డైనోసార్ గుడ్లు అని తెలియక.. కులదైవాలని రాళ్ల బంతులకు పూజలు..
తరతరాలుగా తమ పూర్వీకులు పూజిస్తూ వచ్చిన వస్తువులు ఎలాంటివో.. ఎందుకు ఇచ్చారో తెలియకపోయినా భక్తితో పూజలు ఇచ్చిన వాటిని పూజిస్తూ ఉంటారు

విధాత: తరతరాలుగా తమ పూర్వీకులు పూజిస్తూ వచ్చిన వస్తువులు ఎలాంటివో.. ఎందుకు ఇచ్చారో తెలియకపోయినా భక్తితో పూజలు ఇచ్చిన వాటిని పూజిస్తూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పోకడ చాలా చోట్ల కనిపిస్తుంది. భారత్‌లోనూ వింతగా పాటించే ఆచారాలను, విగ్రహాల గురించి అడిగినా.. ఏమో తరతరాలుగా తమ కుటుంబం ఇలానే చేస్తోంది అని చెబుతారు. అవి ఏంటో తెలిసేవరకు ఆ మిస్టరీ అలానే కొనసాగుతుంది.
తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో జరిగిన ఒక ఘటన అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. కొన్ని వందల ఏళ్ల నుంచి ఓ కుటుంబం కొన్ని రాళ్ల బంతుల ఆకారంలో ఉన్న వాటిని కులదేవతగా పిలుచుకుంటూ పూజిస్తోంది. అవేంటనే విషయం వారికీ తెలియదు. కాగా తాజాగా వాటిని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. . వాటిని లక్షల ఏళ్ల వయసున్న డైనోసార్ల గుడ్ల (Dinosaur Eggs) ని తేల్చారు. ఇది విని నిర్ఘాంతపోవడం ఆ కుటుంబం వంతైంది. వారు ఏ భావంతో ఈ పనిచేసినప్పటికీ ఆ కుటుంబం సంరక్షణ వల్లే ఇన్నేళ్ల పాటు ఆ గుడ్లు ఇంత సురక్షితంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా పడ్లాయా గ్రామంలో ఉన్న మండోలయ్ కుటుంబమే కులదేవత పేరుతో ఈ గుడ్లను ఆరాధిస్తోంది. ఇవి ఒక్కొక్కటి అరచేతిలో పట్టేంత పరిమాణంలో గుండ్రని రాయిలా ఉన్నాయి. ఇలాంటివి సుమారు తొమ్మిందింటిని ఒక ప్రత్యేక ఆకారంలో పెట్టి పూజిస్తున్నారు. తాము ఆ రాళ్ల బంతులను కాకర్ భైరవ్ పేరుతో పూజిస్తున్నామని ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న వెస్టా మండోలయ్ (41) చెప్పుకొచ్చారు. ఈ దేవతే తమ పొలాలను, పశు సంపదను రక్షిస్తోందని నమ్ముతున్నామని చెప్పారు.
వీరే కాకుండా ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొన్ని కుటుంబాలు కాకర్ భైరవ పేరుతో ఇలాంటి గుడ్లను పూజిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దేవత అని ప్రచారంలో ఉన్న ఈ గుడ్ల ఫొటోలను చూసి అనుమానం వచ్చిన శాస్త్రవేత్తలు వాటిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. లక్నో సాహ్నీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియోసైన్సెస్ విభాగం పరిశోధకులు ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి దేవతగా పూజింపబడుతున్న ఈ వస్తువులు డైనోసార్ గుడ్లని తేల్చారు. అవి టైటనోసారస్ అనే జాతికి చెందిన రాక్షసబల్లుల వని కనుగొన్నారు.
సుమారు 7 కోట్ల సంవత్సరాల క్రితం ఈ టైటనోసారస్‌లు భూమి మీద మనుగడ సాగించాయని ఒక అంచనా. ఇవి ఈ భూమ్మీద జీవించిన అతి పెద్ద రాక్షసబల్లుల్లో ఒకటి. మన దేశంలో మధ్య ప్రదేశ్ చుట్టుపక్కల నర్మదా నదీ పరివాహక ప్రాంతంలో ఇవి విరివిగా సంచరించినట్లు ఆధారాలున్నాయి. 1877లో తొలిసారి ఈ విషయాన్ని కనుగొనగా.. తాజాగా ఈ ఏడాది మొదట్లో వాటికి సంబంధించిన 250 గుడ్లను శాస్త్రవేత్తలు నర్మదా నదీ లోయల్లో కనుగొన్నారు.