కవిత కస్టడీ మరో మూడు రోజుల పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.

- అక్రమ కేసుగా పేర్కోన్న కవిత
విధాత : ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. కవిత కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించాలని ఈడీ, బెయిల్ ఇవ్వాలని కవిత తరుపున దాఖలైన పిటీషన్లపై వాదనలు విన్న కోర్టు మరో మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. విచారణకు హాజరైన కవిత మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయంగా మోపబడిన అక్రమ కేసు అని అభివర్ణించారు.
కేసు విచారణ సందర్భంగా ఈడీ పదేపదే పాత విషయాలపైనే ప్రశ్నిస్తుందని ఆక్షేపించింది. బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇవ్వాలని కోరుతున్నారని, కస్టడీలో ఉంటే ఎలా ఇస్తామని ప్రశ్నించారు. మరోవైపు ఈడీ కోర్టులో తన వాదనల సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై తమ వాదనలను బలంగా వినిపించారు.
నిందితుల్లో ఒకరైన సమీర్ మహేంద్రతో, సీఎం కేజ్రీవాల్ సహా ఇతర నిందితులతో కలిపి కవితను ప్రశ్నించాల్సివుందని కోర్టుకు నివేదించింది. కవిత సౌత్‌గ్రూప్ నుంచి 100కోట్ల ముడుపులను ఆప్‌కు అందించడంలో కీలకంగా వ్యవహారించారని, ఈ కేసులో వందల కోట్ల కిక్ బ్యాక్‌లు ఉన్నాయని పేర్కోంది. విచారణకు కవిత సహకరించడం లేదని, ఆమె బంధువుల వివరాలు చెప్పడం లేదని ఈడీ ఆరోపించింది.
కవిత మేనల్లుడి వ్యాపార వివరాలు చెప్పడం లేదని, అమె గతంలో సమర్పించిన ఫోన్లలో డేటాను తొలగించారని, తాజా సోదాల్లో కవిత ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఫోన్లలో డేటా విశ్లేషణ సాగుతుందని కవిత మేనల్లుడితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు కవిత బెయిల్ పిటిషనను నిరాకరించి, ఈడీ అభ్యర్థన మేరకు మూడు రోజుల కస్టడీని పొడిగించింది.