విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి నా రూటే సపరేటు అంటూ బీఆరెస్ పార్టీ రాజకీయాలకు భిన్నంగా తనదైన శైలీలో మహిళా, బీసీ సమస్యలను ఎజెండాగా చేసుకుని ముందుకెలుతున్న తీరు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అసెంబ్లీలో పూల విగ్రహ సాధన-బీసీ హక్కుల సాధన ఎజెండాతో యూనైటెడ్ పూలే ఫ్రంట్(యూపీఏ), భారత జాగృతి సంస్థల తరుపునా జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించుకుంటూ ఒక్కో జిల్లా చుట్టేస్తున్నారు. అయితే ఈ సదస్సులో ఆమె డిమాండ్ల పట్ల ఎవరికి అభ్యంతరాలు లేకున్నా వాటిని ఎంచుకున్న సందర్భం…వాటి కోసం ఆమె…వారి పార్టీ చేసిన కృషి ఏమిటన్న చర్చలు కూడా నీడలా సాగుతున్నాయి.
కవిత ఎజెండాలో మొదటగా తాను తన సంస్థ మహిళా సమస్యలపై ఆది నుంచి పనిచేస్తున్నామని, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పోరాటం నిర్వహించామని ఆమె చెప్పుకుంటుంది. మహిళా బిల్లుపై ఆమె పోరాటాలు రాజకీయ సందర్భాాన్ని అనుసరించే సాగాయే తప్ప నిరంతర ఉద్యమంలా కొనసాగించలేదన్నది నిర్వివాదంశం. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ సెంటిమెంట్ ఆసరాగా ఆమె మహిళలకు దగ్గరైనా దిగువ వర్గాల మహిళలకు ఆమె చేరువ కాలేకపోయింది. బతుకమ్మ చీరల పథకంలో ఆ చీరలను తను మాత్రం ధరించి బతుకమ్మ ఆడకపోవడాన్ని ఇప్పటికి ఆమె వ్యతిరేకులు లేవనెత్తుతుంటారు. మాటల గారడిలో, ఎత్తుగడ రాజకీయాల్లో తన తండ్రి, సోదరుడికి ధీటైన ప్రజ్ఞను కనబరిచే కవిత ప్రాబల్యం బీఆరెస్ పాలనా కాలంలో ఓ వెలుగు వెలిగింది. ఎంతలా అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె విచారణ ఎదుర్కోంటున్నప్పటికి పార్టీలోని పెద్ద వయసు నేతలు సైతం ఆమె పాదాభివందనం చేసే పరాకాష్టకు చేరింది. ఇప్పుడు తమ కుటుంబానికి రక్షణ గొడుగు వంటి అధికారం కోల్పోయాయక కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు కవిత కూడా తిరిగి జనం బాట పట్టాల్సిన పరిస్థితి అనివార్యమైంది.
బహుముఖ వ్యూహంతో ఎజెండా అంశాలు
కవిత ఎత్తుకున్న ఎజెండా అంశాలు చూస్తే తనకు ప్రజల్లో ఆదరణ పెంచుకోవడంతో పాటు తమ బీఆరెస్ పార్టీకి తనవంతు బలాన్ని అందించడం, అదే సమయంలో కేంద్ర-రాష్ట్రాల్లో అధికార పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టడం వంటి బహుముఖ వ్యూహాలు దాగి ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీసీల హక్కుల సాధనకు అవసరమైతే ఢిల్లీ దాకా పోరాటాలు చేయాలని, స్మార్ట్ ఉద్యమాలు చేయాలని కవిత జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాల్లో చెబుతున్నారు. ఇటీవల యూనైటెడ్ పూలే ఫ్రంట్-జాగృతిలు నిర్వహించిన బీసీ హక్కుల సాధన జిల్లా సదస్సులో కవిత మాట్లాడిన అంశాలు ప్రధాన చర్చనీయాంశలుగా నిలుస్తున్నాయి. కుల గణన 1931లో బ్రిటిష్ వారు చేశారని, తదనంతరం 1996-2006వరకు 4,500కోట్ల ఖర్చుతో జరిగిందని, అయితే యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ కులగణన నివేదికను తొక్కి పెట్టారని తద్వారా చేసిన ఖర్చు వృధాకాగా బీసీలకు అన్యాయం జరిగిందని కవిత ఆరోపించింది. అంతేకాకుండా బీసీల లెక్కతేలనిదే మహిళా రిజర్వేషన్ బిల్లులో మహిళలకు ఉపకోటా ఇవ్వలేమని చెప్పి సోనియాగాంధీ మహిళలకు అన్యాయం చేశారని ఆరోపించింది. ఆ తర్వాతా బీజేపీ వాళ్లు కులగణన ప్రయత్నం చేయలేదని , తాము తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకుని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అయితే ఇక్కడ సోనియాగాంధీ కులగణను తొక్కిపెట్టారన్న ఆరోపణలు చేసిన కవిత తన పార్టీ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టిందన్న అంశాన్ని విస్మరించడం విడ్డూరమేనంటున్నారు విశ్లేషకులు. పైగా నెహ్రు హయాంలో వేసిన కాలేల్కర్ కమిటీ మొదలు పలు కమిటీలు మహిళలను బీసీల్లో చేర్చాలని చెప్పినా ఏ ప్రభుత్వాలు చేయలేదని ప్రస్తావించిన కవిత తన పార్టీ ప్రభుత్వంలో మహిళలకు తెలంగాణ తొలి మంత్రి మండలిలో స్థానం కల్పించని నిర్వాకంపై ఏనాడు విచారం వ్యక్తం చేయకపోడాన్ని ప్రత్యర్థి మహిళా సంఘాలు మొదటి నుంచి ప్రశ్నిస్తునే ఉన్నాయి. మనమెంతో మనకంతా నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తు బీసీ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న కవిత తన పార్టీ పదేళ్ల కాలంలో జనాభా థామాషా ప్రాతినిధ్యాన్ని పార్టీ పదవుల్లో, అధికారిక పదవుల్లో, చట్టసభ టికెట్లలో ఎంతమేరకు అమలు చేశారన్న సోయి మరిచిపోయారా అన్న ప్రశ్న ఉదయించకమానదు.
విగ్రహాలతో స్ఫూర్తి మాటలకేనా
ఇక అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలన్న డిమాండ్‌పై ఇప్పటికే కవిత తన ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోంటున్నారు. కవితకు తన పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో పూలే విగ్రహం పెట్టాలన్న సోయి ఎందుకు రాలేదంటూ ఇప్పటికే వారు సెటైర్లు సంధిస్తున్నారు. తాను ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలన్న డిమాండ్‌తో ఉద్యమించి సాధించామని చెబుతున్న కవిత విగ్రహాలతో చట్టసభలకు వచ్చే నాయకులు స్ఫూర్తి పొందుతారంటున్నారు. అదే నిజమైతే 125అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిన కేసీఆర్‌కు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఎందుకు రాలేదో వారికే తెలియాలి. అదిగాక అంబేద్కర్ విగ్రహాం పెట్టిన కేసీఆర్ చిత్రంగా ఆయన రాజ్యంగాన్ని మార్చాలన్నప్పుడు ఎందుకు కవిత ఖండించలేకపోయారన్నది మరో బేతాళ ప్రశ్ననే.
అప్పుడు నిర్వీర్యం చేసి ఇప్పుడు డిమాండ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారని ఈ మేరకు బడ్జెట్‌లో 20వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు పెట్టకుండా 8వేల కోట్ల బడ్జెట్ పెట్టారని కవిత రౌండ్ టేబుల్ సమావేశాల్లో కవిత ప్రశ్నించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టిన ఎస్సీ సబ్ ప్లాన్‌ను తన పార్టీ ప్రభుత్వం స్వరాష్ట్రంలో నిర్వీరం చేసిన అంశం మరిచి తాను సబ్ ప్లాన్ డిమాండ్ చేయడం నేతీ బీరకాయ నెయ్యి చందంగా ఉంది. అలాగే కవిత కొత్తగా తను ఎంబీసీ కార్పోరేషన్ వేయాలని, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హామీలను తన డిమాండ్లుగా వినిపిస్తుండగా అవి కూడా ఆమె వైపు తిరగబడుతున్నాయి. పదేళ్ల తన పార్టీ ప్రభుత్వంలో వాటిని ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నతో పాటు బీసీ బంధును ఎన్నికల స్టంట్‌గా చేశారన్న విమర్శలు ఆమెకు ఎదురవుతున్నాయి.
కులగణనపై పార్టీ నీడ
కవిత ఎజెండాలో మరో డిమాండ్ కులగణనకు చట్టబద్ధత. బీహార్, ఏపీ, కర్ణాటకలలో చేసినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా చేయాలని కవిత డిమాండ్. ఇదే అంశాన్ని వారి పార్టీ బీఆరెస్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో వినిపించింది. చట్టబద్ధత చేస్తే నిర్ధేశత సమయంలో, బడ్జెట్ కేటాయింపులతో, ప్రత్యేక అధికార బృందంతో కులగణన సాగుతుందని కవిత ఆండ్ వారి పార్టీ వాదన. అయితే పదేళ్ల బీఆరెస్ పాలనలో చేయని కులగణనకు కనీసం తీర్మానంతోనైనా కాంగ్రెస్ సిద్ధపడిందన్నది ఆ వర్గాలకు కొంత ఊరటనిచ్చేదిగానే ఉంది. కులగణన సకాలంలో చేయకపోతే అందుకు కాంగ్రెస్ బాధ్యత వహించాల్సిందే. కులగణనకు చట్టబద్దతకు డిమాండ్ చేస్తున్న సందర్భంలో కవిత అసెంబ్లీ తీర్మానాలకు విలువ లేదంటు చట్టసభల తీర్మానాలను పలుచన చేయడం మరో విడ్డూరం. అసెంబ్లీ తీర్మానాలతో అయ్యేది లేదన్న కవిత చిత్రంగా అసెంబ్లీలో పూల విగ్రహం పెట్టాలని పంచాతీయతీల్లో తీర్మానాలు చేద్దామని చెప్పడం గమనార్హం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ కులగణన చేసి, స్థానిక సంస్థలలో 42శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, 23వేల మందికి బీసీలకు అవకాశం దక్కుతుందని చెప్పిందని కవిత తమ బీసీ రౌండ్ టేబుల్ సమావేశాల్లో వల్లే వేస్తున్నారు. కులగణన జరిగితే రిజర్వేషన్ లెక్కలు తేలిపోయి ఆ మేరకు రిజర్వేషన్లు అమలు చేయాల్సివుంటుంది. అలా చేయకపోతే కాంగ్రెస్‌కు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు.
బూమ్‌రాంగైన భట్టి వివాదం
యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కుల వివక్షతతో కూడిన అవమానం జరిగిందని ఎమ్మెల్సీ కవిత తాజాగా ఆరోపించారు. ఇదే సందర్భంలో తన పార్టీ అధినేత కేసీఆర్ హయాంలో దళితుల పట్ల చేసిన అనుచితాలు ఇప్పుడు ఆమెపైకి ఎదురుదాడి విమర్శనాస్త్రాలుగా మారుతున్నాయి. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల హామీలను పాతరేసిన వైనం..తొలి డిప్యూటీ సీఎం రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌తో సాగనంపిన తీరు..మాదిగలకు మంత్రిమండలిలో అవకాశమివ్వకపోవడం….కొప్పుల ఈశ్వర్‌ను ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ అవహేళన చేయడం వంటి ఘటనలతో కవితపై విమర్శనాస్త్రాలు వేస్తున్నాయి ప్రతిపక్షాలు.