గులాబీ పార్టీకి ‘మాస్టర్ ప్లాన్‌’ చీడ! నల్గొండలోనూ బిగిస్తున్న ఉచ్చు !

దూరంగా ఉండాల్సిన ఇండ‌స్ట్రియ‌ల్ జోన్ పట్ట‌ణంలో ఏర్పాటు.. జోన్ ప‌రిధిలోకి వెళ్లిన భూముల ధ‌ర‌లు ప‌డిపోతున్న వైనం స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్న ప్లాన్ రూప‌క‌ల్ప‌న‌ రాజ‌కీయం చేయొద్దంటున్న ప్లాన్ అనుకూల వాదులు విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీల అభివృద్ధి పేరుతో రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లు జనంలో వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీ ల మాస్టర్ ప్లాన్ పై రేగిన ఆందోళనలు రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లపై చర్చలకు, ఆందోళనలకు తెరలేపాయి. […]

  • By: krs    latest    Jan 26, 2023 11:27 AM IST
గులాబీ పార్టీకి ‘మాస్టర్ ప్లాన్‌’ చీడ! నల్గొండలోనూ బిగిస్తున్న ఉచ్చు !
  • దూరంగా ఉండాల్సిన ఇండ‌స్ట్రియ‌ల్ జోన్ పట్ట‌ణంలో ఏర్పాటు..
  • జోన్ ప‌రిధిలోకి వెళ్లిన భూముల ధ‌ర‌లు ప‌డిపోతున్న వైనం
  • స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్న ప్లాన్ రూప‌క‌ల్ప‌న‌
  • రాజ‌కీయం చేయొద్దంటున్న ప్లాన్ అనుకూల వాదులు

విధాత: తెలంగాణ రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మున్సిపాలిటీల అభివృద్ధి పేరుతో రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్‌లు జనంలో వ్యతిరేకతను తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీ ల మాస్టర్ ప్లాన్ పై రేగిన ఆందోళనలు రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లపై చర్చలకు, ఆందోళనలకు తెరలేపాయి.

ఇప్పుడు జిల్లా కేంద్రం నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ సైతం కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ త‌రహాలోనే ప్రజల్లో ఆందోళనకు బీజం వేస్తుంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్‌, కమర్షియల్ జోన్, రిక్రియేషన్ జోన్, మిక్స్డ్ యూజ్ జోన్ అంటూ పలు రకాలుగా పట్టణంలోని వార్డులను, మున్సిపల్ విలీన గ్రామాలను, వాటిల్లోని భూములను నిర్ధారిస్తున్నారు.

ఆయా జోన్లలో చేరిన ప్రాంతాల్లో, భూముల్లో సదరు జోన్ల నిబంధనల మేరకు కట్టడాల అనుమతులు పొందాల్సి ఉండడం, భూములను వినియోగించడం చేయాల్సి ఉంటుంది. అయితే నీటి వసతి ఉండి రెండు పంటలు పండే భూములను సైతం ఇండస్ట్రియల్ జోన్‌లో చేర్చి మాస్టర్ ప్లాన్ రూపొందించడం ప్రజాగ్రహానికి కారణం అవుతున్న‌ది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీస్తుంది. గ్రీన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్‌లోకి వెళ్లిన భూముల ధరలు భారీగా పడిపోవడం సహజంగానే రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.

క్షేత్రస్థాయిలో అధికారులు స్వయంగా సందర్శించి రూపొందించాల్సిన మాస్టర్ ప్లాన్లను ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థలు గూగుల్ మ్యాప్ టెక్నిక్‌తో రూపొందించడం అనేక సమస్యలను సృష్టిస్తుంది. జిల్లాలో దేవరకొండ మున్సిపాలిటీ గుట్టల ప్రాంతం, గిరిజన ప్రాంతం కావడంతో వాటిలో ఇండస్ట్రియల్, కమర్షియల్ జోన్ల గుర్తింపు వివాదాస్పదంగా మారింది. మిర్యాలగూడ మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ కూడా అభ్యంతరాల దశలోనే ఉంది. చండూర్, చిట్యాల నందికొండ, హాలియా మాస్టర్ ప్లాన్‌ల రూపకల్పనలో కూడా పురోగతి లేదు.

ఆలస్యంగా అభ్యంతరాల సెగలు

నల్గొండ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయానికి వస్తే 2.65 లక్షల జనాభాతో , 48 వార్డులతో విస్తరించి ఉంది. ఇందులో విలీన గ్రామాలు సైతం ఉన్నాయి. ప్రతి 20 ఏళ్లకు ఒకసారి మాస్టర్ ప్లాన్ కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంది. 1987లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కాలం చెల్లిపోయినది.

కేంద్రం 2014లో నల్గొండ, లుథియానాలను మోడల్ సిటీ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినప్పటికీ రాష్ట్రప్రభుత్వం 2021 లో మాస్టర్ ప్లాన్ ముసాయిదా రూపకల్పనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై అభ్యంతరాల స్వీకరణలో భాగంగా 179కి పైగా అభ్యంతరాలు లిఖీత పూర్వకంగా అందాయి.

కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్‌లపై రేగిన ఆందోళనల సెగలు నెమ్మదిగా నల్గొండ మున్సిపాలిటీ పై ప్రభావం చూపుతున్నాయి. నల్గొండ నూతన మాస్టర్ ప్లాన్‌లో బైపాస్ రోడ్డు పట్టణం నడిబొడ్డు నుండి వెళ్లడంతో అనేక మంది దుకాణాలు, ఇండ్లు, స్థలాలు కోల్పోయి ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

బైపాస్ శివారు గ్రామాలైన పానగల్ నుండి శేషమ్మగూడెం, కేశరాజుపల్లి, బాటిలింగ్ కంపెనీ, ఏఆర్ నగర్, లాలయ్య గూడెం, మర్రిగూడెం, చర్లపల్లి, అన్నేశ్వరమ్మ గుట్ట, పానగల్ మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే మాస్టర్ ప్లాన్‌లో బైపాస్ రోడ్డును పానగల్ నుండి ఎఫ్‌సీఐ కాలనీ, అల్కాపురి కాలనీ, జూబ్లీహిల్స్, లూయిస్ నగర్, గంధవారి గూడెం, ఎస్ఎల్బీసీ, దేవరకొండ రోడ్ హౌసింగ్ బోర్డ్, షేర్ బావిగూడెం మీదుగా రూపొందించిన తీరు విమర్శల పాలవుతుంది.

బైపాస్ రోడ్డు రైల్వే లైన్, వ్యాగన్ సెంటర్ల మీదుగా వస్తే వందల కోట్ల నిర్మాణాలు నష్టపోవాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తుంది. మరోవైపు శేషమ్మగుడెం, మర్రిగూడెం, చర్లపల్లి, బుద్ధారం గ్రామ ప్రాంత ఏరియాను ఇండస్ట్రియల్ జోన్ గా ప్రతిపాదించడంపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

ఇప్పటికే తమ భూములు ఏఎంఆర్పీ కాలువల కింద, అద్దంకి బైపాస్, రైల్వే లైన్ల కోసం నష్టపోయామని.. ఇప్పుడు ఇండస్ట్రియల్ జోన్ ప్రతిపాదనతో మరోసారి నష్టపోవాల్సిన దుస్థితి ఎదురవుతుందంటూ ఆయా ప్రాంతాల ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణానికి దూరంగా ఉండాల్సిన ఇండస్ట్రియల్ జోన్‌ను పట్టణ పరిధిలో గతంలో ఏర్పాటు అయిన ఆయిల్ మిల్లులు, చిన్న కంపెనీలను పరిగణలోకి తీసుకొని ఇండస్ట్రియల్ జోన్ అంటూ ప్రతిపాదించడం విడ్డురంగా ఉందంటున్నారు. మొత్తంగా మర్రిగూడలో సర్వే నెంబర్లు 313, 314, 360, 361, 362, 363లలోని భూములు, చర్లపల్లిలో 549 నుండి 561 వరకు కొన్ని భూములు మొత్తం 500 ఎకరాల మేరకు ఇండస్ట్రియల్ జోన్ పరిధిలోకి వెళ్లాయి.

దీనికి తోడు గతంలో గ్రీన్ బెల్ట్‌లో ఉన్న దేవరకొండ రోడ్‌లో 685, 688 సర్వే నెంబర్ల భూములను మాస్టర్ ప్లాన్‌లో హిల్స్ జోన్‌గా ప్రతిపాదించడంతో ఇక్కడ పెద్ద ఎత్తున నివాస గృహాల వారికి ఇబ్బంది ఏర్పడనుంది.

ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లలో ఉన్న వెంచర్లలోని ఇండ్లు, ప్లాట్లతో పాటు వెంచర్ల బయట నిర్మించుకున్న ప్రజల భూములు, ఇండ్ల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పట్టణంలోని హైదరాబాద్ రోడ్డును 100 ఫీట్ల నుండి 150 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేయాలని ప్రతిపాదించడంతో రోడ్ల వెంట దుకాణదారులు, నివాస గృహాల ప్రజలకు మరోసారి తిప్పలు తప్పవు.

అటు ఇండస్ట్రియల్ జోన్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇప్పటికే మర్రిగూడ, చర్లపల్లి, కేశవరాజు పల్లి రైతులు జిల్లా కలెక్టర్ ను, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు అందించారు.

మున్సిపల్ కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్‌లో లేవనెత్తిన అభ్యంతరాలపై ఇంతవరకు సవరణల దిశగా పురోగతి లేదు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాత్రం మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని, అందరి ఆమోదంతోనే మాస్టర్ ప్లాన్‌ను ముందుకి తీసుకెళ్తామని చెప్పడం బాధిత ప్రజలకు కొంత ఊరటనిచ్చేదిగా ఉంది.

అయితే గత ప్లాన్‌లో ఉన్న బైపాస్ రోడ్డుకు కొత్త మాస్టర్ ప్లాన్‌లో కొత్తగా ఏడు కిలోమీటర్ల పరిధి తోడైందని, ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటులో రైల్వే, రోడ్డు, వాటర్ కనెక్టివిటి ఉన్న ప్రాంతాలను మాత్రమే చేర్చారని, హిల్ జోన్‌లో గుట్టల ప్రాంతం మాత్రమే ఉందని దీనిపై రాజకీయాలను చేయడం తగదంటూ మాస్టర్ ప్లాన్ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి.

రియల్ వ్యాపారులు, విపక్ష నాయకులు కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే నల్గొండ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు చెబుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. నుడా ( నీలగిరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) ఏర్పాటు పిదప మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ప్రాధాన్యత కూడా మారిపోనుందన్న వాదన కూడా వినిపిస్తోంది.

మొత్తం మీద నల్గొండ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా బాధిత ప్రజలు, రైతులు ఎంత మేరకు తమ ఆందోళనను ఉదృతం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.