Maha Shivaratri | ఈ శైవక్షేత్రాల సం‘దర్శనం’.. ముక్తికి సోపానం..! తెలుగు రాష్ట్రాల్లోని ఈ శివాలయాలు ఎంతో ప్రత్యేకం..!

మాఘమాసం బహుళ చతుర్దశి రోజున హిందువులంతా మహా శివరాత్రిని ఎంతో నియమనిష్టలతో జరుపుకొంటారు.

  • By: Somu    latest    Mar 07, 2024 10:59 AM IST
Maha Shivaratri | ఈ శైవక్షేత్రాల సం‘దర్శనం’.. ముక్తికి సోపానం..! తెలుగు రాష్ట్రాల్లోని ఈ శివాలయాలు ఎంతో ప్రత్యేకం..!

Maha Shivaratri | మాఘమాసం బహుళ చతుర్దశి రోజున హిందువులంతా మహా శివరాత్రిని ఎంతో నియమనిష్టలతో జరుపుకొంటారు. ఈ రోజున దేశంలోని అన్ని శివాలయాలను సుందరంగా ముస్తాబు చేసి.. శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. శివరాత్రి రోజున ఉపవాసంతో శివలింగానికి అభిషేకాలు చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు. భోళా శంకరుడిని మనసారా కొలిస్తే.. కోరికలను నెరవేర్చుతాడని ప్రగాఢనమ్మకం. ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ దగ్గరలోని శైవక్షేత్రానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామి అనుగ్రహం పొందితే పాపాలు, దారిద్య్రం తొలగిపోయి, సుఖసంతోషాలతో తులతూగుతారని విశ్వసిస్తారు. దేశంలో ఎన్నో సుప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ శైవాలయాల విశేషాలు తెలుసుకుందాం..

 

శ్రీశైల మల్లికార్జున క్షేత్రం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున మహాలింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబికాదేవి పీఠం రెండింటికీ నెలవు శ్రీశైలం మహాక్షేత్రం. ఇక్కడ శివపార్వతులు ఎన్నో ఏళ్లుగా విశేష పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రానికి కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైల గిరులకు సిరిధన్‌, శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వతం, శ్రీనగం అనే పేర్లు కూడా ఉన్నాయి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయం ప్రతి సోమవారం చేసే ప్రత్యేక పూజలతో మరింత శోభాయమానంగా దర్శనమిస్తుంది.

కార్తీకమాసం, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో దేశ నలుమూలల నుంచీ భక్తులు ఇక్కడికి వస్తారు. కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి, శివపార్వతులను దర్శించుకుంటారు. ఆలయ ప్రాంగణంలో లక్షల సంఖ్యలో దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీకపౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించే ‘జ్వాలాతోరణం’లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటారు. శ్రీశైలం చుట్టుపక్కల పర్యటకులను అమితంగా ఆకర్షించే మరెన్నో ఇతర ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని అన్ని ముఖ్య పట్ణణాలు, నగరాల నుంచే కాకుండా కొన్ని మారుమూల గ్రామాల నుంచి కూడా శ్రీశైలం చేరుకునేందుకు ప్రయాణ సౌకర్యం ఉంది.

శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం..

శ్రీ(సాలీడు), కాళము(పాము), హస్తి(ఏనుగు).. ఈ మూడు భోళాశంకరుణ్ని దర్శించి ముక్తి పొందాయని, వారికి శివుడు ఇచ్చిన వరం ఆధారంగానే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టారని ప్రతీతి. దీనికే ‘దక్షిణ కైలాసం’ అని కూడా పేరు. పంచభూత లింగాల్లో పృథ్వి, జలం, తేజస్సు, ఆకాశానికి సంబంధించిన నాలుగు లింగాలు తమిళనాడులో ఉంటే తెలుగు ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక రూపం ఇక్కడి వాయులింగం.

