Minister Harish Rao | మళ్ళీ BRSదే అధికారం.. కేసీఆరే సీఎం: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao | సంగారెడ్డి జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంను అభివృద్ది పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికలలో బీఆరెస్‌ పార్టీ అధ్వర్యంలో మరోసారి భారీ మెజార్టీ సాధించి సీఎం అవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు పథకం లక్ష రూపాయల చెక్కులను 300మంది లబ్ధిదారులకు […]

  • By: Somu    latest    Aug 12, 2023 12:27 AM IST
Minister Harish Rao | మళ్ళీ BRSదే అధికారం.. కేసీఆరే సీఎం: మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao |

  • సంగారెడ్డి జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంను అభివృద్ది పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌ వచ్చే ఎన్నికలలో బీఆరెస్‌ పార్టీ అధ్వర్యంలో మరోసారి భారీ మెజార్టీ సాధించి సీఎం అవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బీసీ బంధు పథకం లక్ష రూపాయల చెక్కులను 300మంది లబ్ధిదారులకు హరీశ్‌రావు పంపిణీ చేశారు. పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేస్తూ ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. సైదాపూర్, గంగాపూర్, మారేపల్లి గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ (CM KCR) పల్లెల అభివృద్ధి దిశగా చిన్న తండాలను కూడా గ్రామపంచాయతీలుగా చేశారని, దీంతో చిన్న గ్రామపంచాయతీలో సర్పంచ్ తో పాటు పంచాయతీ సెక్రెటరీల నియామకంతో పదివేల మంది పంచాయతి సెక్రటరీలకు ఉపాధి కల్పించామన్నారు. దేశంలో మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణకు 38% అవార్డులు వస్తున్నాయంటే దాని వెనుక మీ కృషి ఉందన్నారు. ఈరోజు అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీ, వైకుంఠ ధామం, నర్సరీ ఉన్నాయంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో ఏ గ్రామానికి ఇన్ని వసతులు లేవని, గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి కాబట్టే అంటు రోగాలు నివారించగలిగామన్నారు. సంగారెడ్డిలో మొదటి దశ బీసీ బంధులో 300 మంది కుల వృత్తి దారులకు లక్ష రూపాయల సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది దశల వారీగా కొనసాగుతుందని, బీసీ బంధు నిరంతర ప్రక్రియ అన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క బీసీ వర్గాలనే కాదని, అన్ని కులాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడన్నారు. బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ చేసే అనేక పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 19 బీసీ గురుకుల పాఠశాలలుంటే ఈరోజు 310 గురుకుల పాఠశాలలు బీసీల కోసం ఏర్పాటు చేసుకున్నామని, వాటిని జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ కూడా చేసుకున్నామన్నారు. మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని ఆడపిల్లల విద్య కోసం శ్రీకారం చుట్టాడన్నారు. అదేవిధంగా పై చదువులు చదువుకోడానికి బయట దేశాలకు పోవాలనుకున్న వారి కోసం జ్యోతిబాయ్ పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద 20 లక్షలు ఆర్థిక సాయం సీఎం కేసీఆర్‌ చేస్తున్నారన్నారు.

కులవృత్తులు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్‌ ఈరోజు రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులకు, రజక సోదరులకు ఉచిత కరెంటు ఇస్తున్నారన్నారు. 100కోట్లతో 35 వేల సెలూన్లకు 60 వేల లాండ్రీ షాపులకు ఉచిత కరెంటు కేసీఆర్‌ ఇస్తున్నారని చెప్పారు. అదేవిధంగా గీత కార్మికుల కోసం పాత బకాయిల రద్దు చేసి చెట్టు పన్ను రద్దుచేశారన్నారు. 6లక్షల రూపాయల ప్రమాద బీమా కూడా అందిస్తున్నామన్నారు. నేతన్నను కూడా ఆదుకున్న కేసీఆర్‌ మగ్గమున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారన్నారు. సద్ది తిన్నరేవు తలవాలి అంటారని, అందుకనే ఇన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రజలను కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్‌ను, బీఆరెస్ పార్టీని మళ్లీ గెలిపించాలని కోరారు.

రుణమాఫీతో కాంగ్రెస్ ఆగమాగం

కాంగ్రెస్ (Congress) వాళ్లకు ఎన్నికల్లో మాట్లాడడానికి మాటల్లేవని, నిలబెట్టడానికి నాయకులు లేరని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే మూడు గంటలు కరెంటు చాలు అంటున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దొంగరాత్రి కరెంటు ఇచ్చి, ఇప్పుడు అది కూడా ఇయ్యరంటని, మూడు గంటలే ఇస్తారంటని హరీశ్‌రావు విమర్శించారు.

మూడు గంటల కరెంటు చాలు అంటే ఏ రైతన్నయినా కాంగ్రెస్ వైపు చూస్తాడా అని ప్రశ్నించారు. కరెంటు కోతలతో రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, రైతులను పోలీస్ స్టేషన్లలో, క్యూలైన్లలో నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని దుయ్యబట్టారు.

రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలపైన కాంగ్రెస్‌కు ఆలోచన లేదన్నారు. ఈరోజు 70 వేల కోట్లు రైతుబంధు కింద, 5300 కోట్ల రూపాయలు రైతుబీమా కింద రైతులకు అందించిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. పక్కన ఉన్నకాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 24 గంటలు కరెంటు లేదని రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో 24 గంటలు కరెంటు ఇవ్వడం లేదని, దేశంలో 24 గంటల కరెంటు రైతుల ఇస్తున్న ప్రభుత్వం ఒక్క సీఎం కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు.

రైతు రుణమాఫీ రద్దు చేయరేమో అనుకొని దింపుడు గల ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కు రైతు రుణమాఫీ చేసి కేసీఆర్ బుద్ది చెప్పారన్నారు. సోమవారం నాటికి 99 వేల రూపాయల వరకు రైతులు రుణ మాఫీ చేసామన్నారు. కేసీఆర్ రుణమాఫీ దెబ్బకు కాంగ్రెస్ నాయలు ఆగమాగమవుతున్నారన్నారు. కేసీఆర్ రైతులకు అడిగింది ఇచ్చిండని, అడగంది ఇచ్చిండన్నారు. కాళేశ్వరం కట్టి పుష్కలంగా నీళ్లు తెచ్చిండని, 24 గంటల కరెంటు ఇచ్చిండని అటువంటి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని తిరిగి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు.

కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెడుతామంటేనే రాష్ట్రానికి రావాల్సిన 22వేల కోట్లు ఇస్తామన్నదని, నీతి అయోగ్ చెప్పిన వినలేదని, తెలంగాణపై కపట ప్రేమ చూపుతున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు తీసుకరావాలని హరీశ్‌రావు సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.