హామీల అమలు ఎలా సాధ్యం : అక్బరుద్ధిన్ ఒవైసీ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు

విధాత: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు 2లక్షల 16వేల కోట్లకు పైగా ఏటా బడ్జెట్ కావాల్సివుందని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నేపధ్యంలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధిన్ ఒవైసీ డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉర్దూ భాష ప్రస్తావన లేదని, ఉర్దూను రెండో అధికారిక భాషగా అమలు చేయాలని కోరారు. డిఎస్సీలో ఉర్దూ పోస్టులను భర్తీ చేయలని కోరారు. ఇమామ్‌లకు 15వేల వేతనం అందించాలని, షాదీ ముబారక్ పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని సూచించారు. పాతబస్తీలో అసంపూర్తి అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన అబ్ధుల్ కలామ్ స్కీమ్ పేరుపై గందరగోళం వ్యక్త పరిచారు. అబుల్ కలాం అజాద్…లేక మిస్సైల్ మ్యాన్ అబ్ధుల్ కలాంలలో ఎవరి పేరు అనుకోవాలో అర్ధం కావడం లేదన్నారు. ముస్లిం మైనార్టీలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు, మాకు కూడా ఓట్లు వేశారని, వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించడం తగదన్నారు.