Locust attack | భారత్‌కు పొంచి ఉన్న మిడతల ముప్పు.. రాజస్థాన్ సరిహద్దున భారీ మొత్తంలో గుడ్లు

Locust attack | రెండేళ్ల క్రితమే మిడతల దండు దాడి అప్పట్లో పంటలకు తీవ్ర నష్టం తాజాగా ప్రభుత్వ అప్రమత్తతతో రైతుల్లో ఆందోళన విధాత: మిడతల దండు.. రెండేళ్ల క్రితమే భారత్ ను వణికించింది. పంట పొలాలను నిలువునా ధ్వంసం చేసేశాయి. తాజాగా మరోసారి మిడతల దండు ముప్పు భారత్ కు పొంచి ఉంది. మిడతల నియంత్రణ బృందం ఇప్పటికే ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిడతల గుడ్లు భారీ మొత్తంలో సర్వే బృందం […]

  • By: Somu    latest    Aug 18, 2023 10:23 AM IST
Locust attack | భారత్‌కు పొంచి ఉన్న మిడతల ముప్పు.. రాజస్థాన్ సరిహద్దున భారీ మొత్తంలో గుడ్లు

Locust attack |

  • రెండేళ్ల క్రితమే మిడతల దండు దాడి
  • అప్పట్లో పంటలకు తీవ్ర నష్టం
  • తాజాగా ప్రభుత్వ అప్రమత్తతతో రైతుల్లో ఆందోళన

విధాత: మిడతల దండు.. రెండేళ్ల క్రితమే భారత్ ను వణికించింది. పంట పొలాలను నిలువునా ధ్వంసం చేసేశాయి. తాజాగా మరోసారి మిడతల దండు ముప్పు భారత్ కు పొంచి ఉంది. మిడతల నియంత్రణ బృందం ఇప్పటికే ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిడతల గుడ్లు భారీ మొత్తంలో సర్వే బృందం సభ్యులు కనుగొన్నారు. ఇప్పటికే గుడ్ల నుంచి మిడతలు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. రోజురోజుకూ మిడతల సంఖ్య పెరుగుతూ, పంట పొలాలకు ప్రమాదమనే సంకేతాలనిస్తున్నారు. ఈ పరిణామాలతో రైతులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది

భారత్ కు ఎలా చేరాయంటే?

కోట్లాది మిడతలు గుంపులుగా ఎగురుతూ సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తాయి. ఈ మార్గంలో ఉన్న పంటలను దెబ్బతీస్తాయి. అయితే తాజాగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతానికి మిడత గుడ్లు ఎలా చేరాయనే దానిపై మిడతల నియంత్రణ బృందం అధ్యయనం చేస్తోంది.

ఈ ప్రాంతంలో కనిపించిన మిడత గుడ్లు… పొరుగున ఉన్న పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మిడతలు భారత్ చేరుకోవడానికి దండుగా సుదూరం ప్రయాణం చేసి ఉంటాయని భావిస్తున్నారు. పాకిస్తాన్ కు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మీదుగా చేరి ఉంటాయని తెలుస్తోంది.

భారత్ లో అతిపెద్ద మిడతల దాడి ఏదంటే..?

ఎప్పుడూ గుంపులుగా ఎగిరే మిడతల దండు గగుర్పొడిపిస్తుంది. ఒక్కసారిగా పంట పొలాలపై వాలిపోతాయి. నిమిషాల వ్యవధిలోనే పంట ఉత్పత్తులను ఖాళీ చేసేస్తాయి. ఈ మిడతల దండు దాడి రైతులను ఆందోళనల్లోకి నెట్టేస్తుంది. భారత్ కూడా మిడతల దాడిని చవిచూసింది. రైతులు అపార నష్టాన్ని భరించారు.

2020లో భారత్ లో అతిపెద్ద మిడతల దండు దాడి చేసింది. అప్పట్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ప్రాంత రైతులకు కడగండ్లే మిగిల్చాయి. ఆయా ప్రాంత రైతులకు చెందిన సుమారు 50 వేల హెక్టార్లకు పైగా వివిధ రకాల పంట ఉత్పత్తులు మిడతల దండు వశమైనట్లు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే భారత్ లో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద మిడతల దండుదాడిగా నిపుణులు చెబుతున్నారు. అయితే మిడతల దండు నుంచి ముప్పును ఇదివరకే ఆఫ్రికన్ దేశాలు చవిచూశాయి. అక్కడి దేశాల్లో పంటలపై తీవ్ర ప్రభావం చూపింది.

ఎలా అడ్డుకోవాలి..

మిడతల దండు పంట పొలాల మీద పడ్డాయంటే.. బీభత్సం సృష్టిస్తాయి. ఎంత ఆహారం అయినా సరే గుటుక్కున మింగేస్తాయి. మిడత దాని బరువుకు సమానమైన ఆహార ధాన్యాన్ని తినేస్తుంది. ధ్యాన్యాలతో పాటు చెట్ల బెరడు, పువ్వులు, విత్తనాలను కూడా ఆహారంగా తీసుకుంటాయి. ఈ దండును నియంత్రించ డం రైతులకు తలనొప్పిగా మారుతోంది.

మిడదల దండు పంట పొలాలపై వాలగానే భారీ శబ్ధాలతో తరిమేయాలి. ఆయా ప్రాంతాల్లో గాలిలో పురుగు మందు చల్లి, వాటిని అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఎదుర్కోవడానికి నియంత్రణ, పర్యవేక్షణ తప్పని సరిగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కూడా రైతులకు సహాయపడుతోంది.