మేడిగడ్డ ఘటనకు కేసీఆర్ బాధ్యత వ‌హించాలి: మావోయిస్ట్ పార్టీ డిమాండ్‌

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు

మేడిగడ్డ ఘటనకు కేసీఆర్ బాధ్యత వ‌హించాలి:  మావోయిస్ట్ పార్టీ డిమాండ్‌

– రైతులకు నష్టపరిహారంలోనూ నిర్లక్ష్యం

– పిల్లర్లు కుంగి నీళ్లన్నీ సముద్రం పాలు

– మావోయిస్టు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి, మంథని, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మి బ్యారేజీ అంతర్రాష్ట్ర వంతెన 19, 20, 21వ పిల్లర్ల మధ్య 30 మీటర్లకు పైగా కుంగిపోయిన విషయం తెలిసిందే.

వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని ఎల్ఎన్టీ సంస్థ నిర్మించి కేవలం మూడు సంవత్సరాలు అయ్యింది. దీన్ని 2016 మే 2న నిర్మాణం చేపట్టి 2019 జూన్ 21న ప్రారంభించారు. ఈ బ్యారేజి అతి తొందరలోనే కూలి పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబం పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకోవడంతో దాన్ని నాసిరకంగా నిర్మించారు. అది నిర్మిస్తున్న సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయి కాని ఈ విషయం బయటి ప్రపంచానికి తెలవడంతో ప్రజలు, ప్రజాసంఘాలు, బూర్జువా పార్టీలను సహితం రానివ్వకుండా పోలీసు ఫోర్స్ ను పెట్టి ముందస్తుగా అరెస్టులు చేశారన్నారు. వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా, బయటకు రాకుండా అణిచివేశారు. మీడియాను కూడా బెదిరించి కంట్రోల్ చేశారు. ఆంధ్ర పాలకులు పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్రలో కలుపుకుని తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు వనరులన్నింటినీ దోపిడీ చేయడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి వేల మంది ప్రాణత్యాగం చేసి తెలంగాణను సాధించుకున్నారు.

కాని తెలంగాణను సాధించుకున్నప్పటికీ మేడిగడ్డ లక్ష్మి బ్యారేజితో పాటు ఇతర నిర్మాణాలను కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చారు. అవి కూడా ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ బ్యారేజి నిర్మించడానికి ప్రజలు పంటపొలాలను, సాగుభూములన్నింటినీ నయాన, భయాన లొంగదీసుకుని తీసుకున్నారు. వారికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. వాల్లు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదు. గోదావరిపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన స్థానికులకు ఒక్క చుక్క నీటిని ఇవ్వలేదు.పెట్టుబడిదారులకు ఫ్యాక్టరీలకు, భూస్వాములకే ఉపయోగించారు తప్ప పేద, మధ్య తరగతి రైతులకు నీళ్లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముతో భారీ హంగూ ఆర్భాటాలతో ఇంతపెద్ద బ్యారేజి నిర్మించామని, ఇది కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని, తెలంగాణ సస్యశ్యామలం అయిపోయిందని అంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒక లక్ష రుణమాఫీ చేశాడు. కాని రైతులు అప్పులు తీరలేదు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. అరవై సంవత్సరాలలో చేయని అభివృద్ధి పది సంవత్సరాలలో చేసి చూపించామని ప్రగల్భాలు పలికాడు కాని, అక్టోబర్ 21న కుంగిపోయిన విషయం చూస్తె అందులో కేసీఆర్ కుటుంబం ఎంత కమీషన్ తీసుకున్నారో, ఎంత అవినీతికి పాల్పడ్డారో బ్యారేజి కుంగిపోయిన తరువాత ప్రజలందరికీ అర్థమయింది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజి కుంగిపోవడంతో అందులో ఉన్న నీటిని సముద్రంపాలు చేస్తున్నారు. ఈ కుంగుబాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు.