Jogulamba Gadwal | అవునూ.. లోక్ ఆదాలత్ వేదికగా ఒక్కటయ్యారు.. భార్య కాళ్లు మొక్కిన భర్త

Jogulamba Gadwal | విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: అవునూ ఆ భార్యభర్తలు ఇద్దరూ లోక్ అదాలత్ వేదికగా జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారుల సమక్షంలో పూలదండలు మార్చుకుని మళ్లీ ఒక్కటయ్యారు. వారి చప్పట్లు, ఈలలే మేళతాళాలుగా అక్షితలుగా మారిపోగా కలహాల కాపురానికి చరమ గీతం పాడి మళ్లీ కలిసుంటే కలదు సుఖఃం కమ్మని సంసారం అంటు జంట రాగం అందుకున్నారు. దీనికంతటికి జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో జరిగిన లోక్ అదాలత్ వేదికగా నిలిచింది. గద్వాల […]

  • By: krs    latest    Sep 10, 2023 7:15 AM IST
Jogulamba Gadwal | అవునూ.. లోక్ ఆదాలత్ వేదికగా ఒక్కటయ్యారు.. భార్య కాళ్లు మొక్కిన భర్త

Jogulamba Gadwal |

విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధి: అవునూ ఆ భార్యభర్తలు ఇద్దరూ లోక్ అదాలత్ వేదికగా జడ్జీలు, న్యాయవాదులు, కక్షిదారుల సమక్షంలో పూలదండలు మార్చుకుని మళ్లీ ఒక్కటయ్యారు. వారి చప్పట్లు, ఈలలే మేళతాళాలుగా అక్షితలుగా మారిపోగా కలహాల కాపురానికి చరమ గీతం పాడి మళ్లీ కలిసుంటే కలదు సుఖఃం కమ్మని సంసారం అంటు జంట రాగం అందుకున్నారు. దీనికంతటికి జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో జరిగిన లోక్ అదాలత్ వేదికగా నిలిచింది.

గద్వాల పట్టణం సుంకులమ్మ మెట్టుకు చెందిన డ్రైవర్ గోవింద్, రాజేశ్వరిలు భార్యభర్తలు. నిత్యం తాగి ఇంటికి వచ్చి తనను కొట్టడటం అలవాటుగా మారడంతో విసుగెత్తిన రాజేశ్వరి భర్త గోవింద్ పై గద్వాల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు రాజీకి ఇద్దరు శనివారం గద్వాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కే.కుషా సమక్షంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌కు హాజరయ్యారు.

మొదట అదనపు జిల్లా జడ్జీ అన్నిరోజస్ క్రిస్టియన్‌, సినియర్ సివిల్ జడ్జీ గంటా కవిత, జూనియర్ సివిల్ జడ్జీ ఉదయ్ నాయక్ భార్య, భర్తలను ఇద్దరిని పిలిచి విచారించారు. రాజేశ్వరి తనకు భర్త అంటే ఇష్టమే గానీ రోజు తాగి వచ్చి తనపై దాడి చేస్తాడని తెలిపింది. గోవింద్ కూడా తన భార్య చెప్పింది నిజమేనని ఒప్పుకున్నాడు. తాగిన మైకంలో భార్యను కొట్టడం తప్పేనని, నిజాయితీగా ఒప్పుకున్నాడు. తాను చేసేంది తప్పేనని, మీ పెద్ద వాళ్లు ఏది చెబితే అదే చేస్తానన్నాడు.

అయితే అక్కడనున్న వారందరూ దంపతులను పిలిచి పూలదండలు మార్చుకునేందుకు అనుమతించారు. అందరి సమక్షంలో వారు దండలు మార్చుకున్నారు. తన భార్యకు క్షమాపణలు చెప్పాలని న్యాయమూర్తులు సూచించగా, క్షమాణలు చెప్పడంతో పాటు అందరి ముందు కాళ్లు కూడా పట్టుకున్నాడు. దీంతో అక్కడకు వచ్చినోళ్లంతా చప్పట్లు, ఈలలతో వారిని అభినందించారు.

భార్యభర్తలిద్దరు భావోద్వేగంతో కన్నీరుమున్నిరయ్యారు. నిజానికి తన భార్య తనను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకుంటుందని గోవింద్‌ అన్నాడు. ఇకమీదట తనపట్ల లాంటి తప్పు చేయననని గోవింద్ చెప్పాడు. ఈ ఘటనతో లోక్ అదాలత్ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది.