మహిషా రాక్షసుడు కాదు.. వేలమంది దళితులతో మహిషా ఉత్సవ్, దమ్మ దీక్ష
మహిషా ఆచరణ దసరా ఆచరణ సమితి (ఎండీఏఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం దాదాపు ఏడువేల మంది దళితులు మైసూరు నగరంలో మహిషా ఉత్సవ్, దమ్మ దీక్ష నిర్వహించారు

- మైసూరులో భద్రత నడుమ నిర్వహణ
- అశోకుడు పంపిన బౌద్ధ భిక్షువే మహిషా
- ఆయన ఇక్కడ ప్రేమ, కరుణను ప్రవచించాడు
- చరిత్రను వివరించిన నిర్వాహకులు
మైసూరు : మహిషా ఆచరణ దసరా ఆచరణ సమితి (ఎండీఏఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం దాదాపు ఏడువేల మంది దళితులు మైసూరు నగరంలో మహిషా ఉత్సవ్, దమ్మ దీక్ష నిర్వహించారు. బుద్ధుడు దమ్మ దీక్ష స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబర్ 14వ తేదీన దమ్మదీక్షోత్సవాన్ని ఎండీఏఎస్ సభ్యులు నిర్వహిస్తుంటారు. మైసూర్ టౌన్‌హాల్ సమీపంలో ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ దళిత సంఘాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎవరినీ కించపర్చేందుకు కాదని ఎండీఏఎస్ సభ్యుడు, మాజీ మేయర్ పురుషోత్తం చెప్పారు. అంబేద్కర్, బుద్ధుని అనుచరులమైన తాము శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
మహిషా చరిత్ర చెప్పేందుకే
మహిషా చరిత్ర తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని పురుషోత్తం తెలిపారు. చరిత్రను వక్రీకరించేందుకో, లేదా దసరా ఉత్సవాలను అడ్డుకునేందుకో తాము ఇది చేపట్టలేదని ఎండీఏఎస్‌కు చెందిన జననప్రకాశ్ చెప్పారు. ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నట్టే.. మహిషాలో కూడా దేవుడు ఉన్నాడని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, మహిషా మండలాన్ని తాము ఆచరిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు పోలీసులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఇచ్చినా.. 11.20 గంటలకు మొదలైన కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత కూడా కొనసాగింది. వారి విజ్ఞప్తి మేరకు తాము సమయం పొడిగించామని పోలీసులు తెలిపారు. తొలుత టౌన్‌హాల్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎండీఏఎస్ నేతలు జననప్రకాశ్ స్వామి, మాజీ మేయర్ పురుషోత్తం తదితరులు పూలదండలు వేశారు. భీమా గీతతో 11.30కి వేదికపై కార్యక్రమాలు మొదలయ్యాయి. వేదికపై ఏర్పాటు చేసిన బుద్ధుడు, అంబేద్కర్, మహిషా విగ్రహాలకు ఎండీఏఎస్ సభ్యులు రిటైర్డ్ ప్రొఫెసర్లు మహేశ్ చంద్రగురు, కేఎస్ భగవాన్, భంటే బొద్ధి దుత్తా కృష్ణమూర్తి చామరామ్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. వేదికపై ఉన్నవారితో కలిసి చంద్రగురు రాజ్యాంగ పీఠికను చదివారు. భంటే బొద్ధి దుత్తా దమ్మోపన్యాసం చేశారు. కార్యక్రమానికి హాజరైనవారిలో కొందరు దమ్మ దీక్ష తీసుకున్నారు.
మహిషా నుంచే మైసూరుకు ఆ పేరు
ఈ సందర్భంగా మహిషా చరిత్ర గురించి బీజాపూర్‌కు చెందిన తల్కడ్ చిక్కరంగేగౌడ, హెచ్‌ఎస్ పాటిల్, టీ నర్సిపూర్‌కు చెందిన భంటే బొద్ధి దుత్తా, బీసీ ఇంద్రమ్మ, నాన్‌రాజ్ ఉర్స్ తదితరులు ప్రసంగించారు. తాము శ్రీచాముండేశ్వరిని నమ్మే వారికి వ్యతిరేకం కాదని తల్కడ్ చిక్కరంగేగౌడ చెప్పారు. మహిషా.. మహిళలను గౌరవించేవాడని తెలిపారు. మహిషా చరిత్రను రుజువు చేసే పురాతన శాసనాలను తాము కనుగొన్నామని చెప్పారు. మైసూరుకు ఆ పేరు మహిషా నుంచే వచ్చిందని, అందుకు బౌద్ధ గ్రంథాల్లో సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. మహిషాసక భిక్కు సంఘ ఉత్తర భారతదేశం నుంచి మైసూరు ప్రాంతానికి వచ్చారని చెప్పారు. మహిషా పేరు జాతక కథల్లోని 278లో కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ఎవరికీ వ్యతిరేకం కాదని, స్నేహం, కరుణ సందేశాలను వ్యాప్తి చేసేందుకేనని తెలిపారు. నీలం రంగు శాలువలు ధరించిన ఎండీఏఎస్ సభ్యులు.. జై భీం అంటూ నినాదాలు చేశారు. ‘మహిషా మండల ఆది దొరై జై మహిషాసుర చక్రవర్తి’ భారీ పోస్టర్‌ను ప్రదర్శించారు. మహిషా చరిత్రను వివరించే పాటలను వినిపించారు.
అశోకుడు పంపిన బౌద్ధ భిక్షువే మహిషా
ఈ పాటలో ఉన్న ప్రకారం.. మహిషా రాక్షసుడు కాదు, మానవుడు. అశోకుడు ఆయనను బౌద్ధ భిక్షువుగా హిమాచల్ నుంచి మైసూరుకు పంపించాడు. ఆయన పేరు మహాదేవ. ఈయన ‘మైసూరు ప్రాంత్య’ మూల దొరే. ప్రేమ, కరుణ సందేశాలను ఆయన ప్రవచించేవారు.