అర్రాజ్ పాటలా మ్యానిఫెస్టోలు!
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా బీఆరెస్ వాటిని తలదన్నే హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేయడం ఆసక్తిరేపుతున్నది

- మహిళలకు కాంగ్రెస్ 2500 అంటే.. బీఆరెస్ 3 వేలు
- ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలంటే.. బీఆరెస్ 15 లక్షలు
- రైతు సాయం, పింఛన్లలోనూ అదే తీరు
- 15వేలు.. 16 వేలు.. 4వేలు.. 5 వేలు
- బీఆరెస్ మ్యానిఫెస్టోలో కనిపించని రుణమాఫీ
- నిరుద్యోగులు, కొలువుల భర్తీ పరిస్థితి?
విధాత : ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా బీఆరెస్ వాటిని తలదన్నే హామీలతో మ్యానిఫెస్టోను విడుదల చేయడం రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతున్నది. గతంలో కేసీఆర్ లక్ష లోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సమయంలో కాంగ్రెస్.. రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామన్నది. దీనిపై కేసీఆర్ అప్పట్లో స్పందిస్తూ.. ఇదేమైనా అర్రాజ్ పాటనా? నేను ఒకటంటే వారు రెండు అనడానికి? అంటూ విమర్శలు గుప్పించారు. వారు రెండు లక్షలు అన్నా.. తాను మాత్రం గెలిస్తే తప్పనిసరిగా లక్ష రుణ మాఫీ చేసి తీరుతానని అన్నారు. తర్వాత చాలా సభల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. తాను లక్ష మాఫీ చేస్తానంటే.. కాంగ్రెస్ రెండు లక్షలన్నదని, కానీ.. ప్రజలను తమనే గెలిపించారని చెప్పారు. అయితే.. తాజాగా విడుదలైన బీఆరెస్ మ్యానిఫెస్టో చూస్తుంటే.. అధికార పార్టీ సైతం ఇప్పుడు అర్రాజ్ పాటనే నమ్ముకున్నట్టు కనిపిస్తున్నది. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఇంకా విడుదల కానప్పటికీ.. శాంపిల్‌గా ఆరు గ్యారెంటీ హామీలను ఆ పార్టీ ప్రకటించింది. విచిత్రంగా ఆ ఆరు గ్యారెంటీల్లో చెప్పిన మొత్తాలకు మించి అందిస్తామని బీఆరెస్ ప్రకటించడం విశేషం. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ఆరు గ్యారెంటీలను బీఆరెస్ కాపీ కొట్టిందని ఆరోపించారు.
తమను గెలిపిస్తే.. పేద ప్రజలకు, వృద్ధులకు అందిస్తున్న పెన్షన్లను నాలుగు వేలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. తాజాగా బీఆరెస్ ఆ మొత్తాన్ని ఐదేళ్ల వ్యవధిలో ఏటా పెంచుకుంటూ ఐదు వేలకు తీసుకెళతామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ గుండుగుత్తాగా నాలుగు వేలు ఇస్తామంటే.. బీఆరెస్ మాత్రం ఐదేళ్ల వ్యవధిలో అదే మొత్తాన్ని అందించేందుకు హామీ ఇచ్చింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద మొత్తాన్ని ఇప్పుడున్న ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ చెబితే.. దానికి బీఆరెస్ మరో ఐదు లక్షలు జోడించి, 15 లక్షలు చేసింది. దివ్యాంగుల విషయాన్ని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ప్రకటిస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయంలో ముందే నిర్ణయం ప్రకటించిన బీఆరెస్.. వారికి ఇచ్చే పింఛన్‌ను ఐదేళ్లలో ఆరువేల పదహారుకు పెంచుతామని ప్రకటించడం విశేషం.
