బీఆరెస్ ఖాళీ కాబోతుంది..నలుగురే మిగులుతారు: మంత్రి కోమటిరెడ్డి

బీఆరెస్ పార్టీ నుంచి వలసలు వెల్లువలా సాగుతున్నాయని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ కాబోతుందని, చివరకు కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవితలే మిగులుతారని మంత్రి కోమటిరెడ్డి జోస్యం

  • Publish Date - March 13, 2024 / 11:44 AM IST
  • కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం
  • ఊళ్లలో నీళ్ల సమస్యలతో కళ్లలో నీల్లు వస్తున్నాయి
  • నీటి సమస్యలపై అధికారులకు ఆదేశాలు

విధాత : బీఆరెస్ పార్టీ నుంచి వలసలు వెల్లువలా సాగుతున్నాయని, త్వరలోనే ఆ పార్టీ ఖాళీ కాబోతుందని, చివరకు కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవితలే మిగులుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, పాలకవర్గం సభ్యుల పదవీ స్వీకారోత్సవానికి హాజరై అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపాల్టీ కార్మికులతో కలిసి ఆయన భోజనం చేశారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి హామీలిచ్చారు. అనంతరం వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోపే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత బీఆరెస్ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థనను నాశనం చేసిపోయినా క్రమశిక్షణతో ఒక్కో హామీలు అమలు చేస్తున్నామన్నారు.

డబ్బుల ఆశతో కేసీఆర్ కుటుంబం తెలంగాణను నాశనం చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దోచుకుందని విమర్శించారు. బీఆరెస్‌ చచ్చిన పాము లాంటిదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. కామన్ సివిల్ కోడ్ ఎన్నికలకు ముందు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే తెచ్చారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారన్నారు. కేంద్రంలో సంకీర్ణ కూటమి అధికారంలోకి వస్తుందని, ఇండియా కూటమి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కరవు నేపథ్యంలో ఊళ్లల్లో నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయన్నారు. వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలిచ్చామన్నారు. నల్గొండ మున్సిపాలిటీని నెంబర్-1 గా మారుస్తానని, జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని, నల్గొండ అభివృద్ధి పై ప్రతీ రోజు అధికారులతో సమీక్ష చేస్తున్నానని వెల్లడించారు. ఏ సమస్యతో ప్రజలు నా వద్దకు వచ్చినా సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తున్నట్లుగా తెలిపారు.