యాదగిరిగుట్ట: వైభ‌వంగా లక్ష్మీ నరసింహుల ఎదుర్కోలు పర్వం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అశ్వ వాహన సేవ, ఎదుర్కోలు ఘట్టాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. చంచల స్వభావిక అశ్వాన్ని అధిరోహించి నియంత్రించినట్లుగా స్వామి వారు భక్తుల మనసులోని ఇహపర భోగాల కోరికలనే గుర్రాలను నియంత్రించి అనుగ్రహిస్తారని ప్రసిద్ధి. సర్వ సమ్మోహనకారుడైన స్వామి వారు అశ్వాహనరుడై భక్తకోటిని కటాక్షిస్తూ తిరువీధి ఉత్సవ సేవలో ఆస్థాన మండపంలోకి విచ్చేయగా ఇంకోవైపు ముత్యాల పల్లకిలో అమ్మవారు లక్ష్మీదేవి సర్వాలంకార శోభితులై మండపానికి […]

యాదగిరిగుట్ట: వైభ‌వంగా లక్ష్మీ నరసింహుల ఎదుర్కోలు పర్వం

విధాత: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అశ్వ వాహన సేవ, ఎదుర్కోలు ఘట్టాలను పాంచరాత్రాగమ శాస్త్రానుసారం వైభవంగా నిర్వహించారు. చంచల స్వభావిక అశ్వాన్ని అధిరోహించి నియంత్రించినట్లుగా స్వామి వారు భక్తుల మనసులోని ఇహపర భోగాల కోరికలనే గుర్రాలను నియంత్రించి అనుగ్రహిస్తారని ప్రసిద్ధి.

సర్వ సమ్మోహనకారుడైన స్వామి వారు అశ్వాహనరుడై భక్తకోటిని కటాక్షిస్తూ తిరువీధి ఉత్సవ సేవలో ఆస్థాన మండపంలోకి విచ్చేయగా ఇంకోవైపు ముత్యాల పల్లకిలో అమ్మవారు లక్ష్మీదేవి సర్వాలంకార శోభితులై మండపానికి వేంచేశారు. ఈ సందర్భంగా అర్చక పండిత బృందం అమ్మవారి స్వరూపాన్ని ఆమె రూప లావణ్యాలను గుణగణాలను సిరుల వైభవాన్ని కీర్తించారు.

స్వామి వారి తరఫున అర్చక బృందం తమ స్వామి వారు లోకాల పాలకుడని, అవతార లీలామూర్తి అంటూ కీర్తించారు. స్వామి అమ్మవారి గుణగణాల వర్ణనలతో ఎదుర్కోలు ఘట్టం ఆద్యంతం రసవత్తరంగా సాగి భక్తులను అలరించింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ గీత, యజ్ఞికులు, పారాయణికులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి.

బ్రహ్మోత్సవాల పర్వంలో రేపు మంగళవారం ఉదయం స్వామివారికి శ్రీరామ అలంకార సేవ, హనుమంత వాహన సేవలు, రాత్రి 8 గంటలకు గజవాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం లక్ష్మీ నరసింహ కళ్యాణోత్సవం వైభవోపేతంగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు.