భారతీయుల దెబ్బ.. మాల్దీవులు అబ్బ..! దిద్దుబాటు చర్యలకు దిగిన టూరిజం ఇండస్ట్రీ ఆర్గనైజేషన్..!

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల మంత్రులు అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే

  • Publish Date - January 9, 2024 / 07:18 AM IST

Maldives | భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల మంత్రులు అభ్యంతరక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మొహమ్మద్ ముయిజు నేతృత్వంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశాన్ని సంకట స్థితిలోకి నెట్టాయి. ప్రధానితో పాటు భారత్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మాల్దీవుల పర్యటన కోసం టికెట్స్‌ బుక్‌ చేసుకున్న భారతీయులు రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు మంత్రులపై వేటు వేసిన విషయం తెలిసిందే.


తాజాగా మాల్దీవుల టూరిజం ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ (MATI) ఓ ప్రకటన విడుదల చేసింది. మాల్దీవుల మంత్రులు సోషల్‌ మీడియాలో నరేంద్ర మోదీ, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాల్దీవుల టూరిజం ఇండస్ట్రీ అసోసియేషన్ పేర్కొంది. మాల్దీవులకు అత్యంత సన్నిహిత, పొరుగు దేశం, భాగస్వామి భారత్‌ అని స్పష్టం చేసింది.


మాల్దీవులు సంక్షోభంలో ఉన్న సమయంలో భారత్‌ తమకు అండగా నిలిచిందని కొనియాడింది. భారత ప్రభుత్వం, ప్రజలు తమతో ఏర్పరుచుకున్న సన్నిహిత సంబంధాలకు మేం కృతజ్ఞతలమని చెప్పింది. మాల్దీవుల పర్యాటక పరిశ్రమకు భారతదేశం స్థిరమైన, ముఖ్యమైన సహకారం అందించిందని తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో తమ సరిహద్దులను తెరిచి తర్వాత తిరిగి కోలుకునేందుకు తాము చేపట్టిన ప్రయత్నాలకు భారత్‌ మద్దతు ఇచ్చిందని అసోసియేషన్‌ తెలిపింది.


రెండు దేశాల మధ్య ముఖ్యమైన మార్కెట్‌ ఉందని.. రెండు దేశాలు మధ్య రాబోయే అనేక తరాల వరకు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఇరుదేశాల మధ్య అద్భుతమైన సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రకటనలు, చర్యలకు దూరంగా ఉంటామని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించి.. అక్కడ టూరిజం అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు.


అయితే, ఈ వ్యాఖ్యలపై మాల్దీవుల డెప్యూటీ మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు బాయ్‌కాట్‌ మాల్దీవులను సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ చేశారు. అలాగే, లక్షద్వీప్‌ను సందర్శించాలని కోరారు. ఈ క్రమంలో పలువురు పెద్ద ఎత్తున మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఆన్‌లైన్‌ టూరిజం కంపెనీ ఈజ్‌ మై ట్రిప్‌ సైతం మాల్దీవులకు విమానాలను నిలిపివేసింది. ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఆఫర్లను తీసుకురానున్నట్లు ప్రకటించారు.


వాస్తవానికి గత కొన్నేళ్లుగా మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో ఆ దేశ పర్యాటక మార్కెట్‌లో భారత్‌ వాటా సుమారు 6.1శాతం. భారత నుంచి 90,474 మంది సందర్శించారు. ప్రస్తుతం ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది. 2022లో 2.41లక్షల మంది భారతీయులు ద్వీప దేశాన్ని సందర్శించారు. గత ఏడాది 13, డిసెంబర్‌ వరకు 1,93,693 భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. ఆ దేశ టూరిజం మార్కెట్‌లో భారతదేశ వాటా 11.11శాతంగా నమోదైంది.

Latest News