‘శ్రీశైలంలో పుణ్యదర్శనం చేసుకోవాలి.. కాశీలో మరణం పొందాలి..’ అని తెలిపే పురాణాలు శ్రీకాళహస్తిలో కేవలం కాలుమోపినా చాలు ముక్తిని పొందచ్చని చెబుతున్నాయి. భక్తకన్నప్ప తన కళ్లను శివుడికి సమర్పించిన స్థలం ఇదే. తిరుపతికి దగ్గరలో ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీకాళహస్తి ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి రోజున భక్తులు ఇక్కడి స్వర్ణముఖి నదిలో పుణ్య స్నానాలు చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

దక్షణ కాశీ వేములవాడ..

‘దక్షిణకాశీ’గా ప్రాచుర్యం పొందిన శివాలయమిది. కాశీ, చిదంబరం, శ్రీశైలం, కేదారేశ్వర్‌ ప్రాంతాలను పావనం చేసిన తర్వాత పరమశివుడు వేములవాడ వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కార్తీకమాసం మొదటిరోజున స్వామికి ఏకరుద్రాభిషేక పూజ చేస్తారు. ఈ నెల మొత్తం వేలసంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ మాసంలో తొలి సోమవారం నాడు రాజన్నకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తారు.


ఎములాడ రాజన్న తాము కోరిన కోరికలు తీర్చుతాడని భక్తులు కోడె మొక్కులు సమర్పిస్తారు. వీటితో పాటు ఈ ఆలయంలో కార్తీకమాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, మహారుద్రాభిషేకం, మహాలింగార్చన నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం, పార్వతీ రాజేశ్వర స్వామి కల్యాణాన్ని కనులపండువలా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి వారి దర్శనానికి బారులు తీరుతారు. వేములవాడకు కరీంనగర్‌ నుంచి నేరుగా పదినిమిషాలకో బస్సు నడుస్తుంది.

కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రం..

కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం.. ఈ మూడు ప్రాంతాల మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశంగా పురాణాలు వర్ణించాయి. అలాంటి పుణ్యభూముల్లో ఓ భాగమై, శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం కాళేశ్వరం. ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా ఇక్కడి పానవట్టంపై ఒకేసారి శివుడు, యముడు వెలిసినందున దీనికా పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఇక్కడి ముక్తీశ్వర లింగంపై రెండు నాసికారంధ్రాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్వామిపై అభిషేకించిన పంచామృతాలు నేరుగా నాసికారంధ్రాల ద్వారా త్రివేణీ సంగమానికి చేరతాయి.పుణ్య గోదావరి, పవిత్రమైన ప్రాణహిత, అంతర్వాహిణిగా పేరొందిన సరస్వతి.. నదుల దివ్య సంగమం కాళేశ్వర-ముక్తీశ్వర క్షేత్రంలో కనిపిస్తుంది.

అందుకే కార్తీకమాసం మొదలైనప్పటి నుంచి, మహాశివరాత్రి పర్వదినం రోజున చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలే కాకుండా వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ నదీస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. గోదావరి తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో కార్తీకమాసంలో ప్రజలు నదీస్నానాలు చేసి, కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి చేరుకునేందుకు అన్ని ముఖ్య నగరాలు, పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.

కీసర రామలింగేశ్వరుడు..

తెలంగాణలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కీసరగుట్ట శివాలయం ఒకటి. ఇక్కడి శివుడు రామలింగేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రాన్ని పూర్వం కేసరగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా అది కీసరగుట్టగా మారింది. ఇక్కడ రామలింగేశ్వరస్వామి లింగం ప్రతిష్ఠాపన వెనుక ఒక పురాణకథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో సీతారాములు, హనుమంతుడు ఇక్కడికి విహారానికి వచ్చినప్పుడు ప్రకృతి సంపదకు ఎంతగానో పరవశించిపోయిన శ్రీరాముడు లింగ ప్రతిష్ఠాపన చేసేందుకు రుషులను సంప్రదించాడు.

