Manipur | రాజీనామా చేయబోతున్న మణిపూర్‌ సీఎం?

ఈ రోజే గవర్నర్‌కు లేఖ అందించనున్న బిరేన్‌సింగ్‌! కేంద్ర పెద్దల ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం సంచలనం రేపిన సంగాయి ఎక్స్‌ప్రెస్‌ కథనం గువాహటి: మణిపూర్‌ (Manipur) అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మైతేయి తెగకు చెందిన బిరేన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తున్నది. ‘ఆయన ఈ రోజే రాజీనామా చేసే అవకాశం ఉన్నది’ అని ఆయన సన్నిహిత సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. గవర్నర్‌ అనుసూయ ఉయికే నుంచి […]

  • Publish Date - June 30, 2023 / 08:04 AM IST
  • ఈ రోజే గవర్నర్‌కు లేఖ అందించనున్న బిరేన్‌సింగ్‌!
  • కేంద్ర పెద్దల ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం
  • సంచలనం రేపిన సంగాయి ఎక్స్‌ప్రెస్‌ కథనం

గువాహటి: మణిపూర్‌ (Manipur) అల్లర్లను అదుపు చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మైతేయి తెగకు చెందిన బిరేన్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తున్నది. ‘ఆయన ఈ రోజే రాజీనామా చేసే అవకాశం ఉన్నది’ అని ఆయన సన్నిహిత సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. గవర్నర్‌ అనుసూయ ఉయికే నుంచి ముఖ్యమంత్రి శుక్రవారం అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగానే ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పిస్తారని సమాచారం. మణిపూర్‌ అల్లర్లను నిరోధించడంలో, నియంత్రించడంలో బిరేన్‌సింగ్‌ విఫలమయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఆయన రాజీనామాకు అన్ని పార్టీలూ డిమాండ్‌ చేస్తున్నాయి. సొంత పార్టీ నేతలు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నాయకత్వాన్ని ఇష్టపడటం లేదని వార్తలు వస్తున్నాయి.

బిరేన్‌ రాజీనామా చేస్తారన్న వార్త మణిపూర్‌ నుంచి వెలువడే సంగాయి ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో రావడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. దీనిపై సీనియర్‌ అధికారిని ఒక మీడియా సంస్థ సంప్రదించగా.. ఆయన ఆ వార్తలను ధృవీకరించారు.

బిరేన్‌సింగ్‌కు గురువారం రాత్రి న్యూఢిల్లీ నుంచి పలు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని, అందులో రాజీనామా చేయాలన్న సూచనలు ఉన్నాయని, లేని పక్షంలో కేంద్ర పాలన విధించే ఆప్షన్‌ ఇచ్చారని సంగాయి ఎక్స్‌ప్రెస్‌ పేర్కొన్నది. పార్టీ పెద్దల ఆదేశాలను పాటించేందుకు బిరేన్‌సింగ్‌ సిద్ధపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచుతారని సదరు పత్రిక పేర్కొన్నది.

గవర్నర్‌ ఉయికే ఢిల్లీ పర్యటన అనంతరం రెండు రోజులకు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఆ పర్యటనలో గవర్నర్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుసుకున్నారు. మణిపూర్‌లో పరిస్థితిని, అదుపు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మణిపూర్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంటున్నది.