విధాత : కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 575 టీఎంసీల వాటా తేల్చాకే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో కాలు పెట్టాలని బీఆరెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. ప్రధాని మోదీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టుతో తమకేం సంబంధమన్న కేటీఆర్.. ఆ పంచాయితీని ఆంధ్రలోనే తేల్చుకోవాలని అన్నారు.
మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాలు పెట్టే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. దేశంలోనే వెనుకబడిన మహబూబ్‌నగర్ వలసలతో గోసపడుతున్న జిల్లా అని చెప్పారు. ఆ గోస తీర్చే లక్ష్యంతో తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014జూలై 14న సీఎం కేసీఆర్ కృష్ణా జలాల వాటా తేల్చాలని లేఖ ఇచ్చారని, అయినా ఇప్పటిదాకా వాటా తేల్చలేదని విమర్శించారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల్లో జాప్యం చేశారని, నీటి కేటాయింపులకు ట్రిబ్యునల్‌కు వెళ్లమని చెప్పారని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోగా, అప్పర్ భద్రకు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కనపెట్టారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల అనుమతులపై కేంద్రం రాష్ట్రానికొక రకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
మోదీ నిర్వాకం వల్ల నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు వందల టీఎంసీల నీటిని కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్.. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించిందని, అందులో 575 టీఎంసీలు దక్కాలనేది మా వాదనని చెప్పారు. ట్రిబ్యునల్‌కు ఉత్తరం రాయకుండా, పాప పరిహారం చేసుకోకుండా పాలమూరులో ఎలా అడుగుపెడతారని మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల కోసమే పాలమూరు వస్తున్న మోదీ మాటలను ప్రజలు నమ్మరని చెప్పారు. ఈసారి కూడా ఆ పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు దక్కవని తేల్చి చెప్పారు.
తెలంగాణపై పదేపదే విషం
ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పదేపదే అవమానిస్తున్నారని, పార్లమెంట్ వేదికగా, బహిరంగ వేదికల మీద విషం చిమ్ముతున్నారన్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంటేనే గిట్టనట్టు, పగబట్టినట్టు, తెలంగాణ పుట్టుకను, అస్తిత్వాన్ని మోదీ అగౌరవ పరుస్తున్నారని ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ.. తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచేలా చాలాసార్లు పార్లమెంట్ వేదికగా విషం చిమ్మారన్నారు.
అమృత కాల్ సమావేశాలని చెప్పి తెలంగాణ సమాజంపై మరోసారి అజ్ఞానంతో మాట్లాడారని దుయ్యబట్టారు. 14 ఏండ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ పట్ల, కేసీఆర్ నాయకత్వం పట్ల మోదీకి కొంత ఇబ్బంది ఉండొచ్చన్న కేటీఆర్.. జయశంకర్ సార్ లాంటి మేధావుల పట్ల, ప్రజల త్యాగాల పట్ల ఎందుకు చిన్నచూపని నిలదీశారు. రాష్ట్ర విభజన హామీలకు పాతరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 మాదిరిగానే రాబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవని తేల్చి చెప్పారు. తెలంగాణలో మొన్ననే దశాబ్ది ఉత్సవాలు జరుపుకొన్నామని, మోదీ మాత్రం తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉత్సవాలు జరగలేదన్నట్టు మాట్లాడారని గుర్తు చేశారు. దీనిపై తెలంగాణ ప్రజలకు మోదీ వివరణ ఇవ్వాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ ఏజెంట్‌లా గవర్నర్
తెలంగాణ గవర్నర్ తమిళి సై పూర్తిగా మోదీ ఏజెంట్‌గా ప్రవర్తిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. రాజ్‌భవన్‌ను బీజేపీ రాజకీయాలకు అడ్డాగా మార్చారని ఫైర్ అయ్యారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదిస్తే తమిళిసై తిరస్కరించడాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై గవర్నర్‌గా ఎలా నియామితులయ్యారని ప్రశ్నించారు.
ఇది సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధం కాదా? అని నిలదీశారు. ‘నిన్నటిదాకా మీకు వర్తించని న్యాయం ఇవాళ వారికి వర్తించాలని అంటున్న మీరు అసమర్థులా? మీ తిరస్కారానికి గురైనవారు అసమర్థులా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. శాసన మండలిలో బలహీనవర్గాలు, గిరిజన బిడ్డల గొంతుక వినిపించకుండా గవర్నర్ అడ్డుపడ్డారని మండిపడ్డారు.
ఆంధ్రా పంచాయితీ అకడ్నే తేల్చుకోవాలి
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు సంబంధం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్యని అన్నారు. అక్కడ రెండు పార్టీల మధ్య పోరు సాగుతున్నదని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుపై విజయవాడ, రాజమండ్రి, అమరావతిలో ఆందోళనలు చేసుకోవాలని సలహా ఇచ్చారు.
ఆంధ్రాలో పంచాయితీని ఆంధ్రాలోనే తేల్చుకోవాలని, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్న హైదరాబాద్ వాసులను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారని, జరుగాల్సిన న్యాయం కోర్టులో జరుగుతుందన్నారు. వైసీపీ, టీడీపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం లేదన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారన్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ సెక్టార్‌లో ఆందోళనలు జరగలేదని, ఇప్పుడు ఆందోళన పేరుతో శాంతి భద్రతల సమస్య వస్తే ఎలాగని అన్నారు. వేల మంది ఆంధ్రా సోదరులు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారని, హైదరాబాద్‌లో ఐటీ దెబ్బతినకూడదని తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
అరెస్టు వ్యవహారంపై తమ పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తాము ఈ వివాదంలో తటస్తంగా ఉంటున్నామని ప్రకటించారు. ఏపీ నేతలు లోకేశ్, జగన్, పవన్ తనకు మిత్రులని చెప్పారు. ఆందోళనలకు అనుమతిపై లోకేశ్ ఫోన్ చేయించి అడిగారన్న కేటీఆర్.. ఒకరికి అనుమతిస్తే వేరే పార్టీకి అనుమతి ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఏపీ పంచాయితీలకు తెలంగాణను వేదిక కానివ్వబోమని స్పష్టం చేశారు.