కల్లోలిత ప్రాంతంగా మణిపూర్‌

  • By: Somu    latest    Sep 27, 2023 11:38 AM IST
కల్లోలిత ప్రాంతంగా మణిపూర్‌

హింస నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీల‌క ప్రకటన

విధాత‌: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని శాంతిభద్రతల పరిస్థితుల కారణంగా యావత్‌ రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా మణిపూర్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మినహాయించి మొత్తం రాష్ట్రాన్ని సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఫ్‌ఎస్‌పీఏ) కింద కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తున్నట్టు ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది.


వివిధ సాయుధ, తీవ్రవాద సంస్థల హింసాత్మక కార్యకలాపాల నేపథ్యంలో పౌర యంత్రాగానికి సహకరించేందుకు సాయుధ దళాల సహకారం తీసుకోవాల్సి వస్తున్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సామర్థ్యాల నేపథ్యంలో ఆరు నెలలపాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది.


ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్‌, హత్యకు నిరసనగా మంగళవారం రాజధాని ఇంఫాల్‌లో వివిధ విద్యార్థి సంఘాలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించడంతో మంగళవారం నుంచి మళ్లీ నిరసనలు రాజుకున్నాయి.


ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలతో జరిగిన ఘర్షణల్లో దాదాపు 45 మంది ఆందోళనకారులు గాయపడ్డారు. హత్యకు గురైన ఫిజం హేమ్‌జిత్‌ (20), హిజమ్‌ లింతోయిగంబి (17) జూలై నెల నుంచి కనిపించడం లేదు. తాజాగా బయటకు వచ్చిన రెండు ఫొటోల్లో ఒకదాంట్లో ఆ ఇద్దరు విద్యార్థులతో ఇద్దరు సాయుధులు ఉంటే.. మరో దాంట్లో ఆ ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు ఉన్నాయి.


నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ చెప్పారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ఇంఫాల్‌, ఇతర ప్రాంతాల్లో భారీగా సాయుధ దళాలను మోహరించారు. తాజా నిరసనల నేపథ్యంలో మళ్లీ ఇంటర్‌నెట్‌ సర్వీసులపై నిషేధం విధించారు.