ఏపీ ఎమ్మెల్సీ కారుకు ప్రమాదం.. స్పాట్లో పీఏ దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో వైసీపీకి చెందిన‌ శాసన మండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గాయ‌ప‌డ్డారు

  • Publish Date - January 5, 2024 / 07:11 AM IST
  • పీఏ దుర్మ‌ర‌ణం.. కారు డ్రైవ‌ర్‌కూ గాయాలు
  • ఏపీలోని దగదర్తిలో అదుపుత‌ప్పి లారీ ఢీకొట్టిన కారు
  • ఎమ్మెల్సీకి ప్రాణాప్రాణం త‌ప్పింద‌న్న‌వైద్యులు


విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో వైసీపీకి చెందిన‌ శాసన మండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గాయ‌ప‌డ్డారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. దగదర్తిలో ఎమ్మెల్సీ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయ‌పడిన ఎమ్మెల్సీ పర్వతారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డికి ఎలాంటి ప్రాణాపాయం లేద‌ని వైద్యులు తెలిపారు.


విజయవాడ నుంచి నెల్లూరు వెళ్తుండగా కొడవలూరు మండలం ద‌గ‌ద‌ర్తి వ‌ద్ద ఎమ్మెల్సీ చంద్రశేఖరెడ్డి ప్రయాణిస్తున్న‌ కారు అదుపు తప్పింది. అతి వేగంగా డివైడర్‌ను ఢీ కొట్టింది. అటుగా వెళ్తున్న‌ లారీని ఢీ కొట్టి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఎమ్మెల్సీ సహాయకుడు వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎమ్మెల్సీతో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఎమ్మెల్సీని, కారు డ్రైవ‌ర్‌ను స్థానికులు హుటాహుటిన ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఎమ్మెల్సీ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ద‌ని, ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.