Maharashtra | నాడు శిండేను ఎర వేసి.. ఇప్పుడు ఏడాది తిరగకుండానే

Maharashtra విధాత‌: మహారాష్ట్ర (Maharashtra) లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే మూడు రోజులు తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. త్వరలోనే శిండేను తొలిగిస్తారని, ఆయన అధికార పర్యటనపై వెళ్లారని శివసేన పార్టీ అంటున్నది. ఉద్ధవ్‌ వర్గం మాత్రం ఆయనను సెలవుపై సాగనంపారు. ఆ సెలవును మరింత పొడిగిస్తారని సంజయ్‌ రౌత్‌ లాంటి వాళ్లు అంటున్నారు. శిండే సెలవుపై వెళ్లినట్టు మాకు కూడా సమాచారం ఉన్నదని ఎన్సీపీ అంటున్నది. సీఎంగా ఫడ్నవీస్‌ బాధ్యతలు […]

  • Publish Date - April 27, 2023 / 06:22 AM IST

Maharashtra

విధాత‌: మహారాష్ట్ర (Maharashtra) లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే మూడు రోజులు తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. త్వరలోనే శిండేను తొలిగిస్తారని, ఆయన అధికార పర్యటనపై వెళ్లారని శివసేన పార్టీ అంటున్నది. ఉద్ధవ్‌ వర్గం మాత్రం ఆయనను సెలవుపై సాగనంపారు. ఆ సెలవును మరింత పొడిగిస్తారని సంజయ్‌ రౌత్‌ లాంటి వాళ్లు అంటున్నారు.

శిండే సెలవుపై వెళ్లినట్టు మాకు కూడా సమాచారం ఉన్నదని ఎన్సీపీ అంటున్నది. సీఎంగా ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టాలంటూ బీజేపీ వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది.

మరోవైపు ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ను మరోసారి బీజేపీతో చేతులు కలుపుతారనే ప్రచారం జరుగుతున్నది. దీన్ని ఖండించిన ఆయన తుది శ్వాస వరకు ఎన్సీపీలోనే కొనసాగుతాను అన్నారు. అంతకుముందు ఎన్సీపీని చీల్చే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ హెచ్చరించారు.

అధికారమే ముఖ్యం

మహారాష్ట్ర(Maharashtra)లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. మొత్తం 288 స్థానాలు ఉన్న ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన 145 మార్క్‌ను ఏ పార్టీ చేరుకోలేదు. 105 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌ కు 44 స్థానాలు వచ్చాయి. సుదీర్ఘకాలం బీజేపీ, శివసేనలు భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ రెండు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. బాల్‌ ఠాక్రే బతికి ఉన్నంత కాలం శివసేన కుటుంబం నుంచి ఎన్నడూ సీఎం సీటు కోసం పోటీ పడలేదు.

కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత శివసేన గత సంప్రదాయానికి భిన్నంగా ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుందామని ప్రతిపాదించింది.మోడీ-షాలు తాము అధికారంలోకి రావడానికి భాగస్వామ్య పార్టీలను కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ సీఎం సీటు త్యాగం చేయడానికి అంగీకరించలేదు. దీంతో దశాబ్దాల బీజేపీ, శివసేన స్నేహబంధానికి బీటలు పడ్డాయి.

అజిత్‌ పవార్‌తో మొదలుపెట్టి శిండేతో ముగించి

బీజేపీ అక్కడితో ఆగలేదు. ఎన్సీపీ కీలక నేతగా అజిత్‌ పవార్‌తో సంప్రదింపులు జరిపి ఆ పార్టీలో చీలికకు యత్నించింది. రాత్రికి రాత్రే ఆ ఏడాది నవంబర్‌ 23న ఫడ్నవీస్‌ సీఎంగా, అజిత్ డిప్యూటీ సీఎంగా ఉదయాన్నే గవర్నర్‌ కార్యాలయంలో ప్రమాణస్వీకారం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే కొద్దిరోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

అనంతరం ‘మహా వికాస్‌ అగాడీ’ పేరుతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అధికారం కోసం ప్రాంతీయ పార్టీలను చీల్చడం, ఫిరాయింపులను ప్రోత్సహించడం మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల కాలంలో అనుసరిస్తున్న విధానాలను దేశమంతా చూస్తున్నది. బీజేపీ గత ఏడాది ఏక్‌ నాథ్‌ శిండేను ముందుపెట్టి శివసేన చిచ్చు పెట్టిందనే ఆరోపణలున్నాయి.

చివరికి ఆ పార్టీ శిండే, ఉద్ధవ్‌ వర్గాలుగా చీలిపోయింది. అయితే అప్పుడే ఫడ్నవీస్‌ సీఎం అవుతారని ప్రచారం జరిగింది. అయితే శివసేనలో నెలకొన్న సంక్షోభానికి బీజేపీకి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ బీజేపీ సీఎం సీటు తీసుకుంటే విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చినట్టవుతుందని గ్రహించిన ఆ పార్టీ అధిష్ఠానం గ్రహించింది.

ఏక్‌నాథ్‌ శిండే సీఎంగా, ఫడ్నవీస్‌ను డిప్యూటీ సీఎంగా గత ఏడాది జూన్‌ 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నమొన్నటి దాకా పార్టీ పేరు , గుర్తు కోసం ఇరు పార్టీలు సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్‌ ఆశ్రయించాయి. చివరికి శిండే వర్గానికే పేరు, గుర్తు ఖరారైంది. శిండ బీజేపీ కోసం ఇంత చేసినా ఆయన ఒక ఏడాది అయినా సీఎం సీటులో కొనసాగుతారా? లేదా అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి.

Sanjay Raut | మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్‌ వారెంట్.. నెల రోజుల్లో కుప్పకూలడం ఖాయం: సంజయ్ రౌత్

ఎన్నికల సమయంలోనే

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో సర్జికల్‌ స్ట్రైక్‌ లు జరుగుతాయి. అలాగే ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అవకాశాలు ఉంటాయని సర్వేలు వస్తే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇంకో రాష్ట్రంలో సంక్షోభానికి తెర లేపడం పరిపాటిగా మారింది. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి.

శరద్‌ పవార్‌ కూడా కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయన్ని చెప్పారు. కర్ణాటక ఎన్నికలు అటూ ఇటు అయితే మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శివసేను చీల్చడానికి శిండే ఎరగా పనికొచ్చారు. కానీ ఎన్నికలను ఆయన నేతృత్వంలో ఎదుర్కొలేమని బీజేపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నది.

అందుకే తాజాగా మహారాష్ట్ర సీఎం మార్పు అంశాన్ని మళ్లీ ముందుకు తెచ్చింది. ఒకవేళ శిండేను గద్దె దించితే ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ భావిస్తుండవచ్చు. అది జరగకుండా ఉండాలంటే వారికి మద్దతుగా నిలవడానికి మరికొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.

శివసేసను చీల్చడానికి ఏక్‌నాథ్‌ శిండే లాగా.. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి అజిత్‌ పవార్‌ లాంటి వాళ్లను ముందుపెట్టి ఎన్సీపీని వాడుకోవాలనుకుంటున్నట్లు ఉన్నది. ఈ ప్రయత్నంలో బీజేపీకి వస్తే అధికారం లేదా ప్రాంతీయ పార్టీలో చీలికలు, లేదా సంక్షోభం. ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేంద్రంలోని బీజేపీ చేస్తున్న పని ఇదే.