చిక్కుల్లో మమ్ముట్టి.. హుందాగా బయటకు
బోడిగుండుకి మోచిప్పకు లింకు పెట్టడం అంటే ఇదే…! విధాత: తప్పుగా మాట్లాడడం తప్పే. అయినా కొన్నిసార్లు ఉద్వేగబడి మాట్లాడితే.. అంతగా గొడవ అవుతుందని కొందరు ఊహించరు. తప్పంటే మరీ బూతులు కాదండి. ఏదో జనాల్లో నానుడిలో ఉన్నవి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ఏ మాట మాట్లాడినా, ఏ సినిమా తీసినా, ఏ టైటిల్ పెట్టినా ఎవరో ఒకరి మనోభావాలు గాయపడుతూనే ఉన్నాయి. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు మనము వాక్ స్వాతంత్రం అని సంతోష […]

బోడిగుండుకి మోచిప్పకు లింకు పెట్టడం అంటే ఇదే…!
విధాత: తప్పుగా మాట్లాడడం తప్పే. అయినా కొన్నిసార్లు ఉద్వేగబడి మాట్లాడితే.. అంతగా గొడవ అవుతుందని కొందరు ఊహించరు. తప్పంటే మరీ బూతులు కాదండి. ఏదో జనాల్లో నానుడిలో ఉన్నవి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రస్తుతం ఏ మాట మాట్లాడినా, ఏ సినిమా తీసినా, ఏ టైటిల్ పెట్టినా ఎవరో ఒకరి మనోభావాలు గాయపడుతూనే ఉన్నాయి.
నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు మనము వాక్ స్వాతంత్రం అని సంతోష పడుతున్నాం.. కానీ నేటి రోజులు కంటే పాత రోజులు చాలా బెటర్. నేడు ‘మాలపిల్ల’ అనే పేరుతో ఓ టైటిల్ పెట్టి అద్భుతమైన చిత్రం తీయగలమా? ‘మాలపిల్ల’ అని ఆ కులానికి సపోర్ట్ చేస్తూ సినిమా తీసినా కూడా సినిమా చూడకుండా టైటిల్ చూసి గొడవ చేసేవారు ఎందరో.
గతంలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో గొప్ప వ్యక్తి పార్లమెంట్లో లేచి ఇలా మన కాశ్మీర్ లోని కొంత భాగాన్ని పాకిస్తాన్‌కి ఇవ్వడం తప్పు అని వాదించాడు. దానికి నెహ్రూగారు పిచ్చి మొక్కలు కూడా మొలవని ఆ భూమి లేకపోతే మనకేమిటి నష్టం అన్నాడు. దానికోసం యుద్ధం అవసరమా? అని వ్యాఖ్యలు చేశాడు. దానికి ఆ సీనియర్ రాజకీయ నాయకుడు తన బట్టతలని చూపిస్తూ దీని మీద వెంట్రుకలు లేవని ఇది వృధా అనుకుంటే ఎలా? తీసేద్దామా? మీరే తీసేయండి అంటూ ఘాటుగానే విమర్శించాడు. ఆ ఘటనకు తాజా ఘటన కాస్త పోలిక ఉంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అంటే అందరికీ ఎంతో గౌరవం. అంత ఎత్తు ఎదిగినా కూడా అంత ప్రతిభ, ఫ్యాన్ ఫాలో ఫాలోయింగ్ ఉన్నా ఆయన చూపించే సింప్లిసిటీ రజినీకాంత్ స్టైల్‌లో ఉంటుంది. ఇటీవల ఆయన 2018 అనే మూవీ అధికారిక టీజర్‌ను విడుదల చేశాడు. ఈ చిత్రం 2018లో సంభవించిన కేరళ వరదలు ఆధారంగా తెరకెక్కిన సినిమా. నాటి వరదల్లో ప్రజలు పడిన కష్టనష్టాలు, మనుగడకు సంబంధించిన ఉత్కంఠ భరిత డ్రామా కథాంశంతో తెరకెక్కింది.
