Lalu Yadav | మనీలాండరింగ్ కేసులో లాలూ కుటుంబానికి ఊరట..
బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కూరు మిసా భారతి, హేమాయాదవ్లకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట కలిగింది

- మధ్యంతర బెయిల్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు
Lalu Yadav | బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ఆమె కూరు మిసా భారతి, హేమాయాదవ్లకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట కలిగింది. రైల్వేకు సంబంధించిన జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం కేసులో ముగ్గురికి కోర్టు ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు లాలూ కుటుంబ సభ్యులకు ప్రత్యే కోర్టు (మనీలాండరింగ్ నిరోధకచట్టం) సమన్లు జారీ చేసింది. ఇందులో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మిషా, హేమ ఉన్నారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనవరి 8న పీఎంఎల్ఏ 2002 నిబంధనల ప్రకారం అమిత్ కత్యాల్, రబ్రీదేవి, మిసాభారతి, హేమా యాదవ్, హృదయానంద్ చౌదరితో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏబీ ఎక్స్పోర్ట్ ప్రైమేట్ లిమిటెడ్‌పై న్యూఢిల్లీలోని ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ప్రత్యేక కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై జనవరి 27న ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపి ఫిబ్రవరి 9న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులు రబ్రీ దేవి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. రబ్రీదేవి గౌశాల మాజీ ఉద్యోగి రైల్వేలో ఉద్యోగం ఆశించే వ్యక్తుల నుంచి భూములను సంపాదించి.. ఆ తర్వాత హేమాయాదవ్‌కు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి.
మనీలాండరింగ్ కేసులో లాలూ ప్రసాదవ్ యాదవ్ కుటుంబానికి సహాయం చేశారనే ఆరోపణలపై కత్యాల్‌ను గతేడాది నవంబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సోమవారం పాట్నా కార్యాలయంలో లాలూ ప్రసాద్‌ను ఈడీ ప్రశ్నించి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన కుమారుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను సైతం విచారణకు పిలిచింది.
యూపీఏ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పనిచేసిన పవన్ బన్సాల్ మేనల్లుడు విజయ్ సింగ్లా సైతం రైల్వే రిక్రూట్మెంట్కు సంబంధించి మరో కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో విజయ్ సింగ్లా సహా 10 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో విజయ్ సింగ్లా కూడా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2004-2009 మధ్య యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు.
లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే రిక్రూట్మెంట్లో కుంభకోణం జరిగిందని ఆరోపణలున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దరఖాస్తుదారుల నుంచి భూమి, ప్లాట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మిసా భారతిపై కేసు నమోదు చేసింది.