కాంగ్రెస్‌లో పోటీకి సభ్యులే లేరు: మంత్రి హరీశ్ రావు

- త్వరలో బీఆరెస్ మేనిఫెస్టో
- కొత్త పథకాలతో ప్రతిపక్షాలకు దిమ్మతిరుగుద్ది..
- నకిరేకల్‌లో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ
- పాల్గొన్న మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డిలు
విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 30, 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సభ్యులు లేరని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా నకిరేకల్ నియోజవర్గం రామన్నపేటలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇక్కడి నాయకుడు ఒకరు 24 గంటల కరెంట్ రావడం లేదు అంటున్నడు, అందులో వేలు పెట్టు చూడు, కరెంట్ వస్తుందా? లేదా తెలుస్తుందని చమత్కరించారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారు.. కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే అంటూ విమర్శించారు.
కరెంటు విషయంలో ఎన్నికల్లో వెళ్ళడానికి మేము సిద్ధం… కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా ప్రజలనే తీర్పుకోరుదాం, దాని మీదే ఎన్నికలకు పోదామంటూ సవాల్ విసిరారు. త్వరలో అద్భుతమైన బీఆరెస్ మేనిఫెస్టో వస్తుంది. కాంగ్రెస్, బీజేపీ దిమ్మదిరిగేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ త్వరలో ఆ శుభవార్త చెబుతారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు.
ఎమ్మెల్యే లింగయ్యకు కనీసం హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదని, కళ్ళుమూసినా, కళ్ళు తెరిచినా నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తారన్నారు. ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు పెంచి మొత్తం రూ.17 కోట్లతో రామన్నపేటలో మంచి ఆసుపత్రి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ, సూర్యాపేట్ లలో మెడికల్ కాలేజీలు తెచ్చామని, నాడు.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటే, నేడు నేను సర్కారు దవాఖానకు పోతా అంటున్నారని చెప్పుకొచ్చారు.
మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిన్న చిన్నగానే పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని అన్నారు. సూర్యాపేట బహిరంగ సభలో సీఎం కేసీఆర్ తన (మంత్రి జగదీశ్‌రెడ్డి) గురించి మాట్లాడిన…సద్దితింటా- వండేదాకా ఉంటా సామెత నిజానికి లింగయ్య విషయంలో నిజమన్నారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ సుభిక్షంగా ఉందని, పల్లెలకు సైతం రోడ్లు, నీళ్లు, నిధులు వచ్చాయన్నారు.
భారతదేశంలో ఇప్పటికి 35 శాతం ప్రజలు ఒక్కపూటే అన్నం తింటున్నారని నివేదికలు వచ్చాయని, సాక్షాత్తూ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా ఇదే పరిస్థితి ఉందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రజలు రెండు పూటలా అన్నం తింటున్నారని, ఇది 9 ఏళ్ల కేసీఆర్ పాలన ఫలితమేనన్నారు. 60 ఏళ్లు మన తలలు పగులగొట్టి, లక్షలాది మందిని పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్ దుర్మార్గులు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారు అని, కానీ ప్రజలు మోసపోకుండా అభివృద్ధికి, బీఆరెస్ పార్టీకి ఓటు వేయాలి అని అభ్యర్థించారు.
మరో రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి చిరుమర్తి లింగయ్యనే తిరిగి గెలిపించాలని జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు రామకృష్ణారెడ్డి, బాలరాజ్ యాదవ్, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.