ఈ చిత్రానికి జూడే ఆంథోనీ జోసఫ్ దర్శకుడు. ఈ వేడుకలో దర్శకుని పై కొన్ని ఫన్నీగా ఉన్నప్పటికీ బాగా ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశాడు మమ్ముట్టి. దానికి దర్శకుడు ఏమాత్రం ఫీల్ కాలేదు కానీ మన నెటిజన్లు మాత్రం కోడిగుడ్డుపై ఈకలు పీకడం మొదలుపెట్టారు. దీన్ని బాడీ షేమింగ్ అంటారంటూ మమ్ముట్టిని నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు. అక్కడ మమ్ముట్టి ఏమీ అనలేదు. మలయాళంలో ఆయన మాట్లాడుతూ అతనిని చూడండి.
తన తలపై వెంట్రుకలు లేకపోయినా అసాధారణమైన మెదడు, ప్రతిభ కలిగిన అత్యంత ప్రతిభావంతుడు.. గొప్ప ఫిలిం మేకర్… అని ప్రశంసించాడు. అంతే.. మెగాస్టార్ మమ్ముట్టి నేరుగా బట్టతల ఉన్న వారందరినీ అవమానించాడని గోల చేయడం మొదలుపెట్టారు విమర్శకులు. మమ్ముట్టి దీన్ని గ్రహించి గొడవ పెరగకుండా తన అధికారిక సోషల్ మీడియాలో అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు విచారం వ్యక్తం చేశాడు. తప్పుని ఎత్తి చూపినందుకు తన అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపేశాడు.
సామాజిక మాధ్యమాలలో ఆయన ఇచ్చిన వివరణ ఇలా ఉంది.. డియర్ ఆల్.. 2018 సినిమా ట్రైలర్ లాంచ్‌లో దర్శకుడు జూడే ఆంథోనీ జోసఫ్‌ని పొగిడేందుకు ఉపయోగించిన ఉద్వేగ భరితమైన పదాలు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అలాంటి పద్ధతులు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్త తీసుకుంటాను. దీనిని నా దృష్టికి తీసుకొచ్చిన వారందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టాడు. నిన్నటిదాకా తిట్టిన నెటిజన్లు ఇప్పుడు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మమ్ముట్టి పెట్టిన పోస్ట్‌పై డైరెక్టర్ జూడే ఆంథోనీ జోసఫ్ ఎలా స్పందించాడంటే.. ఆయన మమ్ముట్టి వ్యాఖ్యలను సమర్థించాడు, తనకు లేని బాధ ఇతరులకు ఎందుకు అన్నట్టు చెంప చెల్లుమనిపిచ్చే సమాధానం ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ మెగాస్టార్‌కు నాపై ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. నా ప్రతిభను మెచ్చుకోవడానికి ఆయన ఉపయోగించే పదాలు తప్పుగా భావించవద్దు. నెటిజన్లు క్షమించండి.
నా జుట్టు రాలడానికి బెంగళూరు కార్పొరేషన్ నీటి సరఫరా, వివిధ షాంపు బ్రాండ్లను ఉత్పత్తి చేసే సంబంధిత వ్యక్తులందరినీ విమర్శించాలని.. ఓ సరదాతో పాటు కత్తిలాంటి కామెంట్ చేసి అందరికీ బుద్దొచ్చేలా చేశాడు.
బహుశా ఇక కన్నడిగులు తమ బెంగుళూర్‌ని అవమానించాడని, తమ మనోభావాలు దెబ్బతిన్నాడని మరో గోల స్టార్ట్ చేస్తారేమో..? ఇంకా ఆయన మాట్లాడుతూ చాలా విచారంగా ఉంది. మొత్తానికి పొరపాటున తప్పు మాట అన్నందుకు. దానికి మెగాస్టార్ మమ్ముట్టి వెంటనే హుందాగా స్పందించి క్షమాపణలు చెప్పి మంచి పని చేశారు. కథసుఖాంతమైంది.. అంటూ నెటిజన్ల భాషలోనే సమాధానం ఇచ్చాడు… వెల్డన్ మమ్ముట్టి అండ్ జ్యూడే..!