Narsapur |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: నర్సాపూర్ సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కి బీఆర్ఎస్ టికెట్ చెక్ పెట్టింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో పెండింగ్ పెట్టారు. ఈ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ హయాంలో 3 సార్లు గెలిచి మంత్రిగా పనిచేసిన సునీతా లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు.
మంత్రి హరీష్ రావు చొరవ చూపక పోవడం, సీఎం కేసీఆర్ కు మదన్ రెడ్డి దగ్గర ఉన్నాడని పేరు ఉండడం, అంతకుమించి స్వయంగా ముఖ్యమంత్రి కుమార్తె ఎమ్మెల్సీ కవిత మంత్రాంగంతో సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ నిరాకరించి, పెండింగ్ లో పెట్టారు.
సోమవారం ఉదయం వరకు జాబితాలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేరు ఉండడం, అప్పటికప్పుడు నర్సాపూర్ టికెట్ ప్రకటించకుండా అభ్యర్థిని పెండింగ్ లో పెట్టడం కవిత జోక్యమేనని అంటున్నారు.
రాజకీయంగా మంచి పేరు ఉన్న మదన్ రెడ్డికి టికెట్ కేటాయించకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని నర్సాపూర్ బీఅర్ఎస్ శ్రేణులు పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. మదన్ రెడ్డి మాత్రం సీఎం కేసీఆర్ తనకు అన్యాయం చేయరని, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనకు దిగి నిరసన వ్యక్తం చేశారు.
కవిత సపోర్ట్ తో పెండింగ్?
మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి సోమవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత ను హైదరాబాదులో ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. తనకి టికెట్ ఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. అందుకే అభ్యర్థుల జాబితా వెలువరించే ముందు కవిత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాతనే నర్సాపూర్ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా నర్సాపూర్ నుండి సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాత్రం తనకే టికెట్ వస్తుందని ధీమాగా ఉన్నారు. చివరికి టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.