కేసీఆర్‌కు షాకిచ్చిన మాయ‌వ‌తి.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ట్వీట్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి షాకిచ్చారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

  • By: Somu    latest    Mar 09, 2024 11:11 AM IST
కేసీఆర్‌కు షాకిచ్చిన మాయ‌వ‌తి.. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ట్వీట్

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తి షాకిచ్చారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమ‌ని, థ‌ర్డ్ ఫ్రంట్‌లో కూడా చేర‌బోమ‌ని మాయావ‌తి తేల్చిచెప్పారు. ఈ మేర‌కు అధికారికంగా బెహ‌న్ జీ ట్వీట్ చేశారు. బీఎస్పీ పొత్తులు పెట్టుకుంటుంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వం అని ఆమె పేర్కొన్నారు.


లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ త‌న సొంత బ‌లంతోనే పోరాడుతోంద‌ని ఆమె త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. పొత్తులు, థ‌ర్డ్ ఫ్రంట్ అనేది కేవ‌లం పుకార్లు, త‌ప్పుడు వార్త‌లు అని తెలిపారు. ఇలాంటి దుర్మార్గ‌పు వార్త‌ల‌తో మీడియా కూడా త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోకూడ‌దు. ప్ర‌జ‌లు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మాయావ‌తి సూచించారు. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బీఎస్పీ ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని తెలుసుకున్న ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. అందుకే ప్ర‌తిప‌క్షాలు ర‌క‌ర‌కాల పుకార్లు పుట్టిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బ‌హుజ‌నుల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బీఎస్పీ ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింద‌ని మాయావ‌తి స్ప‌ష్టం చేశారు.


తెలంగాణ‌లో బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తుపై నీలినీడ‌లు..!


ఈ నెల 5వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స‌మావేశ‌మై తెలంగాణ‌లో పొత్తుల‌పై చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్ – బీఎస్పీ క‌లిసి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్లు ఒకే వేదిక నుంచి కేసీఆర్, ఆర్ఎస్పీ ప్ర‌క‌టించారు. తాజాగా మాయావ‌తి ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ‌లో ఈ రెండు పార్టీల పొత్తుపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.


ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నట్లు నాడు కేసీఆర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే నాటి ఉద్యమ కాలం నుంచి ప్రగతి కాలం వరకు పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. అదే సైద్ధాంతికతో భావ సారూప్యతతో పనిచేస్తున్న బీఎస్పీతో పొత్తును ప్రజలు హర్షిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. లౌకికవాద తాత్వికతతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఆ దిశగా పదేండ్ల పాటు అనుసరించిన కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.


ఈ నేపథ్యంలో దళిత బహుజన శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మరింత చేరువవుతామన్నారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీఎస్పీలు కలిసికట్టుగా పనిచేసి ప్రజా అభీష్టాలను సంపూర్ణంగా నెరవేరుస్తామని కేసీఆర్ అన్నారు. ఈ దిశగా మరిన్ని చర్చలు జరిపి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పొత్తుల విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏం జ‌ర‌గ‌బోతుందో వేచి చూడాల్సిందే.