Palla Rajeshwar Reddy | పల్లాకు చుట్టుకుంటున్న ముళ్ళు

Palla Rajeshwar Reddy | జనగామలో తెరవెనుక పాత్రధారి షోడసపల్లిలో నోరుజారిన వైనం మొరిగే కుక్కలను పిల్లులుగా మార్చేందుకు.. బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యాఖ్యలు బీటీ బ్యాచ్ స్పందనెలా ఉంటుందో? విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు తాను కొత్త వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఆయన మాట జారడం నుంచీ, చేతల వరకు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రస్తుతం మంచి హోదాలో ఉన్న పల్లా.. […]

Palla Rajeshwar Reddy | పల్లాకు చుట్టుకుంటున్న ముళ్ళు

Palla Rajeshwar Reddy |

  • జనగామలో తెరవెనుక పాత్రధారి
  • షోడసపల్లిలో నోరుజారిన వైనం
  • మొరిగే కుక్కలను పిల్లులుగా మార్చేందుకు..
  • బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యాఖ్యలు
  • బీటీ బ్యాచ్ స్పందనెలా ఉంటుందో?

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు తాను కొత్త వివాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఆయన మాట జారడం నుంచీ, చేతల వరకు వివాదాస్పదం అవుతున్నాయి. ప్రస్తుతం మంచి హోదాలో ఉన్న పల్లా.. ఎమ్మెల్యే కావాలనే ఆశతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, జనగామలో తెరవెనుక కదుపుతున్న పావులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

జనగామ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న పల్లా, అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో ఒక వర్గాన్ని పెంచిపోషిస్తున్నారు… ప్రజాప్రతినిధులను తనవైపు తిప్పుకునేందుకు డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు గురి చేస్తున్నారని స్వయంగా అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి విమర్శించారు. పల్లా గో బ్యాక్ అంటూ నిరసనకు దిగారు. అయినప్పటికీ తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లిపై కూడా మండిపడుతున్నారు.

పల్లాకు ప్రగతిభవన్ అండగా ఉందనే ధీమాతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా పల్లా అహంకారంతో వ్యవహరిస్తున్నారని ముత్తిరెడ్డి మండిపడుతున్నారు. ప్రజల్లో పలుకుబడిలేని పల్లా డబ్బు రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని విమర్శించారు. ఒక వైపు జనగామ సెగ్మెంట్ గులాబీ పోరుతో భగభగమండుతున్నది.

ఈ నేపథ్యంలో తన స్వగ్రామం షోడశపల్లిలో పల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని, సంచలనాన్ని సృష్టించాయి. దీనిపై ఆయన ఖండించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రగతిభవన్ దూతగా, సీఎం అనుచరునిగా పల్లా స్పందన పైన అధినేత ఏ విధంగా ప్రతిస్పందిస్తారో చూడాలి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

కుక్కులతో పోల్చి..

పల్లా రాజేశ్వర్ రెడ్డి తాజాగా తన స్వగ్రామం షోడసపల్లిలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను కుక్కులతో పోల్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అటు వైపు ఉంటే మొరుగుతారని అన్నారు. బీఆర్ఎస్ లోకి తీసుకుని దొడ్డిలో కట్టేశామని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ జిల్లా రాజేశ్వర్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు.

బుధవారం ఆయనను కలవడానికి వేలేరు మండలం షోడషవల్లి గ్రామానికి కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పల్లా చేసిన వ్యాఖ్యలకు కార్యకర్తలు గొల్లుమని నవ్వారు. చప్పట్లుకొట్టి, ఈలలు వేశారు.

పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటల్లోనే ‘కేసీఆర్ అటు వైపు ఉన్న కుక్కలను పిల్లిలాగా మార్చారని అన్నారు. ఉద్యమకారులతో పాటు ఆ పార్టీ నుంచి తీసుకొని పదువులివ్వడం ఎందుకు సార్ అని కేసీఆర్ ను అడిగాను. చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో మనం సుస్థిరత సాధించాలంటే ఖచ్చితంగా తీసుకోవాలన్నారు.

88 మంది ఎమ్మెల్యేలున్న చోట కూడా మల్ల తీసుకుంటున్నారెందుకు సార్ అని అడిగాను. ఇవ్వాళ ఉన్న పరిస్థితుల్లో అటు వైపు ఉండి కుక్కల్లా మాట్లాడుతున్నారని, ఆ కుక్కనే ఇటేస్తే అయిపోతుందిగా, మొత్తం పిల్లిలాగ అయిపోతుందని చెప్పిండు సార్. ఎందుకంటే గిరిగీస్తే వాడెం చేస్తడు.. బయటి వాడైతే మనమీద వదిలిపెడుతడు. గిరిలోపల ఉంటే మనం చెప్పినట్లు వింటడంటూ’ పల్లా వ్యాఖ్యానించారు.

ఇంకా పదవులూ, పంపకాల గురించి మాట్లాడుతూ జనగామ అభ్యర్థిగా సమర్థత ఉన్న వారికే వస్తాయని, డబ్బులిస్తే రావని గుర్తించాలంటూ మాట్లాడారు. తన సొంత పార్టీలో తనకు పోటీగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లిని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడారని భావిస్తున్నారు.

తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: పల్లా

తన వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ప్రకటనను విడుదల చేశారు. “ఇతరపార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చినట్లు నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. ప్రజలు దీన్ని నమ్మొద్దు. నా వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని పేర్కొన్నారు.