేళ్ల పాలనపైన, గవర్నర్ ప్రసంగంపైన మాత్రమే చర్చ చేయాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో బీఆరెస్ కూడా భాగస్వామిగా ఉందంటూ రేవంత్ గుర్తు చేశారు.