విధాత: కాంగ్రెస్ ఎన్నికల హామీలను 420హామీలుగా బీఆరెస్ పేర్కోనడం పట్ల ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ అసలు తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజుల్లోగానే హామీలు అమలు చేయలేదంటూ మోసపూరిత హామీలిచ్చిదంటూ బీఆరెస్ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఎట్లా కేటీఆర్ అంటూ మండిపడ్డారు.
దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని, మైనార్టీలకు 12శాతం, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ఇస్తామని, అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని మొదట తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో బీఆరెస్ ఇచ్చిన హామీలేమిటో ఒకసారి కేటీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలని, వాటిని పదేళ్లుగా ఎందుకు అమలు చేయలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. 9 సంవత్సరాల్లో నగరంలో తప్ప ఎక్కడైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టారా అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామన్నారు. మేం ఇచ్చిన హమీలను నెరవేర్చడానికి మూడు వారాల్లోనే దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు.
టీఆర్‌ఎస్‌ను బీఆరెస్‌గా మార్చి తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు కేసీఆర్ కోల్పోయారన్నారు. కేసీఆర్ సీఎం అయిన మొదటి నెలలో సీలేరు పవర్ ప్రాజెక్టు ,భద్రాద్రి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కి అప్పచెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రజలకి ఇచ్చిన హమీలని నెరవేర్చి తీరుతుందన్నారు. తెలంగాణ హక్కులని పరిరక్షించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హొదా అడగలేదన్నారు. సీబీఐ విచారణ కావాలంటున్న బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి జ్యూడిషియల్ , సీబీఐ విచారణలలో ఏదీ పెద్దదో తెలువదా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవితను కాపాడినట్లుగా కేసీఆర్‌ను కాపాడేందుకు సీబీఐ విచారణ అడుగుతున్నారన్నారు. కిషన్‌రెడ్డి ప్రస్తుతం ఆయన ఉన్న స్థానాన్ని కాపాడుకోవాలన్నారు. బీఆరెస్ ముందుగా ప్రతిపక్ష హోదాని కాపాడుకోండని, అది తన్నుకుపోవడానికి మీ పక్కన సిద్దంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 15స్థానాలు గెలిచే లక్ష్యంతో ముందుకెలుతున్నామన్నారు. షర్మిల చేరిక కాంగ్రెస్‌కు కలిసివస్తుందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, మాజీ సీఎం కేసీఆర్ భేటీలో రాజకీయ చర్చలు తప్పక ఉంటాయన్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక ప్రభావం ఎంత ఉంటుందోనన్నదానిపై జగన్, కేసీఆర్‌లు చర్చించుకుని ఉండవచ్చన్నారు.