రైతుబంధు ఆపిన కాంగ్రెస్‌ను ఖతం చేయాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు

  • By: Somu    latest    Nov 27, 2023 10:07 AM IST
రైతుబంధు ఆపిన కాంగ్రెస్‌ను ఖతం చేయాలి: మంత్రి జగదీశ్ రెడ్డి
  • ఎన్నికల కమిషన్ ఆదేశాలు దురదృష్టకరం
  • ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే
  • రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదు
  • ఎన్నికల తర్వాత యథావిధిగా రైతుబంధు చేరుతుంది
  • నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం
  • మళ్ళీ కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి
  • సూర్యాపేట బీఆరెస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి


విధాత, సూర్యాపేట: రైతుబంధు ఆపిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఖతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై సోమవారం మంత్రి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రైతుబంధు విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలు దురదృష్టకరమన్నారు.


ఆనాడు కుట్రపూరితంగా కాంగ్రెస్ ఆపితే, నేడు ఎన్నికల కమిషన్ రూపంలో ఆటంకం కలిగిందని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఆపగలిగేది ఈ నాలుగు రోజులే ఆన్న మంత్రి, రైతులకు ఎలాంటి బెంగ అవసరంలేదన్నారు. తాత్కాలిక ఆటంకాలతో అధైర్యపడొద్దని అన్నారు. ఎన్నికల తరువాత యథావిధిగా రైతుబంధు రైతుల ఖాతాలకు చేరుతుందని చెప్పారు. మళ్ళీ కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు.


కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉండగా రైతుబంధు, 24 గంటల కరెంటు, రైతు బీమా తోపాటు ఏఒక్క సంక్షేమ పథకం ఆపేవాడు ఎవడూ లేరన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవొద్దన్నారు. నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న మంత్రి, ప్రజల నుంచి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. గ్రామాలకు ప్రచారంలోకి వెళ్తున్న సందర్భంగా అభ్యర్థులుగా గుర్తించకుండా.. ప్రజలు వినతులు, విజ్ఞాపనలతో తమను అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు.