వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల గుడ్ బై

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) సోమవారం ఆపార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు

వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల గుడ్ బై
  • శాసనసభా కార్యదర్శికి రాజీనామా లేఖ


విధాత: ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) సోమవారం ఆపార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శాసనసభా కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆళ్ల పేర్కొన్నారు.


ఈసందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడారు. వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు స్పష్టం చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయంలో అందజేసి, ఆమోదించాలని స్పీకర్ ను కోరినట్లు పేర్కొన్నారు. తన నిర్ణయం వెనుక కారణాలను త్వరలోనే తెలియజేస్తానని చెప్పారు.


ఇన్చార్జి పదవితో తంటా..


మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా వెనుక అనేక కథనాలు వినవస్తున్నాయి. వైసీపీ పార్టీ ఇటీవల మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఇప్పటికే ఉన్న లుకలుకలు తీవ్ర స్థాయికి చేరాయని తెలుస్తోంది. దీంతో అసంతృప్తిలో ఉన్న ఆళ్ల పార్టీ అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు.


 


మరోవైపు మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని పలు సందర్భాల్లో సీఎం జగన్ వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నట్లు ఆపార్టీ వర్గాల సమాచారం. పార్టీ ఇన్చార్జి పదవి, నియోజకవర్గ నిధులు రాబట్టడంతో ఎమ్మెల్యేకు ప్రభుత్వం, పార్టీలో పట్టులేకుండా పోయింది. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి భావిస్తూ వచ్చారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు.


పోటాపోటీగా పార్టీ కార్యాలయాలు ప్రారంభం


గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైసీపీలో చాలారోజులుగా ముసలం కొనసాగుతోంది. ఆపార్టీ నేతల మధ్య పలు సందర్భాల్లో విభేదాలు పొడచూపాయి. ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే పోటాపోటీగా కార్యాలయాలు ప్రారంభించి, బలప్రదర్శన దిశగా సాగారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి తెరపైకి వచ్చారు. పార్టీ పేరుతో కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు.


ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా, వేమారెడ్డి కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించడం పార్టీ శ్రేణుల్లో విభేదాలకు కారణమైంది. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు బహిరంగమైనా.. అధినేత సీఎం జగన్ కల్పించుకోలేదు. విభేదాలను తుడిచి పెట్టి, నేతల మధ్య సమన్వయం చేయడానికి ఏమాత్రం ప్రయత్నించనూ లేదు. మరోవైపు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని దూరం చేస్తూ రావడం పార్టీలో మరింత ఆజ్యం పోసింది. ఈ విభేదాలన్నీ తార స్థాయికి చేరుకుని రాజీనామాకు దారితీశాయని ఆపార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.