విధాత, నిజామాబాద్: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో నిర్వహించే సభకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల నుండి ప్రజలను భారీగా తరలిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న నాందేడ్ బీఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
సభను విజయవంతం చేసేందుకు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, షకీల్, హన్మంత్ షిండే, జీవనరెడ్డి తదితరులు గత వారం రోజులుగా నాందేడ్ లో తిష్ట వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షస్తున్నారు.
ఒకప్పటి ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రాంతమైన మరట్వాడ పరిధిలో గల నాందేడ్ ను ఎంచుకోవడం వల్ల సరిద్దుల్లో గల జుక్కల్, బోధన్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు సరిహద్దు ప్రాంతాలతో పాటు నిజామాబాదు, ఆర్మూర్, కామారెడ్డి జిల్లాల నుండి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు జనాలను భారీగా తరలిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు జనాలను తరలించే బాధ్యతలు చూస్తున్నారు.
ముఖ్యంగా నాందేడ్ జిల్లాలోని బిలోలి, దెగ్లూర్, కొండల్ వాడి, ధర్మాబాద్ సహా నాందేడ్ పట్టణంలో ఎంపీ బీబీ పాటిల్ కు బలమైన అనుచరగణం వుంది. దీనికి తోడు ఆయనకు మహారాష్ట్రలోని సరిహద్దు ప్రాంతాల్లో బంధువులు బాగానే వున్నారు. వీరంతా నాందేడ్ సభ సక్సెస్ అయ్యేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం.
జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, నిజాంసాగర్ తదితర మండలాల నుండి గ్రామాల వారీగా నాందేడ్ కు తరలి వెళ్లారు. అదే విధంగా బోధన్ నియోజకవర్గం నుండి మండలాలు, గ్రామాల వారీగా జనం తరలి వెళ్లారు. ఆటోలు, జీపులు, కార్లు, వ్యాన్ లలో తరలివెళ్లారు. జుక్కల్ నుండి పాకలి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒంటె పై నాందేడ్ కు పయనమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.