రైతుబంధుకు పరిమితులు పెట్టాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రైతుబంధు, రెవెన్యూ వ్యవస్థలపై వరుసగా హాట్ కామెంట్స్ చేశారు.

- రెవెన్యూ బోర్డులు తేవాలి
విధాత : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రైతుబంధు, రెవెన్యూ వ్యవస్థలపై వరుసగా హాట్ కామెంట్స్ చేశారు. ఇన్‌కమ్ టాక్స్ కట్టే వారికి, వందల ఎకరాలు ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతుబంధు ఇవ్వడం సమంజసం కాదన్నారు. కేవలం భూమి సాగు చేసే సన్న, చిన్నకార రైతులకు ప్రభుత్వ సహాయం అందేలా రైతుబంధుపై పరిమితులు పెట్టాలన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా స్కీమ్ విధివిధానాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. నిజమైన రైతులకే పంట పెట్టుబడి సాయం చేయాలని అన్నారు. భూమిలేని రైతు కూలీలకు 12వేలు, కౌలు రైతులకు రైతు భరోసా సహాయం త్వరలో అమలవుతుందన్నారు. ఇక వీఆర్‌వో, వీఆర్ఏల వ్యవస్థల రద్దుపై జీవన్ రెడ్డి స్పందిస్తూ వీఆర్‌వో, వీఆర్‌ఏ వ్యవస్థల రద్ధుతో గ్రామీణ ప్రాంతాల్లో పాలన లేకుండా పోయిందన్నారు.
ధరణి భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెవెన్యూ బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీఆర్ఏలను క్రమబద్ధీకరించి నాలుగు నెలలవుతున్న వారికి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదన్నారు. సీఎంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాలలో పదోన్నతి పొందిన వీఆర్ఏలు, ఉపాధ్యాయులు, జూనియర్ కార్యదర్శులు తమ సమస్యలపై జీవన్ రెడ్డిని కలిసి తమ సమస్యలు వివరించారు.