MLC Kavitha। ముగిసిన MLC కవిత విచారణ.. పదిన్నరగంటలు ప్రశ్నల వర్షం.. రేపు మరోసారి విచారణ
ఉదయం 10.45 గంటకు ఈడీ కార్యాలయంలోకి రాత్రి 9.13 గంటల తర్వాత కార్యాలయం వెలుపలికి తొలుత పిళ్ళైతో కలిపి.. తర్వాత విడిగా ప్రశ్నలు రౌస్ ఎవెన్యూ కోర్టులో పిళ్ళై హాజరు ఏప్రిల్ 4 వరకు పిళ్ళైకి జ్యుడిషియల్ కస్టడీ తీహార్ జైలుకు తరలించిన ఈడీ అధికారులు రేపు మరోసారి విచారణ విధాత: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 నుంచి మొదలైన […]

- ఉదయం 10.45 గంటకు ఈడీ కార్యాలయంలోకి
- రాత్రి 9.13 గంటల తర్వాత కార్యాలయం వెలుపలికి
- తొలుత పిళ్ళైతో కలిపి.. తర్వాత విడిగా ప్రశ్నలు
- రౌస్ ఎవెన్యూ కోర్టులో పిళ్ళై హాజరు
- ఏప్రిల్ 4 వరకు పిళ్ళైకి జ్యుడిషియల్ కస్టడీ
- తీహార్ జైలుకు తరలించిన ఈడీ అధికారులు
- రేపు మరోసారి విచారణ
విధాత: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 నుంచి మొదలైన విచారణ సుమారు 10.30 గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. రాత్రి 9.13 గంటల సమయంలో ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత.. జోరు వానలో అనుచరులు సిద్ధం చేసిన కారు ఎక్కి, విక్టరీ సంకేతం చూపిస్తూ కేసీఆర్ నివాసానికి వెళ్లిపోయారు. అంతకు ముందు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంతకు మించిన ఉత్కంఠత నెలకొన్నది. అయితే తిరిగి రేపు ఉ.11 గంటలకు మరోసారి కవిత ఈడీ విచారణ ఉండనుంది.
మధ్యాహ్నం పిళ్ళైతో కలిపి విచారణ
మధ్యాహ్నం అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి కాన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో కవితను విచారించిన ఈడీ (Enforcement Directorate) అధికారులు మధ్యాహ్నం తర్వాత నుంచి కవితను విడిగా ప్రశ్నించారు. సాయంత్రం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి కాన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించినట్లు తెలుస్తున్నది.
విచారణ ముగిసిన తర్వాత ఈడీ కార్యాలయం నుంచి పిళ్లైని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు ఆయనను తీహార్ జైలుకు తరలించారు.
కవిత విచారణలో ఉత్కంఠ
వాస్తవానికి గత విచారణ సందర్భంగా రాత్రి 8 గంటలకు ఆమె బయటకు వచ్చారు. ఈసారి ఆమె బయటకు రావడానికి 10.30 గంటలు పట్టింది. ఒకదశలో కవిత విచారణ సుదీర్ఘంగా సాగుతుండటం, రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కవిత తరఫు న్యాయవాదులు, డాక్టర్ల బృందం కూడా ఈడీ కార్యాలయానికి రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ చాలా సేపు కొనసాగింది.
దీనికి తోడు కార్యాలయం వెలుపల ప్రత్యేకంగా ఎస్కార్ట్ వాహనాన్ని ఉంచడంతో విచారణ అనంతరం కవితను అరెస్టు చేస్తారేమోనన్న ఊహాగానాలు చెలరేగాయి. కవిత ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన పత్రాలపై ఈడీ అధికారులు సంతకాలు తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి. కవిత కోసం వెళ్లిన లాయర్ల బృందం వెయిటింగ్ రూమ్‌లోనే చాలా సేపు ఎదురు చూశారు.
ఇది రెండో దఫా విచారణ
ఇప్పటికే ఒక విడత విచారణకు హాజరైన కవిత.. ఈ నెల 16న మరోదఫా విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. హాజరు కాలేదు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడంపై సుప్రీంకోర్టులో (Supreme Court) తాను వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నదని, అది తేలేవరకు విచారణ వాయిదా వేయాలని ఈడీ అధికారులకు ఆమె లేఖ రాశారు. అయితే.. ఆ వినతిని తిరస్కరించిన ఈడీ అధికారులు.. సోమవారం హాజరుకావాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి తన భర్త అనిల్‌తో కలిసి కవిత చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కవిత తరఫు న్యాయవాది, బీఆర్‌ఎస్ నాయకుడు సోమ భరత్‌కుమార్ సైతం వచ్చారు. అప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు కవితను ఈడీ అధికారులు విచారించారు.