ఇక మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ పార్టీ పేద మహిళలకు నెలకు 2500 ఇస్తామని హామీ ఇస్తే.. బీఆరెస్ అధినేత దానికి మరో 500 జోడించి.. సౌభాగ్యలక్ష్మి కింద మూడు వేలు ఇస్తామని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ విషయంలోనూ ఇదే తీరు కనిపించింది. కాంగ్రెస్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెబితే.. కేసీఆర్.. వంద తగ్గించి.. నాలుగు వందలకే ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు.. అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు సైతం 400కే సిలిండర్ ఇస్తామని చెప్పారు.
రైతుబంధు విషయంలోనూ బీఆరెస్ అర్రాజ్ పాటే పాడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా పేరుతో రైతులకు ఏటా ఎకరానికి 15వేలు, రైతు కూలీలకు 12వేలు ఇస్తామని ప్రకటించింది. దీనికీ తగ్గేది లేదన్న బీఆరెస్.. రైతుబంధు సాయాన్ని ఏటా పెంచుకుంటూ ఐదేళ్లలో 16వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే.. రైతుకూలీలకు కాంగ్రెస్ 12 వేలు ప్రకటించగా.. బీఆరెస్ మ్యానిఫెస్టోలో అది కనిపించలేదు.
ఒక్క ఇళ్ల విషయంలో మాత్రం బీఆరెస్.. తన పాట పొడిగించలేదని అర్థమవుతున్నది. కాంగ్రెస్.. సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు ఇస్తామని చెబితే.. బీఆరెస్ మాత్రం మూడు లక్షలే ఇస్తామని పేర్కొన్నది. దానితోపాటు.. గ్రేటర్ హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు కానీ.. గ్రామీణ ప్రాంతాల విషయంలో స్పష్టతనివ్వలేదు. ఇప్పుడు ఉన్న హౌసింగ్ పాలసీ బాగుందని, అది కొనసాగుతుందని మాత్రం మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
రుణమాఫీ లేదేం?
కీలకమైన రైతు రుణ మాఫీ విషయం బీఆరెస్ మ్యానిఫెస్టోలో కనిపించక పోవడం చర్చనీయాంశమైంది. ఈ దఫా రైతు రుణ మాఫీ అంశం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిధులు జమ చేశామని చెబితే.. బ్యాంకర్లు మాత్రం నిధులు రాలేదని, లేదా వడ్డీకి జమ అయ్యాయని చెప్పారని రైతులు ఆందోళనలకు సైతం దిగారు. తమను గెలిపిస్తే రెండు లక్షల వరకూ వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించినా.. బీఆరెస్ మ్యానిఫెస్టోలో రుణమాఫీ హామీ లేకపోవడం విశేషం. ఐతే.. పాత పథకాలన్నీ కొనసాగుతాని కేసీఆర్ చెప్పడంతో.. రుణమాఫీ కూడా అందులో భాగమా? లేక విడిగా ప్రకటిస్తారా? అన్నది చూడాలి.
అదే విధంగా ఉద్యమ ట్యాగ్‌లైన్‌లలో ఒకటైన నియామకాల విషయాన్ని బీఆరెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించకపోవడం గమనార్హం. కానీ.. ఈ విషయాన్ని కాంగ్రెస్ తన ఆరు గ్యారెంటీల్లో ప్రస్తావించింది. రాహుల్‌గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌లో ఏటా జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాల భర్తీతోపాటు.. నిరుద్యోగులకు 4వేల భృతి, విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్, ఉచితంగా స్కూటీలు వంటివి ఉన్నాయి. బీఆరెస్ మ్యానిఫెస్టోలో రెసిడెన్షియల్ స్కూళ్లు పెంచడంతోపాటు అగ్రవర్ణాల్లోని పేదలకు రెసిడెన్షియల్ పాఠశాలలు నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక త్వరలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల కానున్నది. కాంగ్రెస్ కూడా బీఆరెస్ ప్రకటించిన కొత్త విషయాల్లో అంతకు మించి ప్రకటిస్తారా? అదే అర్రాజ్ పాటను కాంగ్రెస్ కూడా కొనసాగిస్తుందా? అనేది వేచి చూడాలి.