అప్పుడు రుషులు శ్రీరాముడితో ఇక్కడ లింగప్రతిష్టాపన చేస్తే రావణుణ్ని చంపిన బ్రహ్మహత్యాపాపం నుంచి విముక్తి పొందచ్చని సలహా ఇచ్చి, అందుకు ముహూర్తాన్ని సైతం నిర్ణయించారు. దీంతో కాశీకి వెళ్లి శివలింగాలను తేవాల్సిందిగా రాముడు హనుమంతునికి ఆదేశాలిచ్చాడు. అయితే హనుమంతుడు కాశీ నుంచి 101 లింగాలను తెచ్చేలోపు ముహూర్తం దాటిపోవడంతో శ్రీరాముడు శివుణ్ని ప్రార్థించగా, లింగరూపంలోకి మారిన శివుణ్ని అక్కడ ప్రతిష్ఠించాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు ఆందోళనకు గురై, తాను తెచ్చిన 101 లింగాలను తోకతో విసిరేశాడు.

అలా విసిరిన శివలింగాలు ఈ క్షేత్రంలో అక్కడక్కడా పడ్డాయి. అప్పుడు రాముడు హనుమంతుణ్ని ఓదారుస్తూ జరిగిన దానికి చింతించవద్దని, ఈ క్షేత్రం హనుమంతుని పేరు మీదనే కేసరగిరిగా వర్ధిల్లుతుందని వరమిచ్చాడు. శివరాత్రి సమయంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణమాసంలో పూజలు, దేవీనవరాత్రుల్లో ఉత్సవాలతో పాటు కార్తీకమాసంలో దీపారాధన కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి శివుడు పశ్చిమ ముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

పాలకుర్తి సోమేశ్వరుడు..

పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం ఇదే ప్రదేశంలోని వేర్వేరు గుహల్లో శివుడు, విష్ణువు కొలువై ఉండేవారు. లోకకల్యాణార్థం కొండపై వెలసి, భక్తులకు దర్శనమివ్వాలని సప్తరుషులు వీరిని వేడుకోగా శివుడు సోమేశ్వరుడిగా, విష్ణువు లక్ష్మీనరసింహస్వామిగా వెలిశారు. కొండపైకి వెళ్లే భక్తులు ఎవరైనా శుచి, శుభ్రత లేకుండా దైవదర్శనానికి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడి తేనెటీగలు కొండ కింది వరకు వారిని తరిమి, వెనక్కు పంపించేస్తాయని భక్తులు చెబుతారు. ఈ ఆలయంలో అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి, కార్తీకమాసంలో నిర్వహించే లక్షదీపార్చన, గోపూజకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తారు. హైదరాబాద్‌ నుంచి దాదాపు 120, హన్మకొండ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శైవక్షేత్రానికి చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది.

హనుమకొండ వేయిస్తంభాల గుడి

ఓరుగల్లు వేయిస్తంభాల గుడిలో మహాశివరాత్రి, కార్తీకమాసం తొలిరోజున తెల్లవారు జామున 3 గంటల నుంచే పూజలు మొదలవుతాయి. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ నిర్వహించే లక్షబిల్వార్చనలో పాల్గొంటే సకల సౌఖ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో రోజూ నిర్వహించే రుద్రాభిషేకంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడి శివలింగాన్ని స్థానికులు మారేడు పత్రాలతో పూజిస్తారు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలు, నగరాల నుంచి ఈ ఆలయానికి చేరుకునేందుకు రైలు, బస్సు సౌకర్యం ఉంది. హనుమకొండ బస్టాండ్‌కు దగ్గరలోనే ఉంటుంది. వీరితో పాటు ములుగు జిల్లాలోని రామప్ప రుద్రేశ్వరాలయం, తాండూర్‌ భావిగి భద్రేశ్వరాలయం, కల్బగూర్‌ కాశీవిశ్వేశ్వరాలయం, ఎల్లంకొండ శివాలయం, ముర్తోటలోని గంగా పార్వతీ ముక్తీశ్వరాలయం.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో శివుడు కొలువుదీరిన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ మహాశివరాత్రి, కార్తీకమాసం పర్వదినాల్లో భక్తులతో కిటకిటలాడుతూ, శివనామస్మరణతో మార్మోగుతుంటాయి.