శాటిలైట్‌ టెర్మినల్‌ సరే.. సాధారణ ప్రజల గోడు పట్టదా?

చర్లపల్లిలో రైల్వేస్టేషన్‌ విస్తరణపై తమకు అధికారులు ఎలాంటి వివరాలు చెప్పలేదని స్థానికులు వాపోతున్నారు

  • By: Somu    latest    Feb 05, 2024 12:14 PM IST
శాటిలైట్‌ టెర్మినల్‌ సరే.. సాధారణ ప్రజల గోడు పట్టదా?

హైదరాబాద్‌ : చర్లపల్లిలో రైల్వేస్టేషన్‌ విస్తరణపై తమకు అధికారులు ఎలాంటి వివరాలు చెప్పలేదని స్థానికులు వాపోతున్నారు. చర్లపల్లి రైల్వేస్టేషన్లో ఉన్న రెండు ప్లాట్‌ఫాంలకు అదనంగా నాలుగు నిర్మించి శాటిలైట్‌ టెర్మినల్‌గా అభివృద్ధి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే 300 కోట్ల బడ్జెట్‌తో పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటి ద్వారా తమ ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఎంత వరకు టెర్మినల్ నిర్మాణాలు వస్తాయి? తదితర వివరాలు అధికార్లు ఎప్పడూ తమకు తెలియజేయలేదని స్టేషన్‌కు తూర్పు వైపు ఉన్న భరత్ నగర్ కాలనీవాసులు వాపోయారు.


రైల్వేస్టేషన్ విస్తరణ వల్ల ఆ ప్రాంత నివాసులకు ఏర్పడుతున్న ఇబ్బందులను పరిశీలించేందుకు మానవ హక్కుల వేదిక నుంచి ఐదుగురు సభ్యుల నిజనిర్ధారణ బృందం భరత్‌నగర్‌, మహలక్ష్మి నగర్ ప్రాంతాలలో పర్యటించి, ప్రజలతో మాట్లాడింది. ఆ వివరాలను బృందం సభ్యులు ఎస్‌ జీవన్ కుమార్, పీ శంకర్‌, టీ రోహిత్, వెంకట నారాయణ, సురేశ్‌బాబు మీడియాకు తెలిపారు. కాలనీపై భాగంలో చాలా గృహాలు తీసి వేయవలసి ఉంటుందని అధికారులు అంటున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.


పులుమ బాల నర్సమ్మ, ఇరుసు పద్మకు చెందిన రెండు ఇండ్లను ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పారని తెలిపారు. తాము ఎక్కడకు పోవాలి? తమకేమైనా పరిహారం ఇస్తారా? పునరావాసం ఎలా కల్పిస్తారు? అనే వివరాలు తమకు అధికారులు చెప్పలేదని బాధితులు వాపోయారని పేర్కొన్నారు. తాము డబ్బులు పెట్టి నోటరీతో స్థాలాలు కొనుగోలు చేసుకుని, ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నామని, అయితే.. రైల్వే స్థలంలో ఇళ్లు కట్టుకున్నారంటూ తమకు పరిహారం ఇచ్చేది లేదని చెబుతున్నారని తెలిపారు.


రైల్వే స్టేషన్‌కు ఉత్తరాన ఉన్న మహాలక్ష్మీ నగర్ కాలనీ నుండి ప్రధాన రహదారికి వెళ్ళే రోడ్డును 30 అడుగుల నుండి 80 అడుగులకు పెంచతున్నారని, దానికోసం రోడ్డుకు రెండు పక్కల గృహాల గోడలపై గుర్తులు పెట్టి, అక్కడి 14 గృహాలు, 5 నివాస స్థలాల యజమానులకుకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దీనిపై రైల్వే అధికారులు తమతో చర్చించలేదని స్థానికులు పేర్కొంటున్నారని వివరించారు. గత ఏడేళ్లుగా స్టేషన్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, తాము ఐదేళ్ల క్రితం ఇళ్లు కట్టుకున్నామని బాధితులు చెబుతున్నారని పేర్కొన్నారు. తాము ఇక్కడ ఇళ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారని, విద్యుత్తు సరఫరాతోపాటు.. ఇంటి నంబర్లు కేటాయించారని స్థానికులు చెబుతున్నారని తెలిపారు.


ఈ రోడ్డును విస్తరిస్తారు కాబట్టి ఇక్కడ స్థలాలు కొనుగోలు చేయవద్దని ఏనాడూ అధికారులు తమకు చెప్పలేదని స్థానికులు పేర్కొంటున్నారని చెప్పారు. మహాలక్ష్మీ నగర్ కాలనీ లోంచి స్టేషన్‌కు వెళ్ళే దారి కాకుండా, ప్రధాన రోడ్డు నుంచి నాలుగు రోడ్లు ఉన్నాయని వాటిని ఉపయోగిస్తే తమ నివాసాలు కొనసాగించుకునే అవకాశం ఉంటుందని స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇంత భారీ నిర్మాణ పనులు చేపట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిందని నిజనిర్ధారణ బృందం అభిప్రాయపడింది. ఇప్పటికైనా రైల్వేశాఖ పారదర్శకంగా వ్యవహరించి, నిర్మాణ సమాచారం అంతా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసింది. ఇళ్లు కోల్పోతున్నవారికి ఆ ప్రాంతంలో ప్రత్యమ్నాయ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇవ్వాలని కోరింది.