సూర్యాపేట అభివృద్ధి కావాలంటే దళిత మహిళను పీఠం దించాలా?
‘అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం పొరపాటు. అగ్రవర్ణాలతో కలసి అధికారపక్షం ఆడించే కుట్రలో కౌన్సిలర్లు బలి కావొద్దు

– అధికారపక్షం ఆటలో కౌన్సిలర్లు బలి కావొద్దు
– నాడు కేసీఆర్, జగదీశ్ రెడ్డి అభినవ అంబేద్కర్లు అన్న
కౌన్సిలర్లకు నేడు దెయ్యాలుగా కనిపిస్తున్నారా?
– నాలుగేళ్లలో దళిత చైర్ పర్సన్ చేసిన అవినీతి ఏంది?
– టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు
విధాత, సూర్యాపేట: ‘అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం పొరపాటు. అగ్రవర్ణాలతో కలసి అధికారపక్షం ఆడించే కుట్రలో కౌన్సిలర్లు బలి కావొద్దు. దళిత మహిళ అయిన చైర్ పర్సన్ ను గద్దె దించితే సూర్యాపేట అభివృద్ధి చెందుతుందా?’ అని టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు మాదిగ ప్రశ్నించారు. నాలుగేళ్ల పరిపాలనలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ చేసిన అవినీతి ఏమిటో? చేయని అభివృద్ధి ఏందో చెప్పాలని నిలదీశారు.
సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ గురువారం బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా మాట్లాడిన శ్రీరాములు 70 సంవత్సరాల సూర్యాపేట మున్సిపల్ చరిత్రలో ఒక జనరల్ స్థానంలో దళిత మహిళను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా గద్దెనెక్కించారని చెప్పారు. నేడు అధికారపక్షం కాంగ్రెస్ పన్నాగాలు పన్నుతోందన్నారు. అవిశ్వాసం పెట్టి దళిత మహిళను పీఠం నుంచి దించేయాలనుకోవడం కుట్ర పూరితం, దుర్మార్గమైన చర్య అని తప్పెట్ల శ్రీరాములు మాదిగ మండిపడ్డారు. నాలుగేళ్ల పరిపాలనలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ చేసిన అవినీతి ఏమిటో? చేయని అభివృద్ధి ఏందో? చెప్పాలని నిలదీశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలు కలిసినప్పటికీ ఏఒక్క వార్డునూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన ఘనత మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణకే దక్కుతుందని చెప్పారు. కరోనా సమయంలో కూడా ప్రతి వార్డుకు వెళ్లి ఎవరికి ఏం కావాలో అడిగి తెలుసుకుని, అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సేవలు అందించిన అన్నపూర్ణను చైర్ పర్సన్ పదవి నుంచి దింపేయాలనుకోవడం అనాలోచితమని అన్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డిలు ఓ జనరల్ స్థానంలో దళిత మహిళను చైర్ పర్సన్ గా చేస్తే పాలాభిషేకాలు చేసిన నాయకులు.. నేడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం పొరపాటని అన్నారు. అగ్రవర్ణాలతో కలసి అధికారపక్షం ఆడించే కుట్రలో కౌన్సిలర్లు బలి కావద్దని హితవు పలికారు. సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికైనా ఆలోచించి అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణతో కలిసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకొని పక్షంలో టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతి కౌన్సిలర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పుట్టల శ్రావణ్ కుమార్ మాదిగ, పట్టణ అధ్యక్షుడు పిడమర్తి మధు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బొడ్డు సైదమ్మ, నియోజకవర్గ ఇన్ చార్జి బొడ్డు మల్సూర్, నాయకులు బొల్లి అశోక్, నకిరేకంటి సైదులు, కొండేటి సందీప్, మీసాల శివరామకృష్ణ, ఎడవెల్లి రాము, సూరారపు నాగయ్య, ఒగ్గు రవి, ములకలపల్లి కోటయ్య, ములకలపల్లి శ్రీను, బచ్చలకూరి జానయ్య, సూర్యాపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.