హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి అనితా రాజేంద్ర, రిటైర్డ్ పోస్టల్ సర్వీసు అధికారి అమీరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జెన్‌కో ఈడీ యరబాడి రామ్మోహన్ రావు, మాజీ మున్సిపల్ కమిషనర్ పాల్వాయి రజినీకుమారి నియామకం అయ్యారు.
మహేందర్ రెడ్డి నేపథ్యం..
ముదిరెడ్డి మహేందర్ రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్టాపురంలో 1962 డిసెంబర్ 3న జన్మించారు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ప్రస్తుత ఎన్ఐటీ)లో బీటెక్ చదివారు. ఢిల్లీలో ఎంటెక్ చదువుతూ సివిల్స్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించారు. మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మహేందర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసు శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు మహేందర్ రెడ్డి. 2022, డిసెంబర్ 31వ తేదీన మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు.
జగిత్యాల, గుంటూరు, గోదావరిఖని ఏఎస్పీగా పని చేశారు. బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో ఎస్పీగా పని చేశారు. సైబరాబాద్ కమిషనర్‌గా నాలుగేండ్లు సేవలందించారు. గ్రేహౌండ్స్‌లో కమాండో ఆర్గనైజేషన్ చీఫ్‌గా, ఇంటెలిజెన్స్ ఐజీగా, హైదరాబాద్ సీపీగా పని చేశారు.
డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ తర్వాత 2017, నవంబర్ 12న ఇంచార్జి డీజీపీగా నియమితులయ్యారు. 2018, ఏప్రిల్ 10న పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మూడేండ్లకు పైగా తన పదవీ కాలంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ కీలకంగా వ్యవహరించారు. అందుకే 2020, ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానాన్ని మహేందర్ రెడ్డి దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియామకమైన మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే కమిషన్ నిబంధనల ప్రకారం.. 62 ఏండ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.