విధాత: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు శశిధర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం కలిగిన ఉన్న తను రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు సుముఖత చూపకుండా, కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఇటీవల ఢిల్లీలో బీజేపీ నేత అమిత్ షాతో సైతం సమావేశమయ్యారు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో చాలా బాధతో కాంగ్రెస్‌ను వీడుతున్నానని, పార్టీలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని లేఖలో మర్రి వాపోయారు.
కాంగ్రెస్ పార్టీలో సోనియా నిస్సహాయ స్థితిలో ఉన్నారని, తెలంగాణ ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. తాను చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఇలాంటి పరిస్థితి పార్టీలో ఎప్పుడూ చూడ లేదన్నారు. ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పని చేయలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కాదు తెలంగాణ ఫస్ట్ అనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అంతా టీఆర్ఎస్‌తో కుమ్మక్కు అయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్‌రెడ్డిని నియమించిన తరువాత వరుసగా కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు.
ఇన్‌చార్జీలుగా ఉన్న వ్యక్తులు పీసీసీ అధ్యక్షుడిని బంగారు బాతుగా చూశారన్నారు. వారు హైకమాండ్ ప్రతినిధులుగా కాకుండా పీసీసీ అధ్యక్షులకు ఏజెంట్లుగా పని చేశారన్నారు. ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా పార్టీకి మైనస్ అని అన్నారు. పార్టీలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థతి ఎప్పుడూ చూడ లేదని బాధ పడ్డారు. డబ్బులు డామినేట్ చేస్తున్నాయన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా ఇందుకు మినహాయింపు కాదన్నారు.
12 మంది సంతకాలతో లెటర్ రాసినా పట్టించుకోలేదని అన్నారు. సోనియా గాంధీ నిస్సహయురాలుగా మారి పోయారన్నారు. ఉత్తమ్ తాను గెలిచిన సీటులో ఆయన భార్య పద్మావతి ఓడిపోయిన తరువాత రాజీనామ చేశారన్నారు. అయితే శశిధర్ రెడ్డి తండ్రి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా రెండు సార్లు పనిచేశారు. మర్రి శశిధర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.