రసకందాయంలో జనగామ రాజకీయం

రసకందాయంలో జనగామ రాజకీయం
  • రాజకీయం రోజుకో మలుపు
  • పొన్నాలను కలిసిన కేటీఆర్
  • బీఆరెస్‌లో చేరాలని ఆహ్వానం
  • పార్టీలో చేరేందుకు పొన్నాల ఓకే
  • జనగామ టికెట్ ఒప్పందంతో చేరిక?
  • 15న కేసీఆర్‌తో భేటీ.. 16న చేరిక
  • పల్లాకు చేజారనున్న జనగామ సీటు!



విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ రాజకీయం రసకందాయంలో పడింది. నిన్నటి వరకు బీఆర్ఎస్‌లో ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా అన్నట్టు సాగిన వివాదం సద్దుమణిగిందని అనుకున్నలోపే పొన్నాల ఎంటర్ కావడంతో పరిస్థితి రంజుగా మారింది. జనగామ బీఆర్ఎస్ రాజకీయం రోజుకు మలుపు తిరుగుతున్నది.


జనగామ బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకే


పొన్నాల బీఆర్ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్లే. ఆయనకు జనగామ టికెట్ ఇస్తారా లేదా అనేది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అంతర్గతంగా మాత్రం ముందస్తు టికెట్ ఒప్పందం మేరకే పొన్నాల బీఆరెస్‌లో చేరబోతున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతగా, బీసీ కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకునిగా పొన్నాలకు గుర్తింపు ఉన్నది. అలాంటి నాయకుడిని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వకపోతే పొన్నాలకు ముఖమెత్తుకోలేని ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.


అంతేకాకుండా.. బీఆరెస్‌ ఏ రాజకీయ ప్రయోజనం కోసమైతే ఆయనను పార్టీలోకి తీసుకుందో అది నెరవేరకపోయే అవకాశాలూ ఉంటాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పై ఉన్న ఆరోపణలు నిజమై, అనుమానాలు నెలకొనే అవకాశం ఉంది. ఈ కారణంగానే పొన్నాలకు జనగామ టికెట్ గ్యారెంటీ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. కాకుంటే రెండు రోజుల సస్పెన్ష్ ముందు పెట్టి 16వ తేదీన బహిరంగ సభ వేదిక నుంచి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. 



పాపం పల్లా రాజేశ్వర్ రెడ్డి


జనగామ టికెట్ ఆశించి భంగపడిన సిటింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించి బరి నుంచి తప్పుకొన్నారు. కాకపోతే గత కొంతకాలంగా నిందలు, తిట్లు భరించి ఎట్టకేలకు టికెట్ తనకే అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూర్తి భరోసాతో ఉన్నారు. ఒకవేళ జనగామ టికెట్‌ పొన్నాలకు ఇచ్చే పక్షంలో పల్లాకు ఎలా నచ్చజెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.


పరిస్థితి చూస్తే.. చేతి కందిన పండు నోటి కందకుండా పోయినట్లు పల్లాకు సీటు చేజారి పోయినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రగతి భవన్‌కు దగ్గర మనిషిగా గుర్తింపు పొందిన పల్లా.. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. జనగామ టికెట్‌పై కేసీఆర్ కూడా ఇంకా అధికారికంగా ప్రకటించనందున మాట మార్చే అవకాశాలు లేకపోలేదు. తమ నేతదే టికెట్‌ అనుకున్న పల్లా అనుచరులు తాజా పరిణామంపై ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆయనను వ్యతిరేకించిన వర్గం మాత్రం.. ‘బాగా’ అయిందని అభిప్రాయపడుతున్నారు.


పొన్నాల ఇంటికి కేటీఆర్


మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వెళ్ళి కలిశారు. హైదరాబాదులో పొన్నాలని కేటీఆర్ కలిసి బీఆర్ఎస్ లోకి స్వయంగా ఆహ్వానించారు. దీనికి పొన్నాల కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. 15వ తేదీన సీఎం కేసీఆర్‌ను పొన్నాల కలిసిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారంటూనే, ఈ నెల 16న జనగామలో జరిగే సభలో కేసీఆర్ సమక్షంలో పొన్నాల పార్టీలో చేరుతారని కేటీఆర్ చెప్పడం కొసమెరుపు.


ముందస్తు ఒప్పందం మేరకే


ఇరువురి మధ్య ఇంతకుముందే ప్రాథమిక స్థాయిలో ప్రతిపాదనలు సాగినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నారు. పొన్నాలకు రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ ఇచ్చి ప్రభుత్వం వచ్చాక మంత్రిపదవి ఇస్తామని బీఆర్ఎస్ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే పొన్నాల మాత్రం జనగామ టికెట్ కోసం పట్టుబట్టి ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. తనకు ఇవే చివరి ఎన్నికలని, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమివ్వాలని పొన్నాల కోరారని సమాచారం.



 

ఈ మేరకు జనగామ అభ్యర్థిత్వానికి కేసీఆర్ ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని బీఆరెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మాజీ పీసీసీ చీఫ్, సీనియర్ బీసీ నేతగా ఉన్న పొన్నాలకు అవకాశమిస్తే పార్టీకి మేలు జరుగుతుందన్న దిశగా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా వైపు ఆ పార్టీ మొగ్గు చూపిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో పొన్నాల చేరిక రాజకీయ ప్రయోజనం చేకూరనున్నందున ఆయనకు ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నారు. లేకుంటే పొన్నాల చేరిక వల్ల ఆయనకేం ప్రయోజనం చేకూరదని అంటున్నారు.


ఈ నెల 16వ తేదీన జనగామలో బీఆరెస్‌ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నందున ఈ సందర్భంగా కేసీఆర్ సమక్షంలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు భావిస్తున్నారు. అదే రోజు పొన్నాలను జనగామ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్, పొన్నాలను కలువడం, ఇరువురి మధ్య జరిగే ప్రతిపాదనలను కేటీఆర్, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడం, తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామనడం లాంఛనప్రాయమైన, పైకి చెప్పే మాటలుగా అభివర్ణిస్తున్నారు.


రేవంత్ పై కేటీఆర్ ఫైర్


సచ్చేముందు పార్టీ మారడం ఏంటని పొన్నాల నుద్దేశించి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. పొన్నాలను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత, బీసీ సామాజిక వర్గంలో గొంతు ఉన్న నేతను రేవంత్ రెడ్డి చచ్చేముందు పార్టీ మారడానికి సిగ్గుండాలని అనడం దుర్మార్గమని అన్నారు.



ఒక సీనియర్ నేత గురించి ఇంత చిల్లరగా మాట్లాడడం ఏంటంటూ ప్రశ్నించారు. కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టినట్లు రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇవ్వడం వల్ల ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ఓటుకు నోటు దొంగ అంటూ మండిపడ్డారు. రాజకీయాలను అధమస్థాయికి దిగజార్చుతున్నారని విమర్శించారు. ఈ దొంగ.. డబ్బు సంచులకు టికెట్ అమ్ముకున్నదంతా రాష్ట్రం చూస్తోందన్నారు.


రేవంత్‌కు పొన్నాల కౌంటర్


ఈ వయసులో బీఆరెస్‌లో చేరేందుకు సిగ్గుండాలని పొన్నాలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై పొన్నాల తీవ్రంగా ప్రతిస్పందించారు. కేటీఆర్ పొన్నాలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలు సిగ్గులేని వారు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. వీటి గురించి మాట్లాడడం చాలా బాధాకరమని, నాయకుడు అంటే కలిసి పోవాలని, కలుపుకొని పోవాలని, ఐక్యతను చాటాలంని చెప్పారు.


గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి హయంలో హైదరాబాద్ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఓడిపోలేదా? ఉప ఎన్నికల్లో ఓడిపోలేదా? అంటూ ప్రశ్నించారు. 40 ఏండ్లు కాంగ్రెస్ లో పని చేస్తే ఆ మేరకు సేవ కూడా చేశానని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ను కలిసిన అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని పొన్నాల చెప్పారు.