Warangal | వరంగల్‌లో స్వర్ణకారుల నిరసనదీక్ష

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ బీజేపీ నాయకుల మద్దతు Warangal | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం నాయకులు విమర్శించారు. సోమవారం సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వర్ణకారుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దశాబ్దాలుగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులు, రోజురోజుకూ ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయారని వాపోయారు. అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, ఆదుకోవాల్సిన ప్రభుత్వం […]

  • Publish Date - September 4, 2023 / 12:13 AM IST
  • సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
  • బీజేపీ నాయకుల మద్దతు

Warangal | విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘం నాయకులు విమర్శించారు. సోమవారం సమస్యలు పరిష్కరించాలని నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వర్ణకారుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

దశాబ్దాలుగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారులు, రోజురోజుకూ ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయారని వాపోయారు. అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా, ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఇటీవల వరంగల్ లో దాదాపు 5 గురు స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళిత బంధు మాదిరి స్వర్ణకారులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం, మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా, వృద్ధాప్యంలో ఉన్న స్వర్ణకారులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

చేతివృత్తులు లాక్కున్న కేసీఆర్ : బీజేపీ

స్వర్ణకారులకు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాకేష్ రెడ్డి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మీడియాతో మాట్లాడారు. స్వర్ణకారుల జీవితాలను ఆగం చేసి, చేతివృత్తి లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ఎద్దేవా చేశారు. స్వర్ణకారుల పేరులో స్వర్ణం ఉంది కానీ, వారికి బతుకుతెరువు లేకుండా చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే అని విమర్శించారు.

ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితులకు తోడుగా ఉంటామని, వారి సమస్యలు పరిష్కారమయ్యేదాకా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతామన్నారు. ఈ నిరసన దీక్షలో గ్రేటర్ వరంగల్ స్వర్ణకార సంఘ అధ్యక్షులు సురోజు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కట్టా రాజేందర్, కోశాధికారి ఉప్పుల మోనాచారి, కట్టా ఈశ్వర్ ప్రసాద్, చిట్టిమల రమేష్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.