విధాత: చనిపోయిన ఆసరా లబ్ధిదారుల పేరిట నెల నెలా పింఛన్ సొమ్ము కాజేస్తున్న ఘరానా మోసగాడి ఉదంతం నల్గొండ మున్సిపాలిటీలో వెలుగుచూసింది. ఓ ప్రైవేటు పాఠశాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న పట్టణంలోని పానగల్‌కు చెందిన మండల నాగరాజు చనిపోయిన ఆసరా లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు తెలియకుండా పింఛన్ సొమ్ము డ్రా చేసుకోవడం పనిగా పెట్టుకున్నాడు.
ఆసరా పింఛన్ మృతుల కుటుంబ సభ్యులతో పరిచయం పెంచుకుని మభ్యపెట్టి మృతుల పింఛన్ పాస్ పుస్తకాలను సంపాదించడం, లేదంటే వారి వివరాలతో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి నెలనెలా పింఛన్లు కాజేయడం కొనసాగిస్తున్నాడు. ఇటీవల మతి స్థిమితం లేని ఓ వ్యక్తి స్థానికంగా లేకుండా పోగా అతని నెల నెలా పింఛన్ డబ్బులు డ్రా అవుతున్న విషయం తెలుసుకున్న అతడి భార్య దీనిపై నాగరాజును నిలదీసింది.
దీంతో నాగరాజు ఆసరా మృతుల పింఛను సొమ్ము స్వాహా పర్వం వెలుగులోకి వచ్చింది. అతను ఇలాంటి అక్రమాలు చాలానే చేసినట్లుగా మున్సిపల్ కమిషనర్ గుర్తించి స్థానిక టూ టౌన్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసారు. విచారణ చేపట్టిన పోలీసులు నాగరాజు ఇంటిని సోదా చేయగా ఆసరా నకిలీ, ఒరిజినల్ పుస్తకాలు, నకిలీ సదరన్ సర్టిఫికెట్లు దొరకడంతో విచారణ ముమ్మరం చేశారు. నాగరాజు కొందరు పోస్టాఫీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో ఆసరా పింఛన్ల స్వాహా పర్వం సాగించినట్లుగా తెలుస్తోంది.
కొందరు వైద్యాధికారులు, పోస్టాఫీస్ సిబ్బంది సహకారంతో ఇతర మండలాల వారికి నకిలీ సదరన్ సర్టిఫి కెట్లు జారీ చేయించి వారికి నల్గొండ పోస్టాఫీస్ లలోనే దివ్యాంగుల పెన్షన్ ఇప్పించేవాడు. ఇలా ఇప్పించి నందుకు వారి దగ్గర డబ్బులు తీసుకున్నట్లుగా తేలింది. నాగరాజు సుమారు 35 మంది చనిపోయిన వారి పేరుతో ప్రతి నెల ఆసరా పింఛన్లు డ్రా చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. నాగరాజుకు కొందరు పోస్టాఫీసు, మున్సిపల్, వైద్య సిబ్బంది సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.