జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా

- బీ ఫారం అందజేసిన కేసీఆర్
- పొన్నాల భవితవ్యం ఏంటో?
- కేసీఆర్‌ది ధృతరాష్ట్ర కౌగిలనే విమర్శ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ బీఆరెస్ టికెట్ మలుపుల్లో పల్లానే చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు జనగామ బీఆర్ఎస్ టికెట్ ఖాయమనే ఊహాగానాలను తారుమారు చేస్తూ, పల్లా రాజేశ్వరెడ్డికే కేసీఆర్ పట్టం కట్టారు. పొన్నాల రాకతో పల్లాకు ఖాయం అనుకున్న జనగామ సీటులో మార్పు తప్పదని భావించారు. ప్రగతి భవన్ కు దగ్గర అయిన పల్లాకు మరో ప్రత్యామ్నాయ అవకాశం కల్పిస్తారని శనివారం అంతా గులాబీ వర్గాల్లో జోరుగా చర్చ సాగింది.
రాజకీయ పరిశీలకులు కూడా పల్లాను కాదని పొన్నాలకే జనగామ టికెట్ దక్కుతుందని భావించారు. పొన్నాల బీఆర్ఎస్ లో చేరడం వల్ల కలిగే ప్రయోజనం కంటే, టికెట్ ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీ మారుతున్నందున పొన్నాలకు కూడా సముచిత గౌరవం దక్కినట్లుగా ఉంటుందని చర్చ సాగింది. కానీ దీనికి భిన్నంగా కేసీఆర్ ఆదివారం తనదైన శైలిలో నిర్ణయం తీసుకున్నట్లు భావించాల్సి వస్తుంది.
పల్లాకే బీ ఫామ్
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా బీ ఫామ్ ను సీఎం కేసీఆర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అందించారు. దీంతో ఇప్పటివరకు ఉన్న ఊహాగానాలు పటాపంచలయ్యాయి. దీంతో పల్లా బీఆర్ఎస్ జనగామ అభ్యర్థిగా తేలిపోయింది. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప మార్పు ఉండకపోవచ్చు అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పొన్నాలకు లభించే హామీ ఏంటి?
కాంగ్రెస్ పార్టీని కాదని బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన పొన్నాల ఆదివారం సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. ఇరువురి మధ్య జరిగే చర్చల్లో పొన్నాల తన మనసులోని మాటను కేసీఆర్ ముందు ప్రతిపాదించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ పొన్నాలకు ఏ హామీ ఇస్తారనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. కాంగ్రెస్ లో నాలుగు దశాబ్దాలు పనిచేసి, అనేక పదవులు, ప్రాధాన్యతలు పొందిన పొన్నాలను బీఆర్ఎస్ ఏవిధంగా గౌరవిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొన్నాలకు సముచిత స్థానం ఇవ్వకపోతే అటు బీఆర్ఎస్ లోనే కాకుండా ఇటు కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందనే విషయం బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా తెలిసిందే.
డీఎస్ బాటలో పొన్నాల
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కిన ప్రముఖ నాయకులు ఆ పార్టీలో తగినంత ప్రాధాన్యత లేదని విమర్శలు ఉన్నాయి. కేశవరావు లాంటి వాళ్లకు పదవులు ఉన్నప్పటికీ మాట్లాడే స్వేచ్ఛ లేదని అభిప్రాయం ఉంది. ఇక డీ శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిందే. కేసీఆర్ తో స్నేహం చేసిన ఆలే నరేంద్ర, ఆ తరువాత విజయశాంతి, కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ ల పరిస్థితి ఏమైందనేది బహిరంగ సత్యమే. అదే బాటలో పొన్నాల పరిస్థితి కూడా ఉంటుందని విమర్శ అప్పుడే కాంగ్రెస్ ప్రారంభించింది. కేసీఆర్ ది ధృతరాష్ట్ర కౌగిలి అనేవారూ ఉన్నారు. ఈ దశలో పొన్నాలకు కేసీఆర్ ఏ ఆఫర్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.