Manukota | మానుకోట పట్టణ పాలకవర్గంలో ముసలం.. నిరసన జండెత్తిన కౌన్సిలర్లు

Manukota మున్సిపల్ ఆఫీస్ వద్ద అఖిలపక్ష ధర్నా ఎమ్మెల్యే, చైర్మన్ పై తీవ్ర విమర్శలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట (Manukota) పట్టణ పాలకవర్గంలో ముసలం ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యే, చైర్మన్ ధోరణి పై అఖిలపక్ష పార్టీల కౌన్సిలర్లు నిరసన జెండెత్తడం సంచలనం సృష్టించింది. మంగళవారం ఆత్మీయ సమ్మేళనం పేరుతో గులాబీ శ్రేణుల మధ్య ఐక్యత ప్రదర్శించిన గంటల్లోనే ఎమ్మెల్యే శంకర్ నాయక్, చైర్మన్ రామ్మోహన్ రెడ్డిల ఏకపక్షధోరణి పై తిరుగుబాటుబావుట ఎగురవేయడం చర్చకు […]

  • Publish Date - April 27, 2023 / 12:50 AM IST

Manukota

  • మున్సిపల్ ఆఫీస్ వద్ద అఖిలపక్ష ధర్నా
  • ఎమ్మెల్యే, చైర్మన్ పై తీవ్ర విమర్శలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట (Manukota) పట్టణ పాలకవర్గంలో ముసలం ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యే, చైర్మన్ ధోరణి పై అఖిలపక్ష పార్టీల కౌన్సిలర్లు నిరసన జెండెత్తడం సంచలనం సృష్టించింది.

మంగళవారం ఆత్మీయ సమ్మేళనం పేరుతో గులాబీ శ్రేణుల మధ్య ఐక్యత ప్రదర్శించిన గంటల్లోనే ఎమ్మెల్యే శంకర్ నాయక్, చైర్మన్ రామ్మోహన్ రెడ్డిల ఏకపక్షధోరణి పై తిరుగుబాటుబావుట ఎగురవేయడం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందోనని ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఎమ్మెల్యే, చైర్మన్ పై ఆగ్రహం

ఎమ్మెల్యే, చైర్మన్లు కలిసిపోయి అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరిస్తూ, నియంతృత్వ పోకడలు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్‌ మొత్తం 15 మంది కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్ ముందు బుధవారం ధర్నా చేపట్టి తమ నిరసన తెలియజేశారు.

ముందుగానే కౌన్సిలర్ల భేటీ

స్వపక్ష, విపక్ష కౌన్సిలర్లు నిరసన చేపట్టడానికి ముందు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు రెండు రోజుల క్రితమే ప్రత్యేకంగా సమావేశమై నిరసన వ్యక్తం చేసేందుకు ప్రణాళిక రూపొందించు కున్నారు. గత కొంతకాలంగా చైర్మన్ వ్యవహరిస్తున్న ఏకపక్ష పద్ధతులపై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీరు తోడు కావడంతో బహిరంగంగా నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. గతంలో ఒకటి రెండు సార్లు తమ ఆవేదనను అంతర్గతంగా తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్లు ఏకంగా ధర్నాకు సిద్ధమయ్యారు.

50 కోట్ల నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం

కొద్దిరోజుల క్రితం జిల్లా పర్యటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోట పట్టణ అభివృద్ధి కి రూ. 50 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిధులను వార్డుల్లో కేటాయించి, పనులు నిర్ణయించే క్రమంలో తమ అభిప్రాయాలను గౌరవించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, సీపీఐ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ సారథి రెడ్డి, సీపీఎం ఫ్లోర్ లీడ‌ర్ సూర్ణపు సోమయ్య, బీఆర్ఎస్ కౌన్సిల‌ర్‌ ఎడ్ల వేణులు మాట్లాడుతూ ఏ విషమైనా జనరల్ బాడీలో చర్చించి నిర్ణయిస్తే బాగుంటుందన్నారు. దీనికి భిన్నంగా ఎమ్మెల్యే, చైర్మన్ ఇష్టానుసారంగా నిధులు కేటాయించడం పట్ల అసంతృప్తితో ఉన్నారు.

ప్రోటోకాల్ పాటించని ఎమ్మెల్యే

ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ ప్రోటోకాల్ పాటించ‌కుండా, వార్డుల‌తో సంబంధం లేని వ్య‌క్తుల‌తో అభివృద్ధి ప‌నుల్లో పాల్గొంటున్నార‌ని కౌన్సిలర్లు ఆరోపించారు. త‌మ‌ను కించ‌ప‌రుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను ఖండించాల్సిన మునిసిప‌ల్ చైర్మన్, ముఖ్య అధికారులు ఆయ‌న‌కు వంత‌పాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడు సంవత్సరాలుగా వార్డుల్లో చేసిన అభివృద్ధి ఏంట‌నీ ప్ర‌జ‌లు అ‌డుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు తాము స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నామ‌ని అన్నారు.

ప్రజలు చెప్పిందే చేస్తాను: మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్

నా కళ్ళతో చూసి,ప్రజలు చెప్పిందే చేస్తాను అంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. మానుకోటలో పర్యటిస్తున్నానని చెప్పారు. విషయాన్ని వివాదం చేస్తే పనుల పురోగతిలో జాప్యమైతుందన్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని హితవుపలికారు. తన పర్యటనల పై కౌన్సిలర్లందరికీ సమాచారం ఉందన్నారు.

పట్టణాభివృద్ధికి కలిసి పని చేద్దాం: మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాంమ్మోహన్ రెడ్డి

కాంగ్రెస్, సిపియం, సిపిఐ,బిఆర్ఎస్ కౌన్సిలర్ లు అందరినీ కోరుతున్నాను. మానుకోట పట్టణఅభివృద్ధిని ఆహ్వానించాలి. సహకరించాలన్నారు. చిన్నచిన్న పొరపొచ్చాలు ఏమయినా ఉంటే మాట్లాడుకుందామన్నారు. సమన్వయం చేసుకుందామని